Gorantla Butchaiah Chowdary: అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి !
అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి !
Gorantla Butchaiah Chowdary: అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎంపికయ్యారు. ఈ మేరకు బుచ్చయ్యకు ఫోన్ చేసి ప్రోటెం స్పీకర్‌గా వ్యవహరించాలని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పినట్లు సమాచారం. గురువారం బుచ్చయ్య చౌదరి(Gorantla Butchaiah Chowdary)తో ప్రోటెం స్పీకర్ గా గవర్నర్ ప్రమాణం చేయించే అవకాశం ఉంది. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఘన విజయం సాధించారు. 60 వేల పైచిలుకు మెజార్టీతో విక్టరీ కొట్టారు. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్న బుచ్చయ్య చౌదరి 77 ఏళ్ల వయస్సులోనూ ఉత్సాహంగా ప్రజా సేవ చేస్తున్నారు.
పార్టీలో అధినేత చంద్రబాబు నాయుడు కంటే సీనియర్ నాయకుడు బుచ్చయ్య చౌదరి(Gorantla Butchaiah Chowdary). రాజమండ్రి రూరల్ నియోజకవర్గం బుచ్చయ్య చౌదరికి కంచుకోట. ఇప్పటికే ఆరుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. టీడీపీలో ప్రధాన కార్యదర్శిగానూ పనిచేశారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి కమ్మ సామాజిక వర్గానికి చెందిన బలమైన నేత. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో కాపులు ఎక్కువగా ఉంటారు. అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ, సొంత ఛరిష్మాతో గెలుస్తూ వస్తున్నారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి(Gorantla Butchaiah Chowdary) ఆంధ్రా యూనివర్సిటీలో బీఎస్సీ డిగ్రీ చేశారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. తెలుగుదేశం విధానాలు నచ్చి పార్టీలో చేరారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రజల నుంచి వచ్చిన నేత. ప్రజలను ఆకట్టుకునేలా ప్రసంగిస్తారు.
Gorantla Butchaiah Chowdary – ప్రొటెం స్పీకర్ అంటే ?
ప్రొటెం స్పీకర్ ప్రస్తావన రాజ్యాంగంలో ఎక్కడా లేదు. రాజ్యాంగం ప్రకారం శాసనసభకు ఎన్నికైన ఎమ్మెల్యేలు విధిగా ప్రమాణం చేయాల్సి ఉంటుంది. గవర్నర్ లేదా వారిచేత నియమితులైన ప్రతినిధి ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించవచ్చనే వెసులుబాటు ఉంది. దీనితో గవర్నర్ తన ప్రతినిధిగా ఒకరిని ఎంపిక చేస్తారు. వారు స్పీకర్ స్థానంలో తాత్కాలికంగా బాధ్యతలు నిర్వహిస్తారు. దీనితో వారిని ప్రొటెం స్పీకర్‌గా పిలుస్తారు… అలాగే ప్రొటెం స్పీకర్ అనేదానికి తాత్కాలిక లేదా, ప్రస్తుతానికి అనే అర్థం కూడా వస్తుంది. ఎవరినైతే ప్రొటెం స్పీకర్‌గా గవర్నర్ నియమిస్తారో వారు ఎమ్మెల్యేల ప్రమాణస్వీకార కార్యక్రమానికి ముందే గవర్నర్ సమక్షంలో ప్రమాణం చేయాల్సి ఉంటుంది. ప్రొటెం స్పీకర్ ఎవరుండాలనేదానిపై సాధారణంగా ముఖ్యమంత్రితో చర్చించి శాసనసభ వ్యవహారాల శాఖమంత్రితో నిర్ణయం తీసుకుంటారు. కొన్ని సందర్భాల్లో గవర్నర్ తన విచక్షణ ఆధారంగా ప్రొటెం స్పీకర్ విషయంలో నిర్ణయం తీసుకోవచ్చు.
ఎవరిని ప్రొటెం స్పీకర్‌గా నియమిస్తారు ?
ప్రొటెం స్పీకర్‌గా ఎవరిని పెట్టాలనేదానిపై నిర్థిష్టమైన నిబంధనలు ఏమి లేవు. కానీ సభలో సీనియర్ సభ్యుడిగా ఉన్న వ్యక్తిని ప్రొటెం స్పీకర్‌గా నియమించాలనేది ఓ సంప్రదాయంగా వస్తోంది. సభ్యుడి వయసు ఆధారంగా కాకుండా… ఎన్నిసార్లు శాసనసభకు ఎన్నికయ్యారనేదాని ఆధారంగా సీనియార్టీని నిర్ణయిస్తారు. ప్రస్తుత శాసనసభలో ఎక్కువసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తిని ప్రొటెం స్పీకర్‌గా నియమిస్తారు. ఏదైనా సందర్భంలో సీనియర్ సభ్యుడిగా ఉన్న వ్యక్తి ఇతర రాజ్యాంగబద్ధ పదవులు లేదా కేబినెట్‌లో భాగస్వామిగా ఉంటే ఆ తరువాత సీనియర్‌గా ఉన్న ఎమ్మెల్యేను నియమిస్తారు. ఒకవేళ సీనియర్‌గా ఉన్న వ్యక్తి తాను ప్రొటెం స్పీకర్ బాధ్యతలు నిర్వహించడానికి విముఖత చూపితే ఆయన తరువాత స్థానంలో ఎవరైతే సీనియర్ ఎమ్మెల్యేగా ఉంటారో వారిని ప్రొటెం స్పీకర్‌గా నియమిస్తారు.
16వ శాసనసభకు ఎన్నికైన ఎమ్మెల్యేల్లో చంద్రబాబు నాయుడు సీనియర్ కాగా… ఆయన సీఎంగా ఉండటంతో ఆయన తరువాత స్థానంలో సీనియర్ గా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంటల బుచ్చయ్యచౌదరి(Gorantla Butchaiah Chowdary) ఉన్నారు. ఆయన ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దీనితో బుచ్చయ్యచౌదరి పేరును ప్రొటెం స్పీకర్‌గా తెలుగుదేశం ప్రభుత్వం సిఫార్సు చేసింది. ఈనేపథ్యంలో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ బుచ్చయ్య చౌదరితో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆ తర్వాత ఆయన మిగతా ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయిస్తారు. ప్రొటెం స్పీకర్ స్పీకర్ ఎన్నికను నిర్వహిస్తారు. కొత్త స్పీకర్ ఎన్నికయ్యే వరకు ప్రొటెం స్పీకర్ తన తన బాధ్యతల్లో కొనసాగుతారు.
Also Read : AP Advocate General: ఏపీ అడ్వొకేట్ జనరల్‌గా దమ్మాలపాటి శ్రీనివాస్ !