Gaddar Comment : ప్రజా వాగ్గేయకారుడా అల్విదా
మూగ బోయిన ఆర్తి గీతం
Gaddar Comment : పాటై ప్రవహించి, గానమై జ్వలించి దివికేగిన ప్రజా యుద్ద నౌక చివరి చూపు కోసం వేలాది మంది జనం తరలి వచ్చారు. ఎవరో పిలుపు ఇస్తే వచ్చిన వాళ్లు కాదు. పీడితులు, తాడితులు, పేదలు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరూ జనం గొంతుకై తనను తాను నిరూపించుకున్న గద్దర్ ఇక సెలవంటూ వెళ్లి పోయారు. తాను పాడలేనంటూ..మనకు తన గాత్రాన్ని వదిలేసి పోయాడు. ఎవరీ గద్దర్ ఎందుకింత జనం ఆక్రోశిస్తున్నారు. గుండెలు అవిసేలా ఏడుస్తున్నారు. ఏముంది ఆయనలో. గోచి , గొంగడి తప్ప. ఈ దేశంలో ఇలాంటి గాయకుడు కూడా ఉంటారా అని విస్తు పోయేలా చేసిన ఏకైక యుద్ద నౌక జనం గొంతుక గద్దర్(Gaddar). పాటంటే చైతన్యం అని, పాటంటే దట్టించిన తూటా అని, పాటంటే ప్రజల చేతుల్లో ఆయుధమని చాటి చెప్పిన అరుదైన వ్యక్తి గద్దర్. పోరాటాలకు, ఉద్యమాలకు చిరునామాగా పేరు పొందిన తెలంగాణలో పుట్టిన యోధుడు గుమ్మడి విఠల్ రావు. కోట్లాది ప్రజలను తన ఆట, పాటలతో గుండెల్ని తడిమిన ఆ గొంతు ఇప్పుడు మూగ బోయి ఉండడం కన్నీళ్లను తెప్పిస్తోంది.
Gaddar Comment No More
ఆయనే చివరి సారి పాడుకుంటున్నట్లు మూగ బోయిన గొంతులో జీవం ఎవరు పోసేరో అని..అమ్మా తెలంగాణమా అని ఆక్రోశించిన ఆ గొంతు లోంచి మళ్లీ పాట పెకలదు. మళ్లీ జ్వలించదు..నైజాం సర్కరోడా అంటూ నిగ్గ దీసి ప్రశ్నించిన ఆ స్వరం ఇక మనల్ని తడమదు. అసమానతలతో నిండి పోయిన ఈ సమాజాన్ని ప్రశ్నించాడు. చచ్చు బడి పోయిన జనాలను జ్వలించేలా చేసిన ప్రజా వాగ్గేయకారుడు గద్దర్(Gaddar). ఒక వ్యక్తి కాదు శక్తి. కేవలం ఒకే ఒక పాటతో, మాటతో, ఆటతో లక్షలాది జనాలను ఉర్రూతలూగించి గంటల తరబడి నిలబడే చేసిన ఏకైక పాటగాడు ఒకే ఒక్కడు. చిన్న గాయం అయితే తట్టుకునేందుకు తల్లడిల్లే శక్తి లేని ఈ రోజుల్లో ఏకంగా తన శరీరంలో తూటాను పెట్టుకుని జనం కోసం గానం చేసిన పాటల యోధుడు గద్దర్. ప్రపంచంలో ప్రజల కోసం వకల్తా పుచ్చుకుని పాడిన వాళ్లున్నారు. కానీ తూటాతో సహవాసం చేసి యుద్దం ప్రకటించిన ఏకైక సింగర్ ఒక్కడు గద్దర్.
ఎన్నో పోరాటాల వెనుక ఆయన ఉన్నారు. మరెన్నో ఉద్యమాలకు ఊపిరి పోశాడు. రాదని అనుకున్న తెలంగాణ మలి దశ ఉద్యమానికి తన పాటతో చైతన్యవంతం చేసిన గాయకుడు. నీవు ఏమిటో నీ చావు చెబుతుంది. కానీ ఇవాళ గద్దర్ కోసం లక్షలాది గుండెలు పలవరిస్తున్నాయి. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమై ప్రవహించిన వాడు. గానమై అల్లుకు పోయాడు. తెలంగాణమై, దేశమై ప్రపంచమై వ్యాపించాడు. పీడితులు, దోపిడీ, అసమానతలు, మోసం, దగా ఉన్నంత కాలం ప్రజా యుద్ద నౌక గద్దర్ పాటలు ప్రశ్నిస్తూనే ఉంటాయి..నిలదీస్తూనే ఉంటాయి. గద్దర్ కు మరణం లేదు..సూర్య చంద్రులు ఉన్నంత కాలం యుద్ద నౌక కొనసాగుతూనే ఉంటుంది..మనల్ని తడుతుమూనే ఉంటుంది. గద్దరన్నా ఇక అల్విదా..
Also Read : G Kishan Reddy : పాటల యోధుడు గద్దర్ – కిషన్ రెడ్డి
ధన్య వాదాలు పారుపల్లి శ్రీధర్ గారు
ప్రజా గాయకుడు, వాగ్గేయకారుడు గద్దర్ కు మీ.అక్షర నివాళి చక్కగా వుంది భాస్కర్ గారు. అభినందనలు.