YSRCP MLA on CAA: సీఏఏపై వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కీలక వ్యాఖ్యలు !
సీఏఏపై వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కీలక వ్యాఖ్యలు !
YSRCP MLA on CAA: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై వైసీపీ(YSRCP) ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కీలక ప్రకటన చేశారు. తాము కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సీఏఏను అంగీకరించబోమన్నారు. సీఏఏ చట్టం ముస్లిం వర్గాలకు వ్యతిరేకంగా ఉందని తెలిపారు. బుధవారం విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ… ‘సీఏఏ చట్టం వలన ముస్లిం వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఇందులో మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. సీఎం జగన్ కూడా మాకు అనునిత్యం అండగా నిలుస్తున్నారు. కులాలు, మతాల మీద వివక్ష చూపటం కరెక్టు కాదు. వైసీపీకి అన్ని వర్గాలూ ముఖ్యమే. అందరికీ భద్రత, న్యాయం కల్పించటమే సీఎం జగన్ లక్ష్యం. దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మాకు 4 శాతం రిజర్వేషన్ కల్పించారు. బీజేపీ, జనసేనతో కలిసి పోటీ చేస్తే ఓట్లు వస్తాయని చంద్రబాబు అనుకుంటున్నారు. కానీ సీఏఏ తెచ్చిన బీజేపీతో కలవటం కరెక్టు కాదు. ప్రజలు దీనికి సరైన సమాధానం చెప్తారు’ అని ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అన్నారు.
YSRCP MLA on CAA Comment
అయితే ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమా… లేక పార్టీ విధానమా అనే దానిపై స్పష్టత లేదు. గతంలో సీఏఏ బిల్లుకు పార్లమెంట్ లో వైసీపీ(YSRCP) ఎంపీలు ఆమోదం తెలిపారు. ఈ నేపథ్యంలో ఆ బిల్లు ఆమోదం పొంది నేడు చట్టంగా అమలుకాబోతుంది. అయితే తాజా రాజకీయ పరిణామాలు బట్టి ఏపీలో టీడీపీ, జనసేన పార్టీలు నేరుగా బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకు వ్యతిరేకంగా వైసీపీ ప్రభుత్వం తన నిర్ణయం ప్రకటించిందా… లేదా ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ వ్యక్తిగత నిర్ణయం ప్రకటించారా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
‘పౌరసత్వ సవరణ చట్టం-2019 (CAA)’ అమల్లోకి తీసుకువస్తూ కేంద్ర ప్రభుత్వం సోమవారం గెజిట్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ ‘పౌరసత్వ సవరణ చట్టం-2019 (CAA)’ ప్రకారం… పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ ల నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థుల వద్ద తగిన పత్రాలు లేకపోయినా వారికి సత్వరం పౌరసత్వాన్ని ఇచ్చేందుకు కేంద్రం ఈ నిబంధనల్ని రూపొందించింది. 2014 డిసెంబరు 31 కంటే ముందు ఈ మూడు దేశాల నుంచి మన దేశానికి వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలకు ఇవి వర్తిస్తాయి. దీనితో సీఏఏ అమలుకు కేంద్రం నోటిఫికేషన్ జారీ చేయడంపై ఢిల్లీలోని ఆప్, బెంగాల్ లోని టీఎంసీ, కేరళలోని సీపీఎం ప్రభుత్వాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దేశాన్ని విభజించేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందంటూ కేరళ సీఎం పినరయి విజయన్ ఆరోపించారు. ఎట్టిపరిస్థితుల్లో దీన్ని తమ రాష్ట్రంలో అమలుచేయబోమని స్పష్టం చేశారు.
Also Read : BRS MP List: తొమ్మిది మంది లోక్ సభ అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ !