Shibu Soren: ఝార్ఖండ్ మాజీ సీఎం శిబూసోరెన్ కన్నుమూత
ఝార్ఖండ్ మాజీ సీఎం శిబూసోరెన్ కన్నుమూత
Shibu Soren : ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబూసోరెన్ (81) కన్నుమూశారు. గత కొంతకాలంగా మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న శిబూసోరెన్… సోమవారం దిల్లీలోని గంగారాం ఆస్పత్రిలో ఆయన తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు, ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ‘‘మన ప్రియనేత దిషోమ్ గురూజీ మనల్ని విడిచివెళ్లిపోయారు. నాకు సర్వం కోల్పోయినట్టుగా ఉంది’’ అని ఉద్వేగపూరితంగా రాసుకొచ్చారు.
Shibu Soren No More
ప్రస్తుతం బిహార్‌లో భాగమైన రామ్‌గఢ్ జిల్లాలో శిబూసోరెన్ (Shibu Soren) జన్మించారు. ఆయన సతీమణి పేరు రూపీ సోరెన్. ఆయనకు నలుగురు సంతానం. ముగ్గురు కుమారులు హేమంత్, బసంత్, దుర్గా సోరెన్. కుమార్తె పేరు అంజలి. 2009లో దుర్గా సోరెన్ మృతి చెందారు. బసంత్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. సంతాల్ కమ్యూనిటీకి చెందిన శిబు సోరెన్… వామపక్ష నేత ఏకే రాయ్, కుర్మి మహతో బినోద్ బిహారీ మహతోతో కలిసి 1972లో ఝార్ఖండ్ ముక్తి మోర్చా(JMM)ను ఏర్పాటు చేశారు. తర్వాత ప్రత్యేక రాష్ట్రం కోసం చేసిన పోరాటంలో కీలక నేతగా ఎదిగారు. ఆ పోరాట ఫలితంగా 2000లో ఝార్ఖండ్ రాష్ట్రంగా ఏర్పడింది. 2005లో ఆయన తొలిసారి సీఎం అయ్యారు.
ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటికీ… ఒక్కసారి కూడా పూర్తికాలం పదవిని నిర్వహించలేకపోయారు. 2004లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ క్యాబినెట్ లో మంత్రిగా బాధ్యతలు స్వీకరించినా… అక్కడా అదే పరిస్థితి. 1974 నాటి కేసు కారణంగా రాజీనామా చేయాల్సి వచ్చింది. తన మాజీ కార్యదర్శి హత్య కేసులో దోషిగా తేలడంతో మరోసారి కేంద్రమంత్రి పదవిని కోల్పోయారు. ఒక హత్యకేసులో కేంద్రమంత్రి దోషిగా తేలడం అదే తొలిసారి. అయితే దిల్లీ హైకోర్టు తర్వాత ఆయన్ను నిర్దోషిగా తేల్చింది. శిబూ సోరెన్ (Shibu Soren) కు నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది. ఆయన ఎనిమిది సార్లు లోక్‌సభ, రెండు సార్లు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు.
ఆయన మృతిపట్ల రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలియజేశారు. ‘‘శిబూసోరెన్‌జీ అట్టడుగు స్థాయి నుంచి ప్రజాజీవితంలో ఉన్నతస్థాయికి ఎదిగారు. ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. గిరిజనులు, పేదలు, అణగారిన వర్గాలకు సాధికారత కల్పించడం కోసం కృషి చేశారు. ఆయన మరణం బాధాకరం. ఇప్పుడు ఆయన కుటుంబం, అభిమానుల గురించే నా ఆలోచనంతా. ఇప్పటికే హేమంత్ సోరెన్‌జీతో మాట్లాడాను. ఓం శాంతి’’ అని మోదీ ఎక్స్ వేదికగా వెల్లడించారు.
శిబూసోరెన్ మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నేత శిబూ సోరెన్ (Shibu Soren) మృతిపట్ల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీనియర్ నాయకుడైన శిబూ సోరెన్ మృతి దేశానికి తీరని లోటన్నారు వైఎస్ జగన్. గిరిజన సంక్షేమం కోసం శిబూ సోరెన్ చేసిన కృషి చిరస్మరణియమని కొనియాడారు. ఈ మేరకు శిబూ సోరెన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానంటూ వైఎస్ జగన్ తన సోషల్ మీడియా హ్యాండిల్ ‘ఎక్స్’ ద్వారా ట్వీట్ చేశారు.
Also Read : Samajwadi Party: సమాజ్‌వాదీ నేతలపై కేసు నమోదు చేసిన యూపీ పోలీసులు
