Guntur Mayor: గుంటూరు మేయర్‌ మనోహర్‌ నాయుడు రాజీనామా

గుంటూరు మేయర్‌ మనోహర్‌ నాయుడు రాజీనామా

Guntur : కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తరువాత స్థానిక సంస్థలు ముఖ్యంగా మున్సిపాలిటీలు ఒక్కొక్కటిగా కూటమి ఖాతాలో చేరుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో సుమారు తొంభై ఐదు శాతానికి పైగా మున్సిపాలిటీలను వైసీపీ కైవసం చేసుకుంది. అయితే ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాజయం చవిచూడటంతో… ఆయా స్థానాపై పట్టు కోల్పోతుంది. అధికారం కోసం కొందరు, ఒత్తిళ్ళతో మరికొందరు తమ పదవులకు రాజీనామా చేసి టీడీపీ లేదా జనసేనలో చేరుతున్నారు. దీనిలో భాగంగా గుంటూరు(Guntur) మేయర్‌ కావటి మనోహర్‌ నాయుడు(Kavati Manohar Naidu) తాజాగా రాజీనామా చేశారు. 2021లో వైసీపీ నుంచి మనోహర్‌నాయుడు మేయర్‌గా ఎన్నికయ్యారు.

Guntur Mayor…

గత కొంతకాలంగా నగర కమిషనర్‌ పులి శ్రీనివాసులు, మేయర్‌ మనోహర్ మధ్య వివాదం నెలకొంది. మరో వైపు ఫిబ్రవరిలో జరిగిన గుంటూరు నగర పాలక సంస్థ స్టాండింగ్‌ కమిటీ ఎన్నికల్లో… ఆరు స్థానాల్లో టీడీపీ, జనసేన కార్పొరేటర్లు విజయం సాధించారు. వైసీపీ నుంచి కార్పొరేటర్లు కూటమిలో చేరడంతో ఆ పార్టీకి పరాజయం తప్పలేదు. ఈనెల 17న స్టాండింగ్‌ కమిటీ సమావేశం జరగనుంది. మేయర్‌ కావటి మనోహర్‌ నాయుడిపై అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశముంది. ఈ నేపథ్యంలో మరో ఏడాది పదవీ కాలం ఉండగానే మనోహర్‌ తన పదవికి రాజీనామా చేశారు.

ఈ సందర్భంగా కూటమి సర్కార్‌ తనను ఎంతగానో అవమానించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ‘‘ నా రాజీనామా పత్రాన్ని కలెక్టర్‌ కు పంపించాను. నా ప్రమేయం లేకుండా స్టాండింగ్‌ కమిటీ పెడుతున్నారు. నా ఛాంబర్‌ కు కూడా తాళం వేశారు. నెలరోజుల క్రితం జరిగిన స్టాండింగ్‌ కమిటీ ఎన్నికల కోసం టీడీపీ నేతలు మా కార్పొరేటర్లను కొనుగోలు చేశారు. కార్పొరేటర్ల ఇంటికెళ్లి బెదిరించారు’’ అని మనోహర్‌ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘ఈ నెల 17 తేదిన స్టాండింగ్ కమిటి సమావేశం నిర్వహిస్తున్నామని అధికారులు నాకు సమాచారం ఇచ్చారు. స్టాండింగ్ కమిటికి నేనే ఛైర్మన్‌ ను. స్టాండింగ్ కమిటీలో ఏం ప్రతిపాదనలు ఉండాలి. ఎక్కడ పెట్టాలి. ఎప్పుడు పెట్టాలి అనేది నేను నిర్ణయించాలి. కానీ నాకు తెలియకుండా. నా ప్రమేయం లేకుండా స్టాండింగ్ పెడుతున్నారు. నా ఛాంబర్‌కు తాళం వేశారు. నేను ఛాంబర్‌కు వెళ్తే అధికారులు డ్రామాలు ఆడుతున్నారు.

‘‘గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన నాటినుంచి ఇంత దారుణమైన అవమానం ఏ మేయర్‌కు జరగలేదు. నాపై కూడా కేసులు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. వైఎస్‌ జగన్‌ దయవల్లే నేను మేయర్‌ అయ్యాను. పీవీకే కూరగాయలు మార్కెట్ పేరు మార్చితే చూస్తూ ఊరుకోం’’ అని మనోహర్‌ నాయుడు హెచ్చరించారు.

Also Read : Minister Seethakka: తన ఫొటోలు మార్ఫింగ్ చేసిన వారికి మంత్రి సీతక్క మాస్ వార్నింగ్

Leave A Reply

Your Email Id will not be published!