High Court: జగన్ ప్రతిపక్ష హోదా పిటిషన్ పై స్పీకర్‌కు నోటీసులు

జగన్ ప్రతిపక్ష హోదా పిటిషన్ పై స్పీకర్‌కు నోటీసులు

High Court : తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని స్పీకర్‌‌ను ఆదేశించాలని కోరుతూ మాజీ సీఎం జగన్ (YS Jagan) వేసిన పిటిషన్‌‌పై బుధవారం హైకోర్ట్‌‌లో (High Court) విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో ప్రతివాదులుగా ఉన్న అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్‌‌కు… న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. గతంలో జగన్ (YS Jagan) వేసిన పిటీషన్‌‌ను కూడా ఈ పిటిషన్‌‌కు కలపాలని ఆదేశించింది.

గతంలో జగన్ రాసిన లేఖపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు (Speaker Ayyannapatrudu) రూలింగ్ ఇచ్చారు. ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదాను తామెలా ఇస్తామని ప్రశ్నించారు. రాజ్యాంగం, అసెంబ్లీ నిబంధనలు అంగీకరించవని ఆయన స్పష్టం చేశారు. స్పీకర్ రూలింగ్‌‌పై హైకోర్ట్‌‌ను (High Court) జగన్ ఆశ్రయించారు. తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని స్పీకర్‌‌ను ఆదేశించాలని పిటిషన్ వేశారు. ఈ మేరకు విచారణ చేపట్టిన హైకోర్టు విచారణను అక్టోబర్ 4కు వాయిదా వేసింది.

High Court – విగ్రహాల ఏర్పాటుపై మండలిలో రచ్చ సభ నుండి బొత్స వాకౌట్

బహిరంగ ప్రదేశాల్లో అనధికార విగ్రహాలు ఏర్పాటుపై శాసనమండలిలో ప్రశ్నోత్తరాల్లో చర్చ జరిగింది. పులివెందులలో ప్రజా నిధులతో అనధికారికంగా వైఎస్ విగ్రహాలు ఏర్పాటు చేశారని టీడీపీ సభ్యుడు భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ విగ్రహాల కూడళ్లు అభివృద్ది పేరిట కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. అనధికారికంగా విగ్రహాలు ఏర్పాటు చేయకుండా చర్యలు తీసుకోవాలని టీడీపీ సభ్యుడు బి తిరుమలనాయడు, ఆలపాటి రాజేంద్రప్రసాద్ కోరారు. అయితే టీడీపీ ఎమ్మెల్సీల వ్యాఖ్యలపై విపక్ష నేత బొత్స సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డిని కించపరిచేలా సభ్యులు మాట్లాడారని మండిపడ్డారు విపక్ష నేత. ఇందుకు నిరసనగా సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు విపక్షనేత బొత్స ప్రకటిస్తూ.. సభ నుంచి బయటకు వెళ్లిపోయారు.

ఆపై ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో బహిరంగ ప్రదేశాల్లో 2524 విగ్రహాలను అనధికారికంగా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇందులో జాతీయ రహదారులపై 38, రాష్ట్ర రోడ్లపై 1671, రాష్ట్ర హైవేలపై 815 ఉన్నట్లు తెలిపారు. నాయకుల విగ్రహాల ఏర్పాటులో నియంత్రణను అమలు చేస్తూ… 2013, ఫిబ్రవరి 18న జీవో ఎంఎస్ నెంబర్ 18 ద్వారా ప్రభుత్వం కొన్ని నిర్దేశాలతో ఉత్తర్వులు ఇచ్చిందని గుర్తుచేశారు. పబ్లిక్ రోడ్లు, కాలి బాటలు, పక్క మార్గాలు, ఇతర ప్రజా వినియోగ ప్రదేశాలలో విగ్రహాల ఏర్పాటు, కట్టడాల నిర్మాణానికి ఎటువంటి అనుమతి ఇవ్వరాదని అందులో ఉందన్నారు. హై మాస్ట్ లైట్స్, స్ట్రీట్ లైట్స్, విధ్యుదీకరణ, ట్రాఫిక్, టోల్ మౌలిక సదుపాయాలు, రోడ్ల అభివృద్ధి, సుందరీకరణ వంటి పబ్లిక్ యుటిలిటీ, సుందరీకరణకు సంబంధించిన పనులకు ఈ నిషేధం వర్తించదని తెలిపారు. మార్గదర్శకాల ప్రకారం అనధికారికంగా ఏర్పాటు చేసిన విగ్రహాలను తొలగింపును కలెక్టర్లకు ఆదేశాలిచ్చామన్నారు.

పులివెందులోని కూడళ్ల సుందరీకరణకు ప్రణాళిక శాఖ రూ. 3.50 కోట్లు నిధులు మంజూరు చేసి, పనులు చేపట్టడం జరిగిందని చెప్పారు. కడప పట్టణంలోని సర్కిళ్లను మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ, డిఎంఎస్ రూ. 7.21 కోట్లు నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. 2019లో ఇచ్చిన జీవో ప్రకారం ఇప్పటి వరకు ఉన్న విగ్రహాలకు ఎటువంటి అనుమతి ఇవ్వలేదని.. ఉన్న విగ్రహాలను తొలగించడానికి కూడా అనుమతి ఇవ్వలేదని వెల్లడించారు. అనధికారికంగా ఏర్పాటు చేసిన విగ్రహాల విషయాన్ని పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని మంత్రి బీసీ జనార్ధన్ సమాధానం ఇచ్చారు.

Also Read : CM Siddaramaiah: ట్రాఫిక్‌ రద్దీపై విప్రో అధినేత అజీమ్‌ ప్రేమ్‌జీకి సీఎం లేఖ

Leave A Reply

Your Email Id will not be published!