Hero Vijay: తమిళ నాట కొత్త రాజకీయ పార్టీను ప్రారంభించిన హీరో విజయ్‌ !

తమిళ నాట కొత్త రాజకీయ పార్టీను ప్రారంభించిన హీరో విజయ్‌ !

Hero Vijay: తమిళనాట సినీరంగ నేపథ్యమున్న మరో రాజకీయ పార్టీకి బీజం పడింది. కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు చెప్పడంతోపాటు… కొత్తగా రాజకీయ పార్టీను ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు. ‘తమిళగ వెట్రి కళగం’ (తమిళనాడు విజయం పార్టీ) పేరుతో పార్టీ ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నానని… ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ పేరు నమోదు చేయించనున్నట్లు తెలిపారు. ‘‘పారదర్శకమైన జాతి, మత భేదాలకు తావులేని, అవినీతి రహిత సమాజ స్థాపన కోసం, రాజకీయ మార్పు కోసం ప్రజలంతా ఎదురుచూస్తున్నారు.

ఆ లోటును తీర్చేందుకే రాజకీయ పార్టీ ప్రారంభిస్తున్నాం’’ అని విజయ్‌ పేర్కొన్నారు. అయితే మరికొన్ని నెలల్లో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో తన పార్టీ పోటీలో ఉండదని, ఏ కూటమికీ మద్దతు ఇచ్చే ప్రసక్తి లేదని స్పష్టం చేసారు. 2026లో జరగనున్న రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో మాత్రం తమ పార్టీ తప్పకుండా పోటీ చేసి అధికారంలోకి వస్తుందని విజయ్‌ ధీమా వ్యక్తం చేశారు. తన అభిమాన నటుడు విజయ్‌ పార్టీ ప్రారంభించడంపై తమిళనాడు వ్యాప్తంగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. బాణాసంచాలు కాల్చి, మిఠాయిలు పంచి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Hero Vijay Enter into Politics

దర్శకుడు ఎస్‌ఏ చంద్రశేఖర్‌ కుమారుడు విజయ్‌(Vijay) బాలనటుడిగా కోలీవుడ్ లో అడుగుపెట్టారు. ఆ తరువాత హీరోగా నటించి… కోలీవుడ్‌లో తిరుగులేని కథానాయకుడిగా ఎదిగారు. సామాజిక, రాజకీయ అంశాలపై తనదైన శైలిలో స్పందించి విజయ్ కు…. తాను నటించిన పలు సినిమాలకు రాజకీయపరమైన సమస్యలు కూడా ఎదురయ్యాయి. జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చిన ‘తలైవా’ సినిమాకు అడ్డంకులు వచ్చాయి. ఇటీవల విడుదలైన ‘వారిసు’(వారసుడు) సినిమాకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎదురుదెబ్బలు తగిలాయి. ఆ మధ్య విజయ్… కేంద్ర ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేయడంతో ఆయన నటించిన సినిమాలపై బిజేపీ నాయకులనుండి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే విజయ్ ను రాజకీయాల్లోకి రావాలంటూ అభిమానులు ఎప్పటినుంచో ఆహ్వానం పలుకుతున్నారు.

మరోవైపు విజయ్ తన అభిమానుల సంఘాల ద్వారా ‘విజయ్‌ మక్కల్‌ ఇయక్కం’(విజయ్‌ ప్రజా సంస్థ) పేరుతో కొన్నేళ్లుగా పలు సామాజిక సేవా కార్యక్రమాలను స్వచ్ఛందంగా చేపడుతున్నారు. కొద్ది నెలల కిందట ప్లస్‌వన్‌, ప్లస్‌టూ విద్యార్థులకు బహుమతులు, ప్రోత్సాహకనిధి అందించడం, వరద బాధితులకు సహాయకాల పంపిణీతో రాజకీయాల్లోకి వస్తారన్న ప్రచారం ఊపందుకుంది. సామాజిక, ఆర్థికపరమైన రాజకీయ సంస్కరణలు తెచ్చేందుకు స్వచ్ఛంద సంస్థకు సాధ్యం కాకపోవడంతోనే విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ‘తమిళగ వెట్రి కళగం’ పేరుతో రాజకీయ పార్టీ పెట్టినట్లు తెలుస్తోంది. గత వారం రోజుల పాటు అభిమాన సంఘాల నిర్వాహకులతో సమావేశం అయి… పార్టీపై చర్చించి తుది నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే జాతి, మతభేదంలేని పార్టీగా ‘తమిళగ వెట్రి కళగం’ పేదలకు అండగా ఉంటుందని ఆయన శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.

విజయ్‌(Vijay) రాజకీయ ప్రవేశంపై పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తమిళనాడు ప్రజలను దోచుకుంటున్న అవినీతి రాజకీయాలకు వ్యతిరేకంగా, ప్రజల కోసం పని చేసేందుకు పార్టీ ప్రారంభించిన సహోదరుడు విజయ్‌ శుభాకాంక్షలు అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఓ ప్రకటనలో తెలిపారు. నామ్‌ తమిళర్‌ కట్చి ప్రధాన సమన్వయకర్త సీమాన్‌ మాట్లాడుతూ కొత్తగా పార్టీ ప్రారంభించిన నటుడు విజయ్‌ ప్రజల మనసు గెలవాలన్నారు.

Also Read: AP CM YS Jagan : వై నాట్ 175 అంటూ దెందులూరు ‘సిద్ధం’ సభకు హాజరవుతున్న సీఎం వైఎస్ జగన్

Leave A Reply

Your Email Id will not be published!