Nimisha Priya: నిమిష ప్రియ కేసుపై స్పందించిన విదేశాంగ శాఖ
నిమిష ప్రియ కేసుపై స్పందించిన విదేశాంగ శాఖ
Nimisha Priya : యెమెన్ లో చివరి నిమిషంలో మరణశిక్ష వాయిదా పడ్డ కేరళ నర్సు నిమిష ప్రియ (Nimisha Priya) కేసుపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. నిమిష కేసులో అవసరమైన న్యాయ సహాయాన్ని అందిస్తున్నామని స్పష్టం చేసింది. భారత ప్రభుత్వం ప్రయత్నాలే వల్లే నిమిష (Nimisha Priya) మరణశిక్ష వాయిదా పడిందని విదేశాంగ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ పేర్కొన్నారు.
Nimisha Priya Case
ఈ మేరకు గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో విదేశాంగ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ మాట్లాడుతూ… ‘‘ఇది సున్నితమైన అంశం. ఈ కేసులో అన్ని రకాలుగా సాధ్యమైన సహకారాన్ని ప్రభుత్వం అందిస్తోంది. ఆమె కుటుంబం కోసం ఒక న్యాయవాదిని నియమించాం. కేసు పురోగతి వంటి వివరాలు తెలుసుకునేందుకు దౌత్యపరంగా సహకరిస్తున్నాం. అలాగే ఈ సమస్యను పరిష్కారం చూపేలా స్థానిక అధికారులు, కుటుంబ సభ్యులతో తరచూ సంప్రదింపులు చేస్తున్నాం’’ అని జైశ్వాల్ వెల్లడించారు. ఈ ప్రయత్నాల ఫలితంగా ఇటీవల మరణశిక్ష వాయిదాపడిన అంశాన్ని ప్రస్తావించారు. ఇక కేసు విషయమై కొన్ని మిత్రదేశాలతో టచ్‌లో ఉన్నామని చెప్పారు.
యెమెన్ జాతీయుడి హత్యకేసులో నిమిషకు మరణశిక్ష పడిన సంగతి తెలిసిందే. అది జులై 16న అమలు కావాల్సిఉండగా… భారత ప్రభుత్వ ప్రయత్నాలతో తాత్కాలికంగా వాయిదాపడింది. ‘‘నిమిష, బాధిత కుటుంబాలు పరస్పర అంగీకారానికి వచ్చి కేసును పరిష్కరించుకునేందుకు మరింత సమయం ఇవ్వాలని గత కొన్ని రోజులుగా యెమెన్ ప్రభుత్వాన్ని భారత్ కోరుతోంది. ఈ విషయంలో స్థానిక జైలు అధికారులు, ప్రాసిక్యూటర్‌తో నిరంతరం జరిపిన సంప్రదింపులు ఫలించాయి’’ అని ఇటీవల మన ప్రభుత్వం వెల్లడించిన సంగతి తెలిసిందే.
ఇదిలాఉంటే.. బాధిత కుటుంబానికి ఒక మిలియన్ డాలర్ల (దాదాపు రూ.8.6కోట్ల) క్షమాధనాన్ని ఇచ్చేందుకు నిమిష ప్రియ (Nimisha Priya) కుటుంబం సిద్ధమైంది. ఇందుకు వారు అంగీకరిస్తే.. నిమిష ప్రియకు మరణశిక్ష తప్పే అవకాశం ఉంది. ఈ క్షమాధనాన్ని తీసుకునేలా బాధిత కుటుంబాన్ని ఒప్పించేందుకు మత గురువు కాంతాపురం ఏపీ అబూబకర్ ముస్లియార్ సంప్రదింపులు జరుపుతున్నారు.
మరోవైపు మృతుడు తలాల్ అదిబ్ మెహది కుటుంబం మాత్రం ఆమెకు శిక్ష పడాల్సిందేనని పట్టుబడుతోంది. ‘‘మధ్యవర్తిత్వం, సయోధ్య కోసం ప్రస్తుతం జరుగుతోన్న ప్రయత్నాలు కొత్తవేమీ కావు. మాకు ఎలాంటి ఆశ్చర్యాన్ని కలిగించడం లేదు. డబ్బుతో మనిషి ప్రాణానికి వెలకట్టలేం. మాకు న్యాయం దక్కాల్సిందే’’ అని అర్థం వచ్చేలా పోస్టులో మెహది సోదరుడు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ చర్చలు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయోనన్న ఉత్కంఠ నెలకొంది.
2008లో కుటుంబ ఆర్థిక అవసరాల కోసం యెమెన్ వెళ్లిందామె. 2011లో భారత్‌కు వచ్చి వివాహం చేసుకుంది. ఈ జంటకు ఓ పాప పుట్టింది. ఆ తర్వాత ఆమె మళ్లీ యెమెన వెళ్లింది. అక్కడి చట్టాల ప్రకారం… తలాబ్ అబ్దో మహ్దీ అనే వ్యక్తితో కలిసి క్లినిక్ తెరిచింది. అయితే తలాబ్ తనను వేధించాడంటూ ఆమె 2016లో పోలీసులను ఆశ్రయించింది. అయినా ప్రయోజనం లేకపోవడంతో తలాబ్ వద్ద చిక్కుకున్న తన పాస్‌పోర్టును దొంగలించేందుకు అతనికి మత్తుమందిచ్చింది. ఓవర్‌డోస్ కావడంతో అతను మరణించాడు. శవాన్ని ఓ వాటర్ ట్యాంకర్‌లో పడేసి పారిపోయే క్రమంలో పోలీసులకు చిక్కింది. 2020లో ట్రయల్ కోర్టు, 2023లో సుప్రీం జుడీషియల్ కౌన్సిల్ శిక్షను ఖరారు చేశాయి.
Also Read : India: నాటో చీఫ్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన భారత్
