Harish Rao: కేసీఆర్‌ కు సీఎం రేవంత్‌ క్షమాపణలు చెప్పాలి – హరీశ్‌రావు డిమాండ్

కేసీఆర్‌ కు సీఎం రేవంత్‌ క్షమాపణలు చెప్పాలి - హరీశ్‌రావు డిమాండ్

 

తెలంగాణా అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి… మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు డిమాండ్ చేసారు. పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్‌… తెలంగాణా రాష్ట్రాన్ని నంబర్‌ వన్‌గా చేసి దేశానికి ఆదర్శంగా నిలిచారని… అలాంటి వ్యక్తిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్న జానారెడ్డిని కేసీఆర్‌ గౌరవించారని గుర్తు చేశారు. ‘‘సీఎం రేవంత్‌ రెడ్డి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. దీనికి సీఎం క్షమాపణలు చెప్పాలి. ఏకపక్షంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్‌ రెడ్డిని సస్పెండ్‌ చేశారు. తిట్ల పోటీ పెడితే రేవంత్‌ రెడ్డికే మొదటి బహుమతి వస్తుందని సెటైర్లు వేశారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రేవంత్‌ భాష వల్ల తెలంగాణ పరువుపోతుందన్నారు. అలాగే, అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్‌ అని అన్నారు. కాంగ్రెస్ ముసుగులో ఉన్న బీజేపీ మనిషిలా రేవంత్ సభలో మాట్లాడారని ఆరోపించారు.

 

 

తెలంగాణభవన్‌ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్ రావు మాట్లాడుతూ… సీఎం రేవంత్‌కు సంస్కారం ఉందా?. కేసీఆర్‌ను మార్చురీకి పంపాలని ఆయన మాట్లాడుతున్నారు. కేసీఆర్‌ చావును కోరుకుని అనుచిత వ్యాఖ్యలు చేసి… మళ్లీ మాట మార్చి బీఆర్‌ఎస్‌ పార్టీని అన్నట్టుగా చెప్పారు. ఆయన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని కేసీఆర్‌కు క్షమాపణలు చెప్పాలి. కేసీఆర్‌ పెద్ద మనసుతో క్షమిస్తారు.

రుణమాఫీపై రేవంత్‌ కు హరీశ్ సవాల్‌

ఈ సందర్భంగా రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ కు… హరీశ్ బహిరంగ సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి నీకు సవాల్ విసురుతున్నా. మధిరకు పోదామా? కొడంగల్ పోదామా? సిద్దిపేట పోదామా? ఏ ఊరుకు పోదాం?. సంపూర్ణ రుణమాఫీ జరిగింది అంటే ముక్కు నేలకు రాస్తా.. లేదంటే మీరు రాయండి. ప్రజలకు క్షమాపణ చెప్పండి. ఎప్పటిలోగా సంపూర్ణ రుణమాఫీ చేస్తావో చెప్పు రేవంత్’ అని ప్రశ్నించారు.

Leave A Reply

Your Email Id will not be published!