Gali Janardhana Reddy: ఓబుళాపురం మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డికి ఏడేళ్ళు జైలు శిక్ష
ఓబుళాపురం మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డికి ఏడేళ్ళు జైలు శిక్ష
Gali Janardhana Reddy : అనంతపురం జిల్లా ఓబుళాపురం అక్రమ మైనింగ్ (ఓఎంసీ) కేసులో హైదరాబాద్ సీబీఐ కోర్టు గాలి జనార్దన్ రెడ్డి(Gali Janardhana Reddy) సహా నలుగురికి ఏడేళ్ల పాటు జైలు శిక్ష విధించింది. దాదాపు 15 ఏళ్ల పాటు సుదీర్ఘ విచారణ అనంతరం ఈ కేసులో మొత్తం ఐదుగురిని దోషులుగా, ఇద్దరిని నిర్దోషులుగా ప్రకటిస్తూ మంగళవారం కోర్టు తుది తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ప్రధాన నిందితులైన గాలి జనార్దన్ రెడ్డి, బీవీ శ్రీనివాసరెడ్డి, మెఫజ్ అలీఖాన్, గనుల శాఖ అప్పటి డైరెక్టర్ వీడీ రాజగోపాల్ ను దోషులుగా నిర్ధారిస్తూ ఒక్కొక్కరికీ ఏడేళ్ల పాటు శిక్ష, రూ.10వేలు చొప్పున జరిమానా విధించింది. ఈ కేసులో దోషిగా తేలిన ఓబుళాపురం మైనింగ్ కంపెనీ(ఓఎంసీ)కి కోర్టు రూ.2 లక్షలు జరిమానా విధించింది. దీనితో దోషులను అధికారులు చంచల్ గూడ జైలుకు తరలించారు. కోర్టులోనే వైద్యులు వీరికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం కోర్టు నుంచి చంచల్‌గూడ జైలుకు తీసుకెళ్లారు.
Gali Janardhana Reddy – న్యాయం గెలిచింది – ప్రధాన సాక్షి టపాల్ శ్యాంప్రసాద్
ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో సీబీఐ కోర్టు(CBI Court) ఇచ్చిన తీర్పుపై ప్రధాన సాక్షి టపాల్ శ్యాంప్రసాద్ స్పందించారు. “తప్పు చేసిన వారెవరూ న్యాయ దేవత నుంచి తప్పించుకోలేరని సీబీఐ కోర్టు తీర్పుతో మరోసారి రుజువైంది. అంతిమంగా న్యాయం గెలిచింది. గాలి జనార్దన్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డితోపాటు మరికొందరిని ఏడేళ్ల జైలుశిక్ష పడటాన్ని స్వాగతిస్తున్నాం. సుదీర్ఘ పోరాటం అనంతరం వారికి శిక్ష పడింది. గాలి జనార్దనరెడ్డి(Gali Janardhana Reddy) ఇప్పటికైనా తన ఆత్మసాక్షిగా దేవుడి ముందు క్షమాభిక్ష కోరుకోవాలి. సీబీఐ సీజ్ చేసిన ఇనుప ముడిఖనిజం దొంగతనం జరిగింది. దానిపైనా కేసు నమోదు చేసి విచారించాలని ఫిర్యాదు చేశాం. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, గనుల మంత్రి కొల్లు రవీంద్ర దీనిపై దృష్టి పెట్టి, న్యాయం చేయాలి. మా మైనింగ్ మెటీరీయల్‌ను మాకు ఇప్పించాలి” అని ఆయన ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో పేర్కొన్నారు.
జనార్దనరెడ్డి రాజకీయ భవిష్యత్తు ‘గాలి’కి పోయినట్టేనా
ఓబుళాపురం గనుల కేసులో దోషిగా తేలిన నేపథ్యంలో కర్ణాటక మాజీ మంత్రి, గంగావతి శాసనసభ్యుడు గాలి జనార్దనరెడ్డి రాజకీయ జీవితం డోలాయమానంలో పడింది. మంగళవారం సీబీఐ నాంపల్లి కోర్టు ఆయనకు ఏడేళ్ల జైలు శిక్ష విధించటంతో ఇటీవలే రాజకీయ పునరుజ్జీవనానికి ‘గాలి’ చేస్తున్న ప్రయత్నానికి గండిపడినట్లయింది. ఇదే కేసులో 2011లో అరెస్టయిన గాలి జనార్దనరెడ్డి మూడేళ్ల నాలుగు నెలలపాటు కారాగారవాసం అనుభవించారు. కనీసం నాలుగేళ్లకు పైగా ఆయన మరోసారి జైలు జీవితాన్ని అనుభవించాలి. దీనితో శాసనసభ్యుడిగా నెగ్గిన ఆయన ప్రజాప్రాతినిధ్య చట్టం- 1951 ప్రకారం ఆ పదవి కోల్పోవాల్సి వస్తోంది. ఆయనకు వేసిన శిక్షపై పైకోర్టులు స్టే విధిస్తే తప్ప ఆయన శాసనసభ్యుడిగా కొనసాగే అవకాశం లేదు.
గాలి జనార్దనరెడ్డి(Gali Janardhana Reddy) కర్ణాటకలో రాజకీయ నేతగా చక్రం తిప్పారు. 2008లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 110 స్థానాలు గెలిచి, ఏకైక పెద్ద పార్టీగా అవతరించినా ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా బలం రాలేదు. గాలి జనార్దనరెడ్డి ఐదుగురు స్వతంత్రుల మద్దతు కూడగట్టి ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు. రాష్ట్ర మంత్రిగానూ పని చేశారు. ఆ సమయంలోనే పొరుగునున్న ఏపీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డితో స్నేహ సంబంధాన్ని కొనసాగించి, ఓబుళాపురం మైనింగ్ వ్యాపారాన్ని ప్రారంభించారు. 2009లో ఆదాయ పన్నుల అధికారుల దాడులతో ఆయన అక్రమ వ్యాపార చిట్టా బయటపడింది. దీనితో రాజకీయంగా దూరమై 2011లో జైలు పాలయ్యారు. 2015 జనవరిలో బెయిల్‌పై బయటకు వచ్చారు.
కల్యాణ రాజ్య ప్రగతి పక్ష అనే సొంత పార్టీ పెట్టిన గాలి
జైలు జీవితం తర్వాత గాలి జనార్దనరెడ్డికి బీజేపీ(BJP) అంటీముట్టనట్లు ఉండటంతో ఆయన 2022లో కల్యాణ రాజ్య ప్రగతి పక్ష (కేఆర్‌పీపీ) పేరిట సొంతంగా పార్టీ ప్రారంభించారు. ఆపై నిర్వహించిన ఎన్నికల్లో తన భార్యతో కలిసి పోటీ చేసినా కేవలం తానొక్కడే (గంగావతి స్థానంలో) గెలిచారు. అయితే 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో తన పార్టీని బీజేపీ(BJP)లో విలీనం చేశారు.
కానిస్టేబుల్ కొడుకు నుండి మైనింగ్ డాన్ గా గాలి ప్రస్థానం
బళ్లారిలో సాధారణ కానిస్టేబుల్ గా పనిచేసిన చెంగారెడ్డి కుమారుడే మైనింగ్ కింగ్ గాలి జనార్దన్‌రెడ్డి(Gali Janardhana Reddy). వాస్తవానికి చిత్తూరు జిల్లాకు చెందిన చెంగారెడ్డి కుటుంబం… ఆ తర్వాత బళ్లారి వలస వెళ్లింది. ఆయన అత్యంత సాధారణమైన జీవితం నుంచి కోట్లకు పడగలెత్తి అత్యంత సంపన్నుడిగా ఆవిర్భవించడం వెనుక అక్రమ వ్యాపారాల చరిత్ర ఉంది. 1967లో బళ్లారిలో జన్మించిన జనార్దన్‌రెడ్డి… కేవలం 21 ఏళ్ల వయసులో బళ్లారిలో ‘ఎన్నోబుల్ ఇండియా సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ కంపెనీ’ని ప్రారంభించి ప్రజల నుంచి పెద్దఎత్తున డిపాజిట్లు వసూలు చేశారు. ఎల్‌ఐసీకి దీటైన సంస్ధ అంటూ ప్రచారంతో ఊదరగొట్టి సామాన్యుల నుంచి డిపాజిట్లు సేకరించారు. బళ్లారితోపాటు కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల నుంచీ పలువురు డిపాజిట్లు చేశారు. ఈ సంస్ధపై రిజర్వ్ బ్యాంక్‌కు పలు ఫిర్యాదులు రావడంతో ఎన్నోబుల్ సంస్ధను ఆర్‌బీఐ మూసివేయించింది. అప్పటికే పెద్దఎత్తున పొదుపు ఖాతాల్లో డబ్బు పెట్టిన వేల మంది ప్రజలు నష్టపోయారు. అదే సమయంలో గాలి జనార్దన్‌రెడ్డి తన సోదరులైన కరుణాకర్‌రెడ్డి, సోమశేఖర్‌రెడ్డితో కలిసి చిట్‌ఫండ్ వ్యాపారం ప్రారంభించారు.
ఈ క్రమంలో మైనింగ్ వ్యాపారంలోకి అడుగుపెట్టారు. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ)ని ప్రారంభించారు. ఇనుప ఖనిజం అమ్మకాలతో భారీగా డబ్బు సంపాదించారు. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ద్వారా ఓఎంసీకి ఉమ్మడి అనంతపురం జిల్లాలో మైనింగ్ లీజులు పొందారు. మైనింగ్ దందాలో డబ్బు వస్తున్న కొద్దీ రాజకీయ అండ అవసరం కావడంతో గాలి సోదరులు బీజేపీ(BJP)లో చేరారు. మైనింగ్ మాఫియాతో రూ.కోట్లకు పడగలెత్తిన గాలి… అనంతర కాలంలో ప్రభుత్వాలను సైతం శాసించే స్థాయికి ఎదిగారు. అప్పట్లో అనంతపురం డీఎఫ్ఓగా పనిచేసిన బిశ్వాస్ తన నివేదికలో రూ.700 కోట్ల విలువైన ఇనుప ఖనిజాన్ని ఓఎంసీ తరలించినట్లు నివేదిక ఇచ్చారు. ఆయనపై కూడా అక్రమ కేసులు బనాయించే ప్రయత్నం చేశారు.
సొంతంగా హెలికాప్టర్, బంగారు సింహాచనం
ఓఎంసీని ప్రారంభించి అనంతపురం జిల్లాలో ఇనుప ఖనిజం భూములను లీజుకు తీసుకుని దందా ప్రారంభించిన గాలి జనార్దన్‌రెడ్డి… వైఎస్ రాజశేఖర్‌రెడ్డితో పెరిగిన సాన్నిహిత్యంతో అపరిమితంగా ఎదిగారు. అత్యంత విలాసవంతమైన జీవితం గడిపారు. ఆయన ఇంట్లో బాత్ రూం కమోడ్ నుంచి భోజనం చేసే కంచాల వరకు అన్నీ బంగారమేనని అనేవారు. ఆయన బంగారు సింహసనంలో కూర్చునేవారని ప్రచారం. కొన్నాళ్లు కర్ణాటక మంత్రిగా పనిచేసిన గాలి… అప్పట్లో సొంత హెలికాప్టర్లో సచివాలయానికి వచ్చేవారు. అక్రమ తవ్వకాల కేసులో 2011 సెప్టెంబరు 5న సీబీఐ ఆయన్ను అరెస్టుచేసింది. మూడేళ్లకుపైగా జైల్లోనే ఉన్నారు. బెయిల్ కోసం ఏకంగా న్యాయమూర్తులకే రూ.కోట్ల లంచం ఇవ్వడానికి గాలి ముఠా ప్రయత్నించడం అప్పట్లో సంచలనం సృష్టించింది. కుమార్తె బ్రహ్మణి వివాహానికి ఆయన భారీగా రూ.500 కోట్లు ఖర్చుపెట్టినట్లు ప్రచారం జరిగింది.
Also Read : Flight Emergency Landing: బ్యాంకాక్-మాస్కో విమానంలో పొగలు ఢిల్లీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్