Goods Train: తమిళనాడులో ఘోర రైలు ప్రమాదం ! గూడ్స్ రైలు దగ్ధం !
తమిళనాడులో ఘోర రైలు ప్రమాదం ! గూడ్స్ రైలు దగ్ధం !
Goods Train : తమిళనాడులోని తిరువల్లూరు సమీపంలో గూడ్స్ రైలులో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. డీజిల్ లోడ్ తో వెళ్తున్న గూడ్స్ రైలుకి మంటలు అంటుకున్నాయి. క్షణాల్లోనే అన్ని వ్యాగన్లకు మంటలు వ్యాపించాయి. దీనితో గూడ్స్ రైలు నుండి భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. దీనితో అప్రమత్తమైన అధికారులు… ఆ మార్గంలో రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. అలాగే, ట్రాక్ సమీపంలోని ఇళ్లను అధికారులు ఖాళీ చేయించారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…
Goods Train Fire
చెన్నై (Chennai) పోర్టు నుంచి బెంగళూరుకు ఇండియన్ ఆయిల్ కు చెందిన మొత్తం 52 వ్యాగన్లతో వెళ్తున్న గూడ్స్ రైలుకు ఆదివారం తెల్లవారుజామున మంటలు అంటుకున్నాయి. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తొలుత రైలు పట్టాలు తప్పిన తర్వాత మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు. ఐదు వ్యాగన్లకు మంటలు వ్యాపించినట్లు సమాచారం. మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడుతుండటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్ముకుంది. రైలులో ఇంధనం ఉండటంతో మంటలు మరింత వ్యాపిస్తాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. తిరువళ్ళూరు ఎస్టీ కాలనీ, వరదరాజ నగర్‌కు చెందిన 300 కుటుంబాలను జిల్లా అధికారులు ఖాళీ చేయించారు. ఘటనా స్థలానికి తిరువళ్ళూరు కలెక్టర్ ప్రతాప్, ఎస్పీ శ్రీనివాస్ పెరుమాళ్, రైల్వే డీఆర్‌ఎం విశ్వనాథన్ చేరుకున్నారు. దీంతో సమీప ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. వారిని అక్కడి నుంచి తరలించడంతో పాటు, సమీప ఇళ్లలోని సిలిండర్‌లను తొలగిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా విద్యుత్ కూడా నిలిపివేశారు.
ఈ ప్రమాదం నేపథ్యంలో చెన్నై (Chennai)- అరక్కోణం మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రయాణికుల రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు ప్రారంభించామని రైల్వే పోలీసులు వెల్లడించారు. గూడ్స్ రైలుకు మొత్తం 52 ట్యాంకర్లు ఉండగా… ఇంజన్ వైపున రెండో ట్యాంకర్ నుండి తొమ్మిదో ట్యాంకర్ వరకు వ్యాగన్లు పట్టాలు తప్పడంతో అగ్ని ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఎనిమిది ట్యాంకర్లు అగ్నికి ఆహుతి కాగా… మిగిలిన ట్యాంకర్లను అధికారులు రైలు నుంచి సురక్షితంగా తప్పించినట్టు సమాచారం. 40 ట్యాంకర్లు సురక్షితంగా ఉన్నాయి. ఒక్కో ట్యాంకర్‌లో 70వేల లీటర్లు క్రూడ్ ఆయిల్ ఉంది. మంటల కారణంగా, అరక్కోణం మీదుగా సెంట్రల్‌కు వచ్చే ఎక్స్‌ప్రెస్ రైళ్లను వివిధ ప్రదేశాలలో నిలిపివేశారు. అదనంగా ఉదయం 5.50 గంటలకు బయలుదేరాల్సిన మైసూర్ వందే భారత్ రైలును చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో నిలిపివేశారు. ఉదయం 6 గంటలకు బయలుదేరాల్సిన మైసూర్ శతాబ్ది రైలును కూడా నిలిపివేశారు.
Also Read : TDP Somireddy : గోదావరి వరదలపై టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి కీలక వ్యాఖ్యలు
