Gold: అహ్మదాబాద్‌లో విమానం కూలిన చోట 70తులాల బంగారం సేకరణ

అహ్మదాబాద్‌లో విమానం కూలిన చోట 70తులాల బంగారం సేకరణ

Gold : ఇటీవల అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమానం కుప్పకూలిన ఘటన అంతులేని విషాదం నింపిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో 274 మందికి మరణించడం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే ఈ విషాద సమయంలో సత్వరమే స్పందించి మానవత్వాన్ని చాటుకున్న వ్యక్తుల్లో రాజేశ్ పటేల్‌ (Rajesh Patel) ఒకరు. విమానం కుప్పకూలిన విషయం తెలియగానే హుటాహుటిన ఘటనా స్థలానికి పరుగెత్తిన ఆయన… మృతదేహాలు, క్షతగాత్రులను అంబులెన్సుల్లోకి ఎక్కించడంలో ఎంతగానో కృషిచేశారు. సహాయక చర్యల అనంతరం ఘటనా స్థలం వద్ద పొగలు కక్కుతున్న శిథిలాల్లో వెతికి మరీ… దాదాపు 70 తులాల బంగారు ఆభరణాలు, రూ.50వేల నగదు, కొన్ని అమెరికా డాలర్లు సేకరించి పోలీసులకు అప్పగించడం ద్వారా తన నిజాయతీని సైతం చాటుకున్నారు.

Gold – తొలి 20 నిమిషాలు దగ్గరికి వెళ్లలేకపోయాం – రాజేశ్ పటేల్‌

నిర్మాణ రంగంలో వ్యాపారిగా ఉన్న రాజేశ్‌ పటేల్‌… ఈ దుర్ఘటన అనంతరం అక్కడ నెలకొన్న పరిస్థితులను వివరించారు. అహ్మదాబాద్‌ (Ahmedabad) నుంచి లండన్‌కు బయల్దేరిన ఎయిరిండియా (Air India) విమానం కూలగానే ఒక్కసారిగా శబ్దం వచ్చి… ఆకాశంలోకి ఓ పెద్ద అగ్నిగోళంలా ఎగసిపడిందన్నారు. అప్పుడు తాను ఘటనా స్థలానికి కేవలం 300 మీటర్ల దూరంలోనే ఉన్నట్లు తెలిపారు. బీజే వైద్య కళాశాల హాస్టల్‌ కాంప్లెక్స్‌ పై విమానం కూలిందని తెలిసిన వెంటనే వీలైనంత ఎక్కువ మందిని కాపాడాలనే ఆశతో ఆ ప్రాంతానికి పరుగెత్తినట్లు చెప్పారు. కానీ, తొలి 15 నుంచి 20 నిమిషాల వరకు ఘటనా స్థలికి దగ్గరగా తాము వెళ్లలేకపోయామన్నారు. మంటలు అదుపులోకి వచ్చిన తర్వాతే సహాయక చర్యలు ప్రారంభించగలిగినట్లు వెల్లడించారు.

పాత చీరలతోనే మృతదేహాల తరలింపు

‘‘మాకు అందుబాటులో స్ట్రెచర్లు లేవు. దీనితో పాత చీరలు, బెడ్‌షీట్లు, గన్నీ బ్యాగుల్లోనే మృతదేహాలు, క్షతగాత్రులను అంబులెన్సుల్లోకి ఎక్కించాం’’ అని వివరించారు. సహాయక చర్యలు పూర్తయిన తర్వాత ప్రయాణికులకు సంబంధించిన వస్తువులను సంరక్షించే పనిలో నిమగ్నమైన అతడికి ఘటనా స్థలంలో చెల్లాచెదురుగా పడి ఉన్న 10- 15 హ్యాండ్‌ బ్యాగ్‌లు కాలిపోయిన స్థితిలో లభ్యమయ్యాయి. ‘‘వీటిలో 70 తులాల బంగారు ఆభరణాలు, 8-10 వెండి వస్తువులు, కొన్ని పాస్‌పోర్టులు, భగవద్గీత పుస్తకం, రూ.50వేల నగదు, 20 డాలర్లు ఉన్నాయి. వాటిని మేం రెస్క్యూ ఆపరేషన్‌ పర్యవేక్షిస్తున్న పోలీస్‌ అధికారికి అప్పగించాం’’ అని తెలిపారు. గతంలో ఫొటో గ్రాఫర్‌ గా పనిచేసిన పటేల్‌… 2008లో అహ్మదాబాద్‌ వరుస పేలుళ్ల తర్వాత అహ్మదాబాద్‌ సివిల్‌ ఆస్పత్రిలో వాలంటీర్‌ గా పనిచేశారు.

ప్రతి వస్తువునూ మృతుల కుటుంబాలకు అప్పగిస్తాం – పోలీసులు

మరోవైపు, విమాన దుర్ఘటన జరిగిన ప్రదేశం నుంచి స్వాధీనం చేసుకున్న ప్రతి విలువైన వస్తువును మృతుల బంధువులకు అప్పగించనున్నట్లు అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి ఒక జాబితాను తయారు చేసి ఎయిరిండియాతో సమన్వయం చేసుకొని అందించే ప్రక్రియను ప్రారంభిస్తామన్నారు. ఈ దుర్ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న వారిలో 241మంది మృతి చెందగా… ఓ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. అలాగే, ఈ విమానం భవనాలపై కుప్పకూలడంతో ఐదుగురు ఎంబీబీఎస్‌ విద్యార్థులతో పాటు మరో 29మంది ప్రాణాలు కోల్పోవడం విషాదం రేపింది.

Also Read : Operation Sindhu: ఇరాన్ లో చిక్కుకున్న భారతీయుల కోసం ‘ఆపరేషన్‌ సింధు’

Leave A Reply

Your Email Id will not be published!