Google: విశాఖలో ఆసియాలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్
విశాఖలో ఆసియాలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్
Google : విశాఖపట్నంలో ఆసియాలోనే అతిపెద్ద గూగుల్ (Google) డేటా సెంటర్ త్వరలో ఏర్పాటు కానుంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడింది. విశాఖలో 6 బిలియన్ డాలర్లతో డేటా సెంటర్ ఏర్పాటును ధ్రువీకరిస్తూ ఇన్వెస్ట్ ఇండియా ఎక్స్‌లో పోస్టు చేసింది. దీనిని కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ కూడా అధికారికంగా నిర్ధరించింది. ఒక గిగావాట్ సామర్థ్యంతో ఆసియాలోనే అతిపెద్ద గూగుల్ (Google) డేటా సెంటర్ విశాఖలో నిర్మాణం కానుంది. గ్రీన్ ఎనర్జీ వినియోగంతో గేమ్ ఛేంజర్‌గా నిలవనుంది. మూడు సముద్రపు కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ల ద్వారా విశాఖలో ఈ కేంద్రం ఏర్పాటుకానుంది. ముంబయికి రెండు రెట్ల సామర్థ్యంతో రూపుదిద్దుకోనుంది.
Google Biggest Data Center
హైదరాబాద్ లోని హైటెక్ సిటీ తరహాలో విశాఖలోని మధురవాడ దగ్గర 500 ఎకరాల్లో డేటా సిటీని అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. హౌసింగ్ డేటా సెంటర్లు, కృత్రిమ మేధ (ఏఐ) హబ్‌ల ఏర్పాటుకు అందులో చోటు కల్పించనుంది. డీప్ టెక్నాలజీ, బిగ్ డేటా, ఏఐ రంగాల్లో ప్రపంచ వ్యాప్తంగా విస్తృత అవకాశాలున్నాయని భావిస్తున్న ప్రభుత్వం.. వాటిని అందిపుచ్చుకోవడానికి ఈ డేటా సిటీపై ప్రత్యేక దృష్టి సారించింది. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖలో ఐటీ రంగం అభివృద్ధిని ప్రాధాన్యంగా తీసుకుంది. ఐటీ మంత్రి లోకేశ్ ఆలోచనలకు అనుగుణంగా ‘డేటా సిటీ’ రూపుదిద్దుకోనుంది. విశాఖకు వచ్చే ఐటీ ఆధారిత కంపెనీలకు డేటా సిటీని కేంద్రంగా చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన.
ఏపీలోని క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్
ఏపీలోని క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. గత ప్రభుత్వం బకాయిలు పెట్టిన క్రీడా ప్రోత్సాహకాలను కూటమి ప్రభుత్వం విడుదల చేసింది. రూ.4.9కోట్ల క్రీడా ప్రోత్సాహకాలను విడుదల చేసినట్టు ప్రభుత్వం గురువారం ప్రకటించింది. దీనితో రాష్ట్రంలోని 43 మంది అంతర్జాతీయ క్రీడాకారులకు లబ్ధి చేకూరనుంది. క్రీడలు, క్రీడాకారుల పట్ల ఉన్న చిత్తశుద్ధిని ప్రభుత్వం నిరూపించుకుందని ఈ సందర్భంగా శాప్ ఛైర్మన్ రవినాయుడు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా క్రీడాకారులందరూ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. క్రీడా ప్రోత్సాహకాలు విడుదల చేసినందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, క్రీడాశాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డికి క్రీడాకారుల తరఫున రవినాయుడు కృతజ్ఞతలు తెలిపారు.
Also Read : ACB Court: ఎస్సైకు ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఏసీబీ కోర్టు సంచలన తీర్పు
