Hathras Incident : హాథ్రస్‌ తొక్కిసలాట బాధితులను పరామర్శించిన రాహుల్‌ గాంధీ !

హాథ్రస్‌ తొక్కిసలాట బాధితులను పరామర్శించిన రాహుల్‌ గాంధీ !

Hathras: ఉత్తర్‌ప్రదేశ్‌ లోని హాథ్రస్‌లో భోలే బాబా సత్సంగ్‌ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాట యావత్‌ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ దుర్ఘటనలో బాధిత కుటుంబాలను కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ శుక్రవారం పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. శుక్రవారం ఉదయం ఢిల్లీ నుంచి రోడ్డు మార్గంలో బయల్దేరిన రాహుల్‌ గాంధీ తొలుత అలీగఢ్‌ చేరుకున్నారు. అక్కడ బాధితుల ఇళ్లకు వెళ్లి కుటుంబసభ్యులతో మాట్లాడారు. అండగా ఉంటామని వారికి ధైర్యం ఎప్పారు. అనంతరం హాథ్రస్‌(Hathras) చేరుకుని తొక్కిసలాట బాధితులను పరామర్శించారు. ఆయన వెంట యూపీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అజయ్‌ రాయ్‌, పార్టీ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనేత్‌ తదితరులు ఉన్నారు.

Hathras Incident..

జులై 2న హాథ్రస్‌(Hathras)లోని ఫుల్‌రయీలో జరిగిన భోలే బాబా సత్సంగ్‌ కార్యక్రమంలో ఈ పెను విషాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. బాబా దర్శనానికి భక్తులు పోటెత్తడంతో తొక్కిసలాట జరిగి 121 మంది మృతి చెందారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. వీరు భోలే బాబా సత్సంగ్‌ లో సేవకులుగా నాన్ని నియంత్రించే బాధ్యతలను చేపట్టారు. వారు విఫలం కావడంతో తోపులాట జరిగింది. కాగా.. ఘటన తర్వాత నుంచి భోలే బాబా పరారీలో ఉన్నాడు.

ఉత్తర్‌ ప్రదేశ్‌ లోని హాథ్రస్‌(Hathras) జిల్లాలో జరిగిన తొక్కిసలాటకు కేంద్ర బిందువుగా మారిన భోలే బాబా ఆచూకీ ఇప్పటి వరకు లభించలేదు. 121 మంది మృతికి కారణమైన ఈ ఘటనలో ఇప్పటి వరకు ఆరుగురిని అరెస్టు చేశారు. ఈ దుర్ఘటనపై జ్యుడిషియల్‌ విచారణ జరుపుతామని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ హామీ ఇచ్చారు. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న సూరజ్‌పాల్‌ అలియాస్‌ నారాయణ్‌ సాకార్‌ హరి అలియాస్‌ భోలే బాబా దొరికితే ప్రశ్నిస్తామని అలీగఢ్‌ ఐజీ శాలభ్‌ మాథుర్‌ గురువారం తెలిపారు.

ఈ క్రమంలో భోలే బాబాకు సంబంధించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయన ఆస్తులు, విలాసాలపై ఓ జాతీయ మీడియా ఛానెల్ విస్తుపోయే నిజాలు వెల్లడించింది. ఆయన ఆశ్రమంలోని విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం సేకరించినట్లు వెల్లడించింది. భోలే బాబాకు దేశవ్యాప్తంగా 24 ఆశ్రమాలు ఉన్నాయని సమాచారం. వీటిలో అత్యధికంగా యూపీలోనే ఉన్నాయి. ఆయన ఆస్తుల విలువ దాదాపు రూ.100 కోట్ల వరకు ఉంటుందని ఆశ్రమంలో విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దాదాపు 16 మంది వ్యక్తిగత కమాండోలు ఆయన కారుకు ముందు 350 సీసీ బైక్‌లపై ప్రయాణిస్తూ దారిని క్లియర్‌ చేస్తారు. వెనక 15-30 కార్లతో ఆయన కాన్వాయ్‌ ఉంటుంది. దీంట్లో తెల్లటి టయోటా ఫార్చునర్‌ కారులో ఆయన ప్రయాణిస్తారు. కారు సీట్లతో సహా ఇంటీరియర్‌ సైతం పూర్తిగా తెలుపు రంగులో ఉంటుందని ఆయన అనుచరుల్లో కొంతమంది తెలిపారు.

సూరజ్‌పాల్‌ మెయిన్‌పురిలోని ఆశ్రమంలో నివాసముంటారు. హరి నగర్‌గా పిలిచే ఈ ఆశ్రమం 13 ఎకరాల్లో విస్తరించి ఉంది. భోలే బాబా ఆయన భార్య కోసం అందులో దాదాపు ఆరు విలాసవంతమైన గదులు ఉంటాయని సమాచారం. ఆశ్రమంలోకి ప్రవేశిస్తుండగానే దానికి విరాళాలిచ్చిన 200 మంది పేర్లు కనిపిస్తాయని తెలుస్తోంది. వాటిపై రూ.10 వేల నుంచి రూ.2.5 లక్షల వరకు ఇచ్చిన దాతల వివరాలు ఉంటాయని సమాచారం. ఇటావాలో మరో కొత్త ఆశ్రమం నిర్మాణంలో ఉంది. శ్రీ నారాయణ్‌ హరి సాకార్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ పేరిట వీటిని నిర్వహిస్తున్నారు. ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉండేవాళ్లే వీటి నిర్వహణ కార్యకలాపాలు చూస్తుంటారు. నిత్యం తెలుపు రంగు దుస్తులు, టై, కళ్లద్దాల్లో కనిపించే ఆయన అనుచరులకు దర్శనమిచ్చే సమయంలో భారీ పరేడ్‌తో వస్తారు.

Also Read : అమరావతి నిర్మాణానికి తొలి వేతనాన్ని విరాళంగా అందజేసిన విజయనగరం ఎంపీ !

Leave A Reply

Your Email Id will not be published!