Car Door: విజయనగరంలో ఘోర విషాదం ! కారులో ఊపిరి ఆడక నలుగురు చిన్నారుల మృతి !

విజయనగరంలో ఘోర విషాదం ! కారులో ఊపిరి ఆడక నలుగురు చిన్నారుల మృతి !

Car Door : విజయనగరం రూరల్ మండలం ద్వారపూడి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామంలో పార్కింగ్ చేసి ఉన్న కారులోనికి నలుగురు చిన్నారులు ఆడుకుంటూ వెళ్ళారు. ఇంతలో కారు డోర్ లాక్ పడటంతో ఊపిరాడక ముగ్గురు బాలికలు సహా నలుగురు చిన్నారులు మృతి చెందారు. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అక్కచెల్లెళ్ళు ఉన్నారు. దీనితో ద్వారపూడి గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…

Car Door Lock Issue

విజయనగరం(Vizianagaram) రూరల్ మండలం ద్వారపుడి గ్రామంలో ఆదివారం ఉదయం నలుగురు చిన్నారులు ఆడుకునేందుకు బయటకు వెళ్లారు. ఎంతసేపైనా తిరిగి రాలేదు. వారి తల్లిదండ్రులు వెతికినా కనిపించలేదు. చివరికి స్థానిక మహిళా మండలి కార్యాలయం వద్ద ఆగి ఉన్న కారులో నలుగురు చిన్నారుల మృతదేహాలను అక్కడున్నవారు గుర్తించారు. సరదాగా ఆడుకునేందుకు కారులోపలికి వెళ్లిన తర్వాత.. లాక్‌ పడటంతో ఊపిరి ఆడక మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతులను మంగి ఉదయ్‌ (8), బూర్లె చారుమతి (8), బూర్లె చరిష్మా (6), కంది మనస్విని (6)గా గుర్తించారు. వీరిలో చారుమతి, చరిష్మా అక్కాచెల్లెళ్లు. ఒకేసారి నలుగురు పిల్లలు కన్నుమూయడంతో ద్వారపూడిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చిన్నారుల మృతదేహాలను పట్టుకుని తల్లిదండ్రులు, బంధువులు రోధించడం చూపరులను కన్నీటిపర్యంతానికి గురిచేసింది.

స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు… పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాలను విజయనగరం(Vizianagaram) జిజిహెచ్ కు తరలించారు. చిన్నారుల మృతిపై జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్…తన సంతాపాన్ని తెలియజేసారు. విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అతిధి విజయలక్ష్మి… హుటాహుటీన విజయనగరం జిజిహెచ్ కు వెళ్లారు…. మృతుల కుంటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… చిన్నారుల మృతి అత్యంత బాధకరమని… వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ఇవ్వాలని ఆ దేవుడ్ని కోరకుంటున్నట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ఈ ఘటనకు గల కారణాలను అన్వేషించి… బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. అంతేకాకుండా ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి… కుటుంబాలకు సహాయ సహకారాలు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.

ఇదిలా ఉండగా, చిత్తూరు జిల్లా కుప్పం మండలం దేవరాజపురం గ్రామానికి చెందిన ముగ్గురు పిల్లలు అడుకుంటూ నీటి కుంటలో పడి గౌతమి(7), షాలిని(6), అశ్విన్(7) అనే ముగ్గురు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. ఒకే కుటుంబానికి చెందిన పిల్లలు గౌతమి, శాలిని, అశ్విన్ నీటి కుంటలో దిగి ప్రాణాలు కోల్పోవడంపై సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. బిడ్డల మృతితో తీవ్ర శోకంలో ఉన్న వారి తల్లిదండ్రులకు సిఎం సానుభూతి తెలిపారు. ఇక, ఏలూరు జిల్లాలో జల్లేరు జలాశయం చూసేందుకు వెళ్లిన షేక్ సిద్ధిఖ్(10), అబ్దుల్(7)నీట మునిగి ప్రాణాలొదిలారు. ఇలా ఈ ఒక్కరోజులో మొత్తం తొమ్మిది మంది చిన్నారులు దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయారు.

Also Read : Nandigam Suresh: మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్

Leave A Reply

Your Email Id will not be published!