Harish Rao: దిల్లీ భేటీ ఎజెండాలో మొదటి అంశమే బనకచర్ల ప్రాజెక్ట్ – మాజీ మంత్రి హరీశ్ రావు
దిల్లీ భేటీ ఎజెండాలో మొదటి అంశమే బనకచర్ల ప్రాజెక్ట్ - మాజీ మంత్రి హరీశ్ రావు
Harish Rao : ‘‘తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు దిల్లీలో జరిపిన భేటీలో మొదటి అంశమే గోదావరి-బనకచర్ల. అసలు బనకచర్ల అంశం ఎజెండాలో లేనప్పుడు… ఆపాలనే ముచ్చట రాదని సీఎం రేవంత్‌రెడ్డి పచ్చి అబద్ధాలు చెప్పారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు (Harish Rao) ఆరోపించారు. ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు మాత్రం బనకచర్లపై చర్చించామని, పరిష్కారం కోసం కమిటీ వేశామని అంటున్నారు. మరి ముఖ్యమంత్రి రేవంత్ మాత్రం బనకచర్ల అంశం ఎజెండాలో లేదని అంటున్నారు. ఒక ముఖ్యమంత్రి అలా అవాస్తవాలు మాట్లాడవచ్చా ? అని ప్రశ్నించారు.
Harish Rao Key Comments
రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడానికి ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు. ఏపీకి, చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించేందుకు కాదు. అబద్ధాలు చెప్పినందుకు రాష్ట్ర ప్రజలకు సీఎం క్షమాపణ చెప్పాలి. తెలంగాణ ప్రయోజనాలకు ద్రోహం చేస్తే సహించేది లేదు’’ అని భారత రాష్ట్ర సమితి సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) విమర్శించారు. తెలంగాణ భవన్‌లో భారత రాష్ట్ర సమితి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్‌రెడ్డి, డాక్టర్ సంజయ్, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిలతో కలిసి బుధవారం హరీశ్‌రావు విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
‘‘బనకచర్లపై సమావేశం పెడితే.. దిల్లీకి వెళ్లబోమని లీకులిచ్చిన రేవంత్‌రెడ్డి ఎందుకు వెళ్లారు? అర్ధరాత్రి జరిగిన చీకటి ఒప్పందం ఏమిటి? గోదావరి-బనకచర్ల అంశంపై కేంద్ర ప్రభుత్వం సమావేశం పెట్టడం తప్పు. సీడబ్ల్యూసీ, జీఆర్‌ఎంబీ, పోలవరం ప్రాజెక్టు అథారిటీలు బనకచర్ల ప్రీ ఫీజిబిలిటి రిపోర్టును తిరస్కరించాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థలు తిరస్కరించాక.. కేంద్రం ఎలా సమావేశం ఏర్పాటు చేసింది? కమిటీ ఏర్పాటుపై రేవంత్ సంతకం ఎందుకు పెట్టారు? మొన్నటి పవర్ పాయింట్ ప్రజంటేషన్‌లో చంద్రబాబును ఒక్క మాట కూడా అనలేదు. రేవంత్ పోరాటం ఎవరి మీద? తెలంగాణ సాధించిన కేసీఆర్‌పైనా? తెలంగాణకు మోసం చేస్తున్న చంద్రబాబుపైనా? రాష్ట్రంలో నడుస్తున్నది కాంగ్రెస్ పాలన కాదు… భాజపా, తెదేపాల రిమోట్ పాలన. భాజపా, కాంగ్రెస్‌లు తెలంగాణకు ద్రోహం చేస్తున్నాయి. టెలిమెట్రీలు కొత్తగా పెట్టేదేముంది? పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు వరకు భారత రాష్ట్ర సమితి హయాంలోనే పెట్టారు. బనకచర్లకు భారత రాష్ట్ర సమితి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోదు’’ అని హరీశ్‌రావు స్పష్టం చేశారు.
Also Read : CM Revanth Reddy: సీఎంల సమావేశంలో బనకచర్ల ప్రతిపాదనే రాలేదు – సీఎం రేవంత్
