Manmohan Singh : మన్మోహన్ కు జీవిత సాఫల్య పురస్కారం
ఇండియా-యుకె అచీవర్స్ ప్రకటన
Manmohan Singh : భారత దేశ మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ చేసిన సేవలకు గుర్తింపుగా జీవిత సాఫల్య పురస్కారం (లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు) లభించింది. గత వారం జరిగిన అవార్డుల వేడుకలో ప్రకటించిన ఈ గౌరవాన్ని నేషనల్ ఇండియన్ స్టూడెంట్స్ అండ్ అలుమ్ని యూనియన్ (ఎన్ఐఎస్ఏయూ) యుకే ద్వారా న్యూఢిల్లీలో డాక్టర్ సింగ్ కు అందజేయనున్నారు.
ప్రపంచంలో పేరొందిన ఆర్థిక వేత్తలలో డాక్టర్ మన్మోహన్ సింగ్(Manmohan Singh) ఒకరు. భారత దేశం , యునైటెడ్ కింగ్ డమ్ మధ్య సత్ సంబంధాలను కలిగి ఉండేలా చేయడంలో కీలక పాత్ర పోషించినందుకు ఈ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ పురస్కారాన్ని అందజేసినట్లు అవార్డుల కమిటీ ప్రకటించింది. అంతే కాదు రాజకీయ , ఆర్థిక రంగాలలో ఇతోధికంగా సేవలు కలిగి ఉన్నందుకు దీనిని ఇచ్చినట్లు తెలిపింది.
భారత దేశంలోని బ్రిటిష్ కౌన్సిల్ ,యుకె డిపార్ట్ మెంట్ ఫర్ ఇంటర్నేషనల్ ట్రేడ్ (డీఐటీ) భాగస్వామ్యంతో ఎన్ఐఎస్ఏయూ యుకే ద్వారా భారత దేశం – యుకె అచీవర్స్ ఆనర్స్ , బ్రిటిష్ విశ్వ విద్యాలయాలలో చదివిన భారతీయ విద్యార్థుల విజయాలను జరుపుకుంటారు. జీవిత సాఫల్య పురస్కారానికి తనను ఎంపిక చేసినందుకు సంతోషం వ్యక్తం చేశారు మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్.
రెండు దేశాల మధ్య ఉన్న బంధాన్ని మరోసారి గుర్తు చేసిందని పేర్కొన్నారు. దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ , సర్దార్ పటేల్ తదితర ప్రముఖులు యుకెలో చదివి గొప్పవారుగా ఎదిగారని ఈ సందర్భంగా గుర్తు చేశారు మాజీ ప్రధానమంత్రి.
Also Read : సరైన మార్గంలో ఆర్థిక రంగం – నిర్మల