President: రాష్ట్రపతి కారుకు జీఎస్టీ మినహాయింపు ?
రాష్ట్రపతి కారుకు జీఎస్టీ మినహాయింపు ?
President : భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కాన్వాయ్‌లోకి సరికొత్త వాహనం చేరనుంది. ప్రస్తుతం ఆమె మెర్సిడెస్ బెంజ్-ఎస్600 పుల్‌మ్యాన్ లిమోజిన్‌ను వాడుతున్నారు. దీనిని సరికొత్త బీఎండబ్ల్యూ కారుతో భర్తీ చేయనున్నారు. కొత్త వాహనం ఖరీదు రూ.3.66 కోట్లు. రాష్ట్రపతి (President) వాహనశ్రేణిని క్రమం తప్పకుండా అప్‌గ్రేడ్ చేస్తుంటారు. భద్రతా కారణలరీత్యా వీటిల్లోకి విలాసవంతమైన, కస్టమ్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను మాత్రమే తీసుకొంటారు. అందులోభాగంగానే ఈ కొత్త కారు రానుంది.
సాధారణంగా ఈ హైఎండ్ కారును ఎవరైనా దిగుమతి చేసుకొంటే భారీ పన్నులు విధిస్తారు. దీనికితోడు 28 శాతం (సరికొత్త రేట్ల ప్రకారం అయితే 40%) జీఎస్టీ లేదా ఐజీఎస్టీ విధిస్తారు. ఇక బేసిక్ కస్టమ్స్ డ్యూటీ, అదనపు సెస్సు కలిసి ధర తడిసి మోపెడవుతుంది. కానీ, దేశ రాష్ట్రపతికి (President) అవసరమైన వాహనం కావడంతో జీఎస్టీ కౌన్సిల్ ఐజీఎస్టీ, సెస్సు నుంచి దీనికి ప్రత్యేక మినహాయింపును ప్రతిపాదించింది. దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఇటీవల ఆమోదముద్ర పడింది. ఇలా మినహాయింపు ఇవ్వడం చాలా అరుదు. కేవలం ప్రత్యేక కేసులు, ప్రజాప్రయోజనాలు ఉన్న సమయంలో వాణిజ్యేతర వాహనాలకు మాత్రమే ఇలాంటి మినహాయింపు లభిస్తుంటుంది. ఈ క్రమంలో రాష్ట్రపతి సెడాన్ కారును దేశ ఆస్తిగా భావిస్తారు. తాజా చర్యతో ప్రెసిడెంట్ సెక్రటేరియట్ ఎటువంటి పన్నులు చెల్లించకుండా వాహనం కొనుగోలు చేసే అవకాశం లభించింది.
President – 8 ఏళ్ల తర్వాత జీఎస్టీపై కేంద్రం యూటర్న్ – చిదంబరం
వస్తుసేవల పన్నుపై కేంద్ర ప్రభుత్వం ఇన్నాళ్లూ తప్పుదోవలో వెళ్లిందని కేంద్ర మాజీ మంత్రి చిదంబరం విమర్శించారు. ఆ తప్పును గ్రహించి తాజాగా యూటర్న్ తీసుకుందని అన్నారు. ఈనెల 22 నుంచి 5, 18 శాతాల శ్లాబులు తీసుకొస్తున్నామని ఎన్డీయే ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో చిదంబరం స్పదించారు. ‘జీఎస్టీ హేతుబద్ధీకరణ, రేట్లు తగ్గించడాన్ని స్వాగతిస్తున్నాం. కానీ, ఈ నిర్ణయం తీసుకోవడానికి 8 ఏళ్లు పట్టడం చాలా ఆలస్యమే’ అని పేర్కొన్నారు. జీఎస్టీ రూపకల్పన సరిగా లేదని కాంగ్రెస్ (Congress) సహా పలువురు ఆర్థికవేత్తలు గతంలోనే ప్రశ్నించారని వ్యాఖ్యానించారు. మధ్యతరగతి, పేద ప్రజలు ఈవిషయంపై గొంతెత్తినా ప్రభుత్వం వినిపించుకోలేదని ఆరోపించారు.
జీఎస్టీ ఎల్లప్పుడూ ‘గుడ్ అండ్ సింపుల్ ట్యాక్స్’లా ఉండాలని చిదంబరం ఆకాంక్షించారు. తాజా నిర్ణయంతో పేద, మధ్యతరగతి వర్గాలకు కొంత ఉపశమనం లభిస్తుందని అభిప్రాయపడ్డారు. లోపభూయిష్టమైన జీఎస్టీ డిజైన్, సంక్లిష్ట శ్లాబులను ప్రభుత్వం, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పలుమార్లు సమర్థించుకున్నారని చెప్పారు. నిన్నటి మార్పులకు వారే చప్పట్లు కొట్టుకోవడం గమనించాల్సిన విషయమన్నారు. వృద్ధి మందగించడం, గృహ రుణాలు పేరుకుపోవడం, పొదుపు క్షీణించడం, బిహార్ అసెంబ్లీ ఎన్నికలు, ట్రంప్ టారిఫ్‌లే జీఎస్టీ రేట్ల మార్పునకు కారణమా? అని ప్రశ్నించారు.
అసలైన జీఎస్టీ 2.0 కోసం ఎదురుచూస్తున్నానని కాంగ్రెస్‌కు చెందిన మరో సీనియర్ నేత జైరాం రమేశ్ వ్యాఖ్యానించారు. జీఎస్టీ 1.5 సంస్కరణలు బాగున్నాయన్నారు. తమ ఆదాయాలను రక్షించుకోవడానికి మరో ఐదేళ్లు పరిహారం పొడిగించాలని రాష్ట్రాలు చేస్తున్న డిమాండ్ ఇంకా మిగిలేఉందని గుర్తు చేశారు. నూతన జీఎస్టీ ప్రైవేటు పెట్టుబడులకు ఊతమిస్తుందా? ఎంఎస్‌ఎంఈలపై భారాన్ని తగ్గిస్తుందా? అనే ప్రశ్నలకు కాలమే సమాధానమివ్వాలన్నారు. జీఎస్టీ 1.0 తుది అంకానికి చేరిందనే విషయాన్ని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఎట్టకేలకు గుర్తించారన్నారు. 2017లోనే కాంగ్రెస్ దీనిపై అభ్యంతరం వ్యక్తంచేసిందని చెప్పారు. మంచి సులభతర పన్ను కాస్తా వృద్ధిని అణిచివేసే పన్నుగా మారుతుందని తాము అప్పట్లోనే హెచ్చరించామని తెలిపారు.
Also Read : IIT Madras: ఎన్‌ఐఆర్‌ఎఫ్ జాబితాలో వరుసగా ఏడోసారి టాప్‌లో మద్రాస్ ఐఐటీ
