Haryana Government: హరియాణా పాఠశాలల్లో ‘గుడ్ మార్నింగ్’కు బదులు జైహింద్ !
హరియాణా పాఠశాలల్లో ‘గుడ్ మార్నింగ్’కు బదులు జైహింద్ !
Haryana Government: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని హరియాణా(Haryana) ప్రభుత్వం కీలక ప్రకటన వెలువరించింది. ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లోని విద్యార్థులు టీచర్లకు, తోటి స్నేహితులకు పలకరింపుగా ‘గుడ్ మార్నింగ్’కు బదులుగా ‘జై హింద్’ అని చెప్పాలని పాఠశాల విద్య డైరెక్టరేట్ ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే దేశభక్తి, దేశంపై గౌరవం, ఐక్యతా భావాలను పెంపొందించాలనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఆగస్టు 15న జాతీయజెండాను ఎగురవేసే ముందు నుంచి ఈ సూచనలను అమలు చేయనున్నట్లు వెల్లడించారు.
ఇకపై స్కూళ్లలో ఉపాధ్యాయలకు పిల్లలు గుడ్ మార్నింగ్ చెప్పకూడదు. కానీ దానికి బదులుగా జై హింద్ అని చెప్పాలి. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఆగస్టు 15న జరగనున్నాయి. అందుకే విద్యార్థుల్లో జాతీయ ఐక్యత, దేశభక్తి భావనను పెంపొందించే లక్ష్యంతో హర్యానా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 15 నుంచి ఈ నిర్ణయాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్కూళ్లలో అమలు చేయనున్నారు. ఇప్పటికే రెండు పేజీల నోటిఫికేషన్‌ను విడుదల చేయగా, నోటిఫికేషన్ ప్రకారం విద్యార్థులు పాఠశాలలో ‘గుడ్ మార్నింగ్’కి బదులుగా ‘జై హింద్’ అని ఉపయోగించాలని తెలిపింది.
Haryana Government – కారణమిదే !
ఈ నోటిఫికేషన్‌లో విద్యాశాఖ పలు వాదనలు చేసింది. ఏ ప్రాతిపదికన పిల్లలకు ‘జై హింద్’ అని చెప్పడం తప్పనిసరి చేశారో ప్రస్తావించారు. అంతేకాకుండా ఈ ప్రభుత్వ నోటిఫికేషన్ లో ‘జై హింద్’ ప్రాముఖ్యతను కూడా వివరించారు. చిన్నతనంలోనే పిల్లల్లో దేశం పట్ల భావాలు మెలగాలని హర్యానాలోని నయాబ్ సైనీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జిల్లా, బ్లాక్ అధికారులకు విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ విధానాన్ని ప్రిన్సిపాల్, ప్రధానోపాధ్యాయులు త్వరగా అమలు చేయాలని సూచించారు. ఆగస్టు 15న త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే ముందు పాఠశాలల్లో ఈ విధానం ప్రారంభించాలని పాఠశాలలకు జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
పిల్లల్లో దేశభక్తి, జాతీయవాదాన్ని పెంపొందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని నొక్కి చెబుతూ, జై హింద్ చెప్పడం పాఠశాల విద్యార్థులకు జాతీయ ఐక్యత, మన దేశ చరిత్ర గురించి స్ఫూర్తినిస్తుందని డిపార్ట్‌మెంట్ పేర్కొంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్‌ను స్థాపించిన సమయంలో జై హింద్ నినాదం ఇచ్చారని ఈశాఖ తన నిర్ణయంలో తెలిపింది. అందుకే దేశం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన వారి పట్ల మన పిల్లలు కూడా గౌరవ భావాన్ని పెంపొందించుకుంటారని అభిప్రాయం వ్యక్తం చేసింది. అయితే ఈ నిర్ణయాన్ని పలువురు సమర్థిస్తుండగా, మరికొంత మంది మాత్రం వ్యతిరేకిస్తున్నారు.
Also Read : Manish Sisodia: జైలు నుంచి విడుదలైన మనీశ్ సిసోదియా ! నేరుగా కేజ్రీవాల్ ఇంటికి !