Mayanmar: రూ. 30,000 కోట్లతో మయన్మార్ సరిహద్దుల్లో కంచె !
రూ. 30,000 కోట్లతో మయన్మార్ సరిహద్దుల్లో కంచె !
Mayanmar: మయన్మార్ లో ఏర్పాటైన సైనిక ప్రభుత్వం… ప్రజాస్వామ్య వాదుల మధ్య నెలకొన్న అంతర్యుద్ధం కారణంగా ఆ దేశంలో రోజు రోజుకూ హింసా కాండ పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో మయన్మార్(Mayanmar) నుండి సైనికులతో పాటు సాధారణ పౌరులు కూడా సరిహద్దు రాష్ట్రాలైన మిజోరం, మణిపుర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ ద్వారా భారతదేశంలోనికి అక్రమంగా చొరబడుతున్నారు. దీనితో అక్రమ చొరబాట్లను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సరిహద్దుల నుంచి అక్రమ చొరబాట్లు నిరోధించేందుకు భారత్-మయన్మార్ ల మధ్య 1,643 కిలోమీటర్ల పొడవునా కంచె ను నిర్మించనున్నట్లు ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్వయంగా ప్రకటించారు. ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు కూడా మొదలయ్యాయి. అయితే పటిష్ఠమైన కంచె నిర్మాణం కోసం కేంద్రం భారీగా నిధులు వెచ్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సరిహద్దులో 1643 కిలోమీటర్ల మేర ఫెన్సింగ్ కు దాదాపు రూ.30వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు సమాచారం. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ పలు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి.
Mayanmar Fencing
ఈనెల ఆరంభంలో ప్రభుత్వ కమిటీ కంచె నిర్మాణం కోసం బడ్జెట్ అంచనాలను ఆమోదించినట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి. దీనికి ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ ఆమోదించాల్సి ఉందని తెలిపాయి. సరిహద్దు పొడవునా ఫెన్సింగ్‌కు సమాంతరంగా రోడ్ల నిర్మాణం కూడా చేపట్టనున్నట్లు తెలుస్తోంది. దీనితోపాటు సరిహద్దు నుంచి మిలిటరీ బేస్ లను కలిపేలా రోడ్లను ఏర్పాటుచేయనున్నారు. ఈ మొత్తానికి కలిపి ఒక్కో కిలోమీటర్‌కు రూ.12 కోట్ల చొప్పున ఖర్చు చేయనున్నట్లు సదరు కథనాలు వెల్లడించాయి. 2020లో బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఏర్పాటుచేసిన కంచె ఖర్చుతో పోలిస్తే ఇది రెట్టింపు అని తెలిపాయి. అయితే దీనిపై కేంద్రం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఫెన్సింగ్ నిర్మాణంపై మయన్మార్ కూడా ఇంతవరకూ స్పందించలేదు.
ఈశాన్య రాష్ట్రాలైన మిజోరం, మణిపుర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్లు మయన్మార్‌తో సరిహద్దును పంచుకుంటున్నాయి. ఇప్పటివరకు సరిహద్దు నుంచి ఇరువైపులా 16 కిలోమీటర్ల వరకు ఎలాంటి వీసా లేకుండా ప్రజలు స్వేచ్ఛగా తిరిగే వెసులుబాటు ఉంది. అయితే, ఇటీవల ఆ దేశం నుంచి భారత్‌లోకి అక్రమ చొరబాట్లు పెరిగాయి. దీంతో వీటిని అరికట్టేందుకు సరిహద్దులో 1,643 కిలోమీటర్ల పొడవునా కంచె నిర్మాణం చేపట్టింది. ఇప్పటికే మణిపుర్‌లోని మోరేలో 10 కిలోమీటర్ల మేర పనులు పూర్తి చేసినట్లు అమిత్ షా వెల్లడించారు. హైబ్రిడ్ నిఘా వ్యవస్థ ద్వారా మణిపుర్, అరుణాచల్ ప్రదేశ్‌లో కిలోమీటరు చొప్పున ఫెన్సింగ్ ఏర్పాటుకు పైలట్ ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి.
Also Read : AP BJP : ఏపీ బీజేపీ నుంచి అసెంబ్లీ అభ్యర్థులు వీరే