Janasena Symbol: స్వతంత్ర అభ్యర్థులకు ‘గాజు గ్లాసు’ కేటాయించడంపై హైకోర్టులో విచారణ !
స్వతంత్ర అభ్యర్థులకు ‘గాజు గ్లాసు’ కేటాయించడంపై హైకోర్టులో విచారణ !
Janasena Symbol:స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయిస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయంపై హైకోర్టులో జనసేన పిటిషన్ వేసింది. తమకు కేటాయించిన గాజు గ్లాసును ఇతర అభ్యర్థులకు కేటాయించొద్దంటూ ఆ పార్టీ జనరల్ సెక్రటరీ ఈ పిటిషన్‌లో కోరారు. ఈ గుర్తును ఫ్రీ సింబల్ నుంచి తొలగించాలని ఈసీకి వినతి పత్రం ఇచ్చామని ఆ పార్టీ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. రెండోసారి కూడా వినతిపత్రం ఇచ్చినా ఇప్పటివరకూ నిర్ణయం తీసుకోలేదన్నారు. టీడీపీ, బీజేపీతో జనసేన పొత్తులో ఉన్న కారణంగా… ఈ గుర్తును స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించటం వల్ల కూటమికి నష్టం వస్తుందన్నారు. జనసేన దాఖలు చేసిన ఈ పిటిషన్‌లో టీడీపీ ఇంప్లేడ్ అయింది. ఒక పార్టీకి ఇచ్చిన గుర్తును వేరేవాళ్లకు ఎలా ఇస్తారని న్యాయస్థానం ప్రశ్నించింది. దీనితో జనసేన ఇచ్చిన అభ్యర్ధనపై 24 గంటల్లో ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటుందని ఈసీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఈ వ్యాజ్యంలో తెదేపా సైతం వాదనలు వినిపించేందుకు అనుబంధ పిటిషన్ వేసింది.
Janasena Symbol:
జనసేన పోటీలో లేని పలు శాసనసభ, లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల సంఘం ‘గాజు గ్లాసు’ గుర్తు కేటాయించింది. టీడీపీ, బీజేపీతో పొత్తుల్లో భాగంగా జనసేన 21 శాసనసభ, 2 లోక్‌సభ స్థానాల్లో పోటీచేస్తోంది. ఆ పార్టీ బరిలో లేని నియోజకవర్గాల్లో గాజు గ్లాసు గుర్తును ఎన్నికల సంఘం ఫ్రీ సింబల్స్ జాబితాలో పెట్టి… స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించింది. దీనితో ఎన్డీయే కూటమి అభ్యర్ధుల్లో గందరగోళం నెలకొంది. ఓటర్లలో గందరగోళం సృష్టించి, ఓట్లు చీల్చేందుకు వైసీపీయే ఈ కుట్రకు తెరలేపిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
జగ్గంపేట నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి పాఠంశెట్టి సూర్యచంద్రకు గాజుగ్లాసు గుర్తు కేటాయించారు. ఆయన మొన్నటి వరకూ జనసేన పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు. ఆ నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్‌చార్జిగా కొనసాగారు. పొత్తుల్లో భాగంగా తనకు పార్టీ నుంచి సీటు రాలేదన్న ఉద్దేశంతో బయటకు వచ్చి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పుడు ఆయనకు ఏకంగా గాజుగ్లాసు గుర్తు లభించింది. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పెద్దాపురం, కాకినాడ సిటీ, రామచంద్రాపురం, అమలాపురం, ముమ్మడివరం, కొత్తపేట, మండపేట, కొవ్వూరు స్థానాల్లో వివిధ పార్టీల, స్వతంత్ర అభ్యర్థులకు ‘గాజుగ్లాసు’ కేటాయించారు. రాజమండ్రి లోక్‌సభ బరిలో కూటమి అభ్యర్థిగా పురందేశ్వరి పోటీలో నిలిచిన సంగతి తెలిసిందే. ఇక్కడా ఒక ఇండిపెండెంట్‌కు గాజుగ్లాసు కేటాయించారు.
అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంపీగా పోటీ చేస్తున్న వడ్లమూరి కృష్ణస్వరూ్‌పకు గాజుగ్లాస్ గుర్తు కేటాయించారు. ఆ పార్లమెంట్ పరిధిలో అనకాపల్లి, యలమంచిలి, పెందుర్తి నియోజకవర్గాల నుంచి జనసేన పార్టీ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా బీజేపీ తరఫున సీఎం రమేశ్ పోటీ చేస్తున్నారు. విజయవాడ పార్లమెంటు స్థానంలో నవతరం పార్టీ అభ్యర్థి కృష్ణ కిశోర్‌కు కూడా గాజు గ్లాసు కేటాయించారు. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ పోటీ చేస్తున్న మంగళగిరిలోనూ ఒకరికి గాజు గ్లాసు ఇచ్చేశారు. విజయవాడ సెంట్రల్‌లో ఆంధ్ర రాష్ట్ర ప్రజాసమితి అభ్యర్థి గొల్లపల్లి ఫణిరాజ్, మైలవరంలో ఇండిపెండెంట్ అభ్యర్థి వల్లభనేని నాగపవన్ కుమార్‌కూ ఇదే గుర్తు ఇచ్చారు.
విజయనగరం మాజీ ఎమ్మెల్యే మీసాల గీత అదే నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నారు. ఆమెకు ఈసీ గాజుగ్లాసు గుర్తు కేటాయించింది. ఎన్టీఆర్ జిల్లా గన్నవరం నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి వల్లభనేని మోహన వంశీకి గాజుగ్లాసు గుర్తు కేటాయింపు. టెక్కలిలో స్వతంత్ర అభ్యర్థి అట్టాడ రాజేశ్‌కు గ్లాస్ గుర్తు కేటాయించారు. బాపట్ల నియోజకవర్గంలో వైసీపీ ఎంపీపీగా ఉన్న డి.సీతారామరాజు ఇండిపెండెంట్‌గా బరిలో నిలిచారు. ఆయనకు గ్లాసు గుర్తు కేటాయించారు. శ్రీకాళహస్తిలోనూ ఒక ఇండిపెండెంట్‌కు గ్లాసుగుర్తు ఇచ్చారు.
Also Read :-YS Sharmila : వైఎస్ వివేకా హత్య జరిగి 5 ఏళ్ళు గడిచిన న్యాయం జరగలేదు