Hathras Tragedy: ఆధ్యాత్మిక కార్యక్రమంలో తొక్కిసలాట ! 116 మంది మృతి!

ఆధ్యాత్మిక కార్యక్రమంలో తొక్కిసలాట ! 116 మంది మృతి!

Hathras Tragedy: ఉత్తర్‌ప్రదేశ్‌ లోని హాథ్రస్‌ లో పెను విషాదం చోటుచేసుకుంది. రతిభాన్‌పుర్‌లో ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో 116 మంది మృత్యువాత చెందగా వందలాదిమంది గాయపడ్డారు. ఈ విషయాన్ని అలీగఢ్‌ రేంజ్‌ ఐజీ షలాభ్‌ మాథుర్‌ ప్రకటించారు. తొక్కిసలాట సమయంలో భక్తుల హాహాకారాలు, ఆర్తనాదాలతో అక్కడి పరిస్థితి అత్యంత హృదయ విదారకంగా మారింది. సికిందర్‌రావు ఆస్పత్రి సహా పలు చోట్ల మృతదేహాలు చెల్లాచెదురుగా పడిఉండగా… కుటుంబ సభ్యులు, బంధువులు విలపిస్తున్న దృశ్యాలు హృదయాలను మెలిపెడుతున్నాయి. మృతుల్లో ఎక్కువమంది మహిళలే ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను  సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

Hathras Tragedy Viral

అంతకుముందు ఈ దుర్ఘటనపై హాథ్రస్‌(Hathras) జిల్లా మెజిస్ట్రేట్‌ ఆశీష్‌ కుమార్‌ మాట్లాడుతూ… ‘‘ జిల్లా అధికార యంత్రాంగం ఈ ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తు చేస్తోంది. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నాం. ఇది ఓ ప్రైవేటు కార్యక్రమం. సబ్‌ డివిజినల్‌ మెజిస్ట్రేట్‌ అనుమతి ఇచ్చారు. అధికారులే భద్రతా ఏర్పాట్లు చేశారు. కానీ, మిగతా ఏర్పాట్లను నిర్వాహకులే చేసుకున్నారు. క్షతగాత్రులు, మృతుల కుటుంబ సభ్యులకు అవసరమైన సహాయ సహకారాలపైనే దృష్టిసారించాం’’ అని తెలిపారు.

‘‘ఇప్పటివరకు పలు మృతదేహాలను పోస్టుమార్టం కోసం తీసుకువచ్చారు. గాయపడినవారికి చికిత్స అందుతోంది. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడవుతాయి’’ అని ఇటా చీఫ్‌ మెడికల్ ఆఫీసర్‌ ఉమేశ్‌ త్రిపాఠి మీడియాకు వెల్లడించారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారని అధికారులు తెలిపారు. ఈ విషాదంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే ఘటనా స్థలం వద్దకు వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొనాలని అధికారులను ఆదేశించారు.
ప్రధాని మోదీ దిగ్భ్రాంతి..

హాథ్రస్‌(Hathras) ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం చర్చ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కేంద్ర మంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ తదితరులు విచారం వ్యక్తం చేశారు.

‘‘హాథ్రస్‌(Hathras)లో జరిగిన తొక్కిసలాటలో పలువురు మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో అధికార యంత్రాంగం సహాయక చర్యల్లో నిమగ్నమై ఉంది. కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు యూపీ ప్రభుత్వంతో నిరంతరం టచ్‌లో ఉన్నారు. బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఈ సభ ద్వారా హామీ ఇస్తున్నా’’ – ప్రధాని నరేంద్ర మోదీ
‘ఉత్తర్‌ప్రదేశ్‌ ఘటన బాధాకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. స్థానిక యంత్రాంగం సహాయక చర్యల్లో నిమగ్నమై ఉంది. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’ – అమిత్‌ షా, కేంద్ర హోంశాఖ మంత్రి

ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన తొక్కిసలాటలో పలువురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. క్షతగాత్రులకు చికిత్స అందించాలని, బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా. ‘ఇండియా’ కూటమి శ్రేణులు సహాయక చర్యల్లో భాగం కావాలని విజ్ఞప్తి చేస్తున్నా. – రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత.

Also Read : CM Revanth Reddy: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖపై స్పందించిన సీఎం రేవంత్‌రెడ్డి !

Leave A Reply

Your Email Id will not be published!