Spinal Muscular Atrophy: చిన్నారికి పెద్ద కష్టం ! వైద్యానికి రూ.16 కోట్లు అవసరం !
చిన్నారికి పెద్ద కష్టం ! వైద్యానికి రూ.16 కోట్లు అవసరం !
Spinal Muscular Atrophy : ఇటీవల శైలేష్ కొలను దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, శ్రద్ధా శ్రీనాధ్, బాలనటి స్సారా పాలేకర్, నవాజుద్దీన్ సిద్ధీకీ, ఆండ్రియా జెర్మియా ముఖ్య పాత్రలో నటించిన సినిమా “సైంధవ్”. ఈ సినిమాలో వెంకటేష్ కుమార్తె అరుదైన వ్యాధితో బాధపడుతుండగా… ఆమె చికిత్స కోసం 16 కోట్ల రూపాయల ఇంజెక్షన్ అవసరం అవుతుంది. దీనితో ఆ ఇంజెక్షన్ కోసం గతంలో వెంకటేష్ పనిచేసిన మాఫియా ముఠాలతో ఒప్పందం కుదుర్చుకుని… ఎలాగైనా కుమార్తెకు ఆ ఇంజెక్షన్ ఇప్పిస్తాడు. అయితే ఈ సినిమాను పోలిన రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ఇప్పుడు… తూర్పుగోదావరి జిల్లాలో వెలుగుచూసింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…
Girl Suffering with Spinal Muscular Atrophy
తూర్పుగోదావరి (East Godavari) జిల్లా కడియం మండలం మాధవరాయుడుపాలెం పంచాయతీ చైతన్యనగర్ కు చెందిన డాక్కా ఈశ్వర్, శ్రావణిలకు మొదటి కాన్పులో అమ్మాయి పుట్టింది. మొదటి కాన్పులో అమ్మాయి అంటే లక్ష్మీదేవితో సమానం అనుకుని భావించిన ఆ కుటుంబం ఆమెకు మోహన అనే పేరు పెట్టి… భవిష్యత్ ప్రణాళికలు వేసుకున్నారు ఆమె తల్లిదండ్రులు. అయితే విధి వెక్కిరించి… ఆమె పుట్టి రెండు నెలలు తిరగకముందే… తమ గారాలపట్టి మోహనకు తట్టుకోలేని కష్టం వచ్చింది. మోహన అరుదైన స్పైనల్ మస్క్యులర్ ఆట్రోఫీ (ఎస్యంఏ) టైప్ 1 (Spinal Muscular Atrophy) బారిన పడింది. దీనితో ఆమెకు అరుదైన ఆరోగ్య సమస్య వచ్చిందని వైద్యులు తేల్చి… ప్రాణాలకు సైతం ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఆమెను రక్షించాలంటే రూ.16 కోట్ల విలువైన ఇంజెక్షన్‌ను రెండేళ్ల వయసు లోపే ఇవ్వాలని చెప్పారు. అంతేకాదు ఆ ఇంజెక్షన్ అందే వరకు ఆమెకు రూ.ఆరు లక్షల విలువైన సిరప్ ను పాపకు అందించాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు.
రాజమండ్రిలో ఆంధ్రా పేపరు మిల్లు ఉద్యోగిగా… వచ్చే సంపాదనతో కుటుంబంతో ఆనందంగా ఉందామనకున్న వారి ఆశలను చిన్నారి మోహన అనారోగ్యం దెబ్బతీసింది. పాప తల్లిదండ్రులు ఈశ్వర్, శ్రావణిఎప్పుడెలా ఉంటుందో అర్థంకాని రీతిలో తల్లడిల్లిపోతున్నారు. ప్రభుత్వం, దాతలు స్పందించి పాప వైద్యానికి సాయం చేయాలని ఈశ్వర్, శ్రావణి దంపతులు కోరుతున్నారు. కన్పించిన ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.
Also Read : Smart City Project: స్మార్ట్ సిటీ పేరుతో బిజారిణియా సోదరుల రూ.2,700 కోట్ల మోసం