Pawan Kalyan: వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యల కేసులో హైకోర్టులో పవన్ కళ్యాణ్ కు ఊరట !
వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యల కేసులో హైకోర్టులో పవన్ కళ్యాణ్ కు ఊరట !
Pawan Kalyan: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు హైకోర్టులో ఊరట లభించింది. వారాహి యాత్ర సందర్భంగా ఏలూరులో వాలంటీర్లను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారని, పరువునష్టం కింద శిక్షించాలంటూ గతంలో వైసీపీ ప్రభుత్వం గుంటూరు కోర్టులో దాఖలు చేసిన కేసులో తదుపరి చర్యలన్నింటినీ నిలిపేసింది. ఫిర్యాదిదారు ఎంఎస్ సిరాజుద్దీన్ కు నోటీసులిచ్చింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వీఆర్‌కే కృపాసాగర్ మంగళవారం ఈమేరకు ఉత్తర్వులిచ్చారు.
Pawan Kalyan…
ఏలూరులో 2023 జులై 9న వారాహి యాత్ర సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మాట్లాడుతూ… నిఘా వర్గాల సమాచారం మేరకు రాష్ట్రంలో సుమారు 30 వేల మంది యువతులు, మహిళలు అదృశ్యమయ్యారన్నారు. వాలంటీర్లు సేకరిస్తున్న సమాచారం కొంతమంది అసాంఘిక శక్తుల చేతుల్లోకి వెళ్లడం… మహిళల అపహరణకు దోహదపడుతోందన్నారు. ఈ వ్యాఖ్యలపై వైసీపీ ప్రభుత్వం ఐపీసీ సెక్షన్ 499, 500 కింద గుంటూరు న్యాయస్థానంలో ప్రైవేటు క్రిమినల్ కేసు దాఖలు చేయగా కోర్టు విచారణకు స్వీకరించింది. ప్రస్తుతం కేసు విచారణ గుంటూరు నాలుగో అదనపు జిల్లా కోర్టులో సాగుతోంది.
తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హైకోర్టులో తాజాగా పిటిషన్ వేశారు. మంగళవారం జరిగిన విచారణలో పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. పిటిషనర్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా లేవన్నారు. రాజకీయ కక్షతో అప్పటి ప్రభుత్వం తప్పుడు కేసు నమోదు చేసిందన్నారు. పిటిషనర్‌పై దాఖలు చేసిన ప్రైవేటు ఫిర్యాదు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధం అన్నారు. గుంటూరు కోర్టులో విచారణను నిలుపుదల చేయాలని కోరారు.
అడ్వొకేట్ జనరల్(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ… పిటిషనర్ పై దాఖలు చేసిన కేసు కేకే మిశ్రా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధమన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో పలువురిపై అనేక కేసులు నమోదు చేశారన్నారు. వాటిన్నింటిని ప్రస్తుత ప్రభుత్వం పునఃపరిశీలన చేసి నిర్ణయం తీసుకోబోతోందన్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు కోర్టులో పిటిషనర్‌పై కేసు విచారణను పరిమిత కాలం నిలుపుదల చేసినా అభ్యంతరం లేదన్నారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయమూర్తి… దిగువ కోర్టులో కేసు విచారణను నాలుగు వారాలు నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు.
Also Read : AP Budget: రూ.1.30 లక్షల కోట్లతో ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్ ! గవర్నర్ ఆమోదించాక ఆర్డినెన్స్