Hemant Soren: భూ కుంభకోణం కేసులో ఝార్ఖండ్‌ మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌ కు బెయిల్‌ !

భూ కుంభకోణం కేసులో ఝార్ఖండ్‌ మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌ కు బెయిల్‌ !

Hemant Soren: భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో విచారణను ఎదుర్కొంటున్న ఝార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ కు భారీ ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు రాష్ట్ర హైకోర్టు శుక్రవారం బెయిల్‌ మంజూరుచేసింది. ‘‘ప్రాథమిక ఆధారాల పరంగా ఆయన ఏ నేరానికి పాల్పడలేదు. బెయిల్‌ పై ఉన్నప్పుడు నేరం చేసే అవకాశాలు కూడా లేవని కోర్టు గుర్తించింది. అందుకే ఆయనకు బెయిల్‌ ఇస్తున్నాం’’ అని ధర్మాసనం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.

Hemant Soren Bail..

భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో ఝార్ఖండ్‌ ముక్తిమోర్చ కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్‌ సోరెన్‌ను ఈ ఏడాది జనవరి 31న ఈడీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి ఆయన బిర్సా ముండా జైల్లో ఉన్నారు. అరెస్టుకు కొన్ని గంటల ముందే ఆయన నాటకీయ పరిణామాల నడుమ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయగా… నూతన సీఎంగా చంపాయి సోరెన్‌ బాధ్యతలు చేపట్టారు.

రాంచీలో 8.86 ఎకరాలకు సంబంధించిన భూ కుంభకోణం కేసులో హేమంత్‌ సోరెన్‌(Hemant Soren) అరెస్టయ్యారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అధికారిక రికార్డులు తారుమారు చేయడం, కల్పిత లావాదేవీలు, నకిలీ పత్రాలతో కోట్లాది రూపాయల విలువైన భూమిని సంపాదించి.. అక్రమ ఆదాయాన్ని పొందారని ఈడీ ఆరోపించింది. ఈ కేసులో బెయిల్‌ కోసం సోరెన్‌ పలు న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఎన్నికల వేళ ప్రచార నిమిత్తం బెయిల్‌ ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరినప్పటికీ ఉపశమనం లభించలేదు. చివరకు నేడు ఆయనకు హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

Also Read : Delhi Airport: ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో కూలిన టెర్మినల్‌ పైకప్పు ! ఆరుగురికి గాయాలు !

Leave A Reply

Your Email Id will not be published!