YCP Office: వైసీపీ కార్యాలయాల కూల్చివేతలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు !
వైసీపీ కార్యాలయాల కూల్చివేతలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు !
YCP Office: వైసీపీ కార్యాలయాల కూల్చివేతలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు వెలువరించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేదాకా స్టేటస్ కో(యధాతధ) స్థితిని కొనసాగించాలని… కూల్చివేతలు చేపట్టవద్దని తెలిపింది. అదే సమయంలో అధికారులు తొందరపాటు చర్యలు తీసుకోవద్దని… వైసీపీ వివరణ తీసుకోవాలని అధికార యంత్రాంగానికి సూచించింది.
YCP Office….
వైసీపీ ఆఫీసుల కూల్చివేతలపై చట్ట నిబంధన అనుసరించాలని కోర్టు పేర్కొంది. అదనపు ఆధారాలు ఉంటే 2 వారాల్లో సమర్పించాలన్న హైకోర్టు… వాదనలు విన్న తర్వాత పూర్తిస్థాయి ఉత్తర్వులు వెలువరిస్తామని చెప్పింది. కోర్టులో వాదనల ప్రక్రియ పూర్తయ్యే వరకు కూల్చివేతలు చేపట్టొద్దని హైకోర్టు పేర్కొంది. ప్రజా ప్రయోజనాలు ప్రభావితం అయితేనే చర్యలు తీసుకోవాలని… లేదంటే పార్టీ కార్యాలయాలను కూల్చడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది.
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరంలో నిర్మాణంలో ఉన్న వైసీపీ(YCP) కార్యాలయ భవనాన్ని అధికారులు ఇటీవల కూల్చివేశారు. నీటి పారుదల శాఖ స్థలంలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా ఈ పార్టీ కార్యాలయం నిర్మాణాన్ని చేపట్టడంతో కూల్చివేసినట్లు మంగళగిరి, తాడేపల్లి మున్సిపాలిటీ అధికారులు తెలిపారు. ఉదయం 5 గంటలకే పార్టీ కార్యాలయం ఆవరణకు చేరుకున్న మున్సిపల్ అధికారుల బృందం… గంటల వ్యవధిలోనే నిర్మాణంలో ఉన్న కార్యాలయాన్ని నేట మట్టం చేసారు. బోట్ యార్డుగా ఉపయోగిస్తున్న స్థలాన్ని తక్కువ లీజుతో వైసీపీ కార్యాలయం కోసం గత ప్రభుత్వం కట్టబెట్టింది. ఈ అక్రమ నిర్మాణంపై వైసీపీకు సీఆర్డీఏ నోటీసులు జారీ చేసింది.
దీనితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయాలకు అధికారులు నోటీసులు జారీ చేసారు. ఈ నేపథ్యంలో కార్యాలయాల కూల్చివేతపై వైసీపీ నాయకులు హై కోర్టును ఆశ్రయించారు.
Also Read : Ex CM KCR : మాజీ సీఎం కేసీఆర్ పిటిషన్ ను కొట్టివేసిన హైకోర్టు