Hero Vijay: వివాదాస్పదంగా మారిన విజయ్‌ “తమిళగ వెట్రి కళగం” పార్టీ జెండా !

వివాదాస్పదంగా మారిన విజయ్‌ "తమిళగ వెట్రి కళగం" పార్టీ జెండా !

వివాదాస్పదంగా మారిన విజయ్‌ “తమిళగ వెట్రి కళగం” పార్టీ జెండా !

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌… ఇటీవల “తమిళగ వెట్రి కళగం” అనే రాజకీయ పార్టీను పెట్టినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. 2024 ఎన్నికలకు ముందు తన పార్టీను ప్రకటించినప్పటికీ… 2026లో తమిళనాడులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ బరిలో దిగుతుందని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఒప్పుకున్న చిత్రాలను త్వరత్వరగా పూర్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాను కొత్తగా ప్రారంభించిన “తమిళగ వెట్రి కళగం” పార్టీ కోసం రూపొందించిన జెండాను హీరో విజయ్ ఆవిష్కరించారు. పార్టీ కోసం రూపొందించిన జెండాను ఆయన గురువారం పనయూరులో జరిగిన పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఆ జెండా నిండా మెరూన్‌ కలర్‌, పసుపుపచ్చ, పోరాటతత్వానికి చిహ్నంగా రెండు ఏనుగులు, మధ్య వాగై పుష్పం ఉంది. ప్రస్తుతం విజయ్ విడుదల చేసిన ఆ జెండా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

 

అయితే విజయ్ ఆవిష్కరించిన “తమిళగ వెట్రి కళగం” జెండాకు వ్యతిరేకంగా గ్రేటర్‌ చెన్నై పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో బీఎస్పీ శుక్రవారం ఫిర్యాదు చేసింది. విజయ్‌ పార్టీ జెండాలపై ఏనుగుల బొమ్మలు తొలగించాలంటూ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆనందన్‌ డిమాండ్‌ చేశారు. తమ పార్టీ ఎన్నికల గుర్తు అయిన ఏనుగుకు కేంద్ర ఎన్నికల కమిషన్‌ అంగీకారం ఉందని, అందువల్ల ఇతర పార్టీలు తమ ఎన్నికల గుర్తును ఏ రూపంలోనూ వినియోగించుకోరాదని ఆనందన్‌ సోషల్‌ మీడియాలో వీడియో కూడా విడుదల చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం అసోం, సిక్కిం రాష్ట్రాలు మినహా మిగతా ఏ రాష్ట్రాల్లోను తమ పార్టీ చిహ్నం ఏనుగును ఏ జెండాలో వాడకూడదని ఆ వీడియోలో తెలిపారు. అంతేకాకుండా ఆయన విజయ్‌ పార్టీ నిర్వాహకులకు కూడా ఆ వీడియో పంపించారు.

 

ఇదిలా ఉండగా, స్థానిక ఆర్కే నగర్‌ ప్రాంతానికి చెందిన సంఘసేవకుడు ఆర్టీఐ సెల్వం శుక్రవారం వెప్పేరిలోని పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో విజయ్‌ పార్టీ జెండాకు వ్యతిరేకంగా పిటిషన్‌ సమర్పించారు. విజయ్‌ పార్టీ జెండాలో చట్టవిరుద్ధంగా కేరళ రాష్ట్ర ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ ఏనుగుల గుర్తు ఉందని, వెళ్లాలర్‌ సామాజిక వర్గాలు ఉపయోగించే జెండా రంగులు, స్పెయిన్‌ జాతీయ పతాకంలోని రంగులు, శ్రీలంక తమిళులు గుర్తుగా ఉన్న వాగై పుష్పం అని ఎవరి అనుమతి లేకుండా జెండాలో వాటిని పొందుపరిచారని పేర్కొన్నారు.

కేంద్ర ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారం 2012వ సంవత్సరం నుంచి ఏ పార్టీ పతాకంలోనూ అడవి జంతువుల ఫొటోలు, పక్షులు వంటి చిహ్నాలను ముద్రించరాదని, అయితే ఈసీ నిబంధనలు కూడా విజయ్‌ పార్టీ ఉల్లంఘించిందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈసీ నిబంధనలు అతిక్రమించిన విజయ్‌పై పోలీసు శాఖ తగిన చర్యలు తీసుకోవాలని లేకుంటే హైకోర్టులో కేసు దాఖలు చేస్తానంటూ సెల్వం తన ఫిర్యాదులో తెలిపారు.

Leave A Reply

Your Email Id will not be published!