Pastor Praveen Pagadala: పాస్టర్ ప్రవీణ్ మృతిపై సమగ్ర విచారణకు సీఎం ఆదేశం
పాస్టర్ ప్రవీణ్ మృతిపై సమగ్ర విచారణకు సీఎం ఆదేశం
Praveen Pagadala : హైదరాబాద్ లోని ఎస్‌బీహెచ్ కాలనీకి చెందిన ప్రముఖ పాస్టర్ పగడాల ప్రవీణ్‌కుమార్ (45) మృతి చెందిన విషయం తెలిసిందే. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం శివారు కొంతమూరు వద్ద రోడ్డు పక్కన ప్రవీణ్ మృతదేహాన్ని మంగళవారం ఉదయం స్థానికులు గుర్తించారు. అయితే ప్రవీణ్(Praveen Pagadala) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారని ప్రాథమికంగా పోలీసులు అనుమానించిప్పటికీ… ప్రవీణ్ బంధువులు, కొంతమంది పాస్టర్లు ఇది రోడ్డి ప్రమాదం కాదని హత్యేనని ఆందోళనకు దిగారు. దీనితో స్పందించిన ప్రభుత్వం పాస్టర్ ప్రవీణ్ మృతిపై సమగ్ర విచారణకు ఆదేశించింది.
Pastor Praveen Pagadala Death
ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ మాట్లాడుతూ… ‘‘రోడ్డు పక్కన మృతదేహం పడి ఉందని మంగళవారం ఉదయం పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహం పక్కనే సెల్‌ఫోన్ గుర్తించారు. చివరి ఫోన్ కాల్ రామ్మోహన్ ఆర్‌జేవైకి వెళ్లినట్టుగా ఉంది. పోలీసులు ఆయనకు ఫోన్ చేయగా… రామ్మోహన్, అతని భార్య ఘటనాస్థలికి చేరుకుని ఆ మృతదేహం ప్రవీణ్(Praveen Pagadala) దిగా గుర్తించారు. ప్రవీణ్ హైదరాబాద్‌లో ఉంటారని, వివిధ ప్రాంతాల్లో మత బోధకుడిగా సేవలందిస్తారని తెలిపారు. దీనితో హైదరాబాద్‌లో ఉన్న ఆయన కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చాం. ప్రవీణ్ బావమరిది నిన్న సాయంత్రం వచ్చి అనుమానాస్పద మృతిగా ఫిర్యాదు ఇవ్వడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేశాం.
ఘటనా స్థలిలో డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్‌తో కొన్ని ఆధారాలు సేకరించాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు… ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్‌తో విచారణ జరిపించాలని నిర్ణయించాం. టీమ్ ఆఫ్ డాక్టర్స్‌తో పోస్టుమార్టం చేయించాం. ఈ ప్రక్రియ మొత్తం వీడియో రికార్డింగ్ చేయించాం. కొవ్వూరు టోల్ గేట్ సమీపంలో ప్రవీణ్ ద్విచక్రవాహనంపై వెళ్తున్నట్టు సీసీటీవీ ఫుటేజ్ సేకరించాం. సోమవారం రాత్రి 11.43 గంటలకు రోడ్డు ప్రమాదం జరిగినట్టు సీసీటీవీ ఫుటేజ్‌ని బట్టి తెలుస్తోంది. మాకు లభ్యమైన ఆధారాలపై లోతుగా దర్యాప్తు చేస్తాం. కేసు విచారణ కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశాం. ఈ కేసుకు సంబంధించి ఎవరి దగ్గరైనా ఆధారాలు ఉంటే ఇవ్వాలని కోరుతున్నాం. పోస్టు మార్టం అనంతరం ఆందోళనకారులను ఒప్పించి మృతదేహాన్ని హైదరాబాద్‌కు తరలించాం’’ అని జిల్లా ఎస్పీ తెలిపారు.
పాస్టర్ ప్రవీణ్ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తి చేసిన చంద్రబాబు, లోకేష్, అనిత
పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu) విచారం వ్యక్తం చేశారు. పాస్టర్ మృతి ఘటనపై అన్ని కోణాల్లో విచారణ జరపాలని సీఎం ఆదేశించారు. ఈ విషయంపై డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో ముఖ్యమంత్రి మాట్లాడారు. అదేవిధంగా పాస్టర్ పగడాల ప్రవీణ్ హఠాన్మరణం దిగ్భ్రాంతికి గురి చేసిందని మంత్రి లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. కుటుంబ సభ్యులకు మంత్రి తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు.
అలాగే పాస్టర్ ప్రవీణ్ పగాడల మృతి ఆరోపణలపై హోంమంత్రి వంగలపూడి అనిత(Home Minister Anitha) స్పందించారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి.నరసింహ కిశోర్‌కు ఫోన్ చేసి ఆరా తీశారు. పాస్టర్ మరణంపై సమగ్ర విచారణకు జరపాల్సిందిగా హోంమంత్రి ఆదేశించారు. పాస్టర్ ప్రవీణ్ ప్రమాదం జరిగిన సమీపంలోని సీసీ టీవీ ఫుటేజీలు పరిశీలించాలని ఆదేశాలు జారీ చేశారు. క్రైస్తవసంఘాలు కోరిన మేరకు పోస్టుమార్టం వీడియో రికార్డింగ్ చేసినట్లు ఎస్పీ తెలిపారు.
రాజమండ్రిలో ఉద్రిక్తత
మరోవైపు రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రి వద్ద పాస్టర్లు, క్రైస్తవులు, దళిత సంఘాలు నిరసన కొనసాగుతోంది. రాజమండ్రి సమీపంలో ప్రవీణ్ అనుమానాస్పద మృతిపై విచారణ జరపాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పాస్టర్ల ఆందోళనలతో రాజమండ్రి ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆసుపత్రి వద్దకు భారీగా దళిత సంఘాలు,పాస్టర్లు, క్రైస్తవులు చేరుకున్నారు. దీంతో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు.
Also Read : Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నానికి అస్వస్థత ! ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స !