Garimella Balakrishna Prasad: టీటీడీ ఆస్థాన విద్వాంసుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ కన్నుమూత
టీటీడీ ఆస్థాన విద్వాంసుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ కన్నుమూత
Garimella Balakrishna Prasad : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆస్థాన విద్వాంసుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ (76) కన్నుమూశారు. తిరుపతిలోని తన స్వగృహంలో గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. వెయ్యికి పైగా అన్నమాచార్య సంకీర్తనలకు స్వర కల్పన చేసిన గరిమెళ్ల… ప్రముఖ సంగీత విద్వాంసుడిగా ప్రఖ్యాతిగాంచారు. 1978 నుంచి 2006 వరకూ టీటీడీ ఆస్థాన గాయకుడిగా పని చేసిన గరిమెళ్ల.. అన్నమాచార్య (Annamacharya) రచనల్లోని వెయ్యికి పైగా సంకీర్తనలకు స్వరకల్పన చేశారు. 2006 నుంచి ఆయన తిరుపతి స్వగృహంలోనే ఉంటున్నారు. ‘వినరో భాగ్యము విష్ణుకథ, జగడపు చనువుల జాజర, పిడికిట తలంబ్రాల పెండ్లికూతురు’ లాంటి పలు కీర్తనలకు ఆయనే స్వరాలు సమకూర్చారు. సంప్రదాయ కర్ణాటక, లలిత, జానపద సంగీతంలోనూ ఆయన ప్రసిద్ధులు. ఈ శుక్రవారమే యాదగిరిగుట్టలోనూ గరిమెళ్ల తన ప్రదర్శనతో ఆహూతులను అలరించారు. ఇంతలోనే ఆయన మరణవార్త తెలిసి సంగీత ప్రియులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
Garimella Balakrishna Prasad No More
గరిమెళ్ల మృతిపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన మరణం సంప్రదాయ సంగీత ప్రపంచానికి తీరని లోటన్నారు. టీటీడీ ఆస్థాన విద్వాంసుడిగా ఆయన విశేష సేవలందించారని గుర్తు చేసుకున్నారు. గరిమెళ్ల మృతిపై ఏపీ సీఎం చంద్రబాబు తన సంతాపాన్ని తెలియజేసారు.
Also Read : Telangana MLC: ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా విడుదల చేసిన కాంగ్రెస్