Harish Rao: సీఎం రేవంత్‌ కు హరీష్‌ రావు ఛాలెంజ్ !

సీఎం రేవంత్‌ కు హరీష్‌ రావు ఛాలెంజ్ !

Harish Rao : శ్రీశైలం ఎడమ గట్టు సొరంగం పనులపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నీ అబద్ధాలే చెబుతున్నారని మాజీ మంత్రి హరీష్‌ రావు ఆరోపించారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో టన్నెల్‌ పనులు ముందుకు కదలేదని రేవంత్‌ చేసిన ఆరోపణలనూ హరీష్‌ రావు తీవ్రంగా ఖండించారు. బీఆర్‌ఎస్‌ హయాంలో SLBC టన్నెల్‌ పనులు జరగలేదని నిరూపిస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. లేకుంటే సీఎం పదవికి రేవంత్‌ రాజీనామా చేస్తారా ? అంటూ హరీష్‌ రావు(Harish Rao) సవాల్‌ విసిరారు. మా హయాంలో టన్నెల్‌ పనులు జరిగాయి. 11. కిమీలకు పైగా సొరంగం తవ్వాం… ఇందుకుగానూ రూ.3 వేల కోట్లకు పైగా ఖర్చు చేశాం.ఈ విషయంలో మేం చర్చకు సిద్ధం అని హరీష్‌ రావు అన్నారు. అలాగే… తన దుబాయ్‌పై పర్యటనపై వస్తున్న విమర్శలను ఆయన తోసిపుచ్చారు. దుబాయ్‌లో మిత్రుడి కుమార్తె వివాహానికి వెళ్లాను. ఫిబ్రవరి 21న దుబాయ్‌కి వెళ్లే… 22వ తేదీన ప్రమాదం జరిగింది. దీనిని రాజకీయం చేయడం తగదు అని అన్నారాయన.

Harish Rao Challenge to..

నాగర్‌ కర్నూల్‌ జిల్లా దోమలపెంట వద్ద పది రోజుల కింద సొరంగం పైకప్పు కూలిపోయి ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 8 మంది కార్మికుల ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆదివారం పాలమూరు పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్‌ రెడ్డి(CM Revanth Reddy)… టన్నెల్‌ వద్దకు వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం టన్నెల్‌ ప్రమాదం జరిగిందని ఆరోపించారు. ఫ్లోరైడ్‌ పీడిత నల్లగొండ జిల్లాతో పాటు మహబూబ్‌నగర్‌ జిల్లాకు చిరకాల వాంఛగా ఉన్న ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టుపై గత ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపింది. పదేళ్లలో కనీసం 3 కి.మీ కూడా పూర్తిచేయలేదు. బిల్లులు ఇవ్వకుండా కాంట్రాక్టు కంపెనీని ఇబ్బంది పెట్టారు. కరెంట్‌ బిల్లులు చెల్లించలేదని విద్యుత్‌ను కట్‌ చేయడంతో మోటార్లు నడవని పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక అన్ని జాగ్రత్తలు తీసుకుని పనులు ప్రారంభించిందన్నారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్ రావును ఉద్దేశ్యించి మాట్లాడుతూ… ‘ప్రమాదం జరిగితే నేను ఎన్నికల ప్రచారానికి వెళ్లానని హరీశ్‌ అంటున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత హరీశ్‌ దుబాయ్‌ లో దావత్‌ చేసుకున్నది నిజం కాదా? అబుదాబిలో రెండురోజులు దావత్‌ లో మునిగి తేలారు. మత్తు దిగినాక వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. హరీశ్‌… మీ పాస్‌పోర్టును బయట పెట్టండి. ఎయిర్‌పోర్టులో వివరాలు చూడండి. నేను వస్తే రెస్క్యూ చర్యలకు ఇబ్బంది కలుగుతుందనే రాలేదు. ఇట్ల సోయి లేకుండా మాట్లాడవచ్చా?..’ అంటూ మండిపడ్డారు.

Also Read : ECI: ఓటరు కార్డులపై మమత వ్యాఖ్యలకు ఎన్నికల కమీషన్ క్లారిటీ !

Leave A Reply

Your Email Id will not be published!