Auto Rally: విజయవాడలో కదం తొక్కిన ఆటో, క్యాబ్ కార్మికులు
విజయవాడలో కదం తొక్కిన ఆటో, క్యాబ్ కార్మికులు
Auto Rally : మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తూ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన “స్త్రీ శక్తి” పథకంతో తాము రోడ్డున పడ్డామంటూ… విజయవాడలో ఆటో, క్యాబ్ కార్మికులు కదం తొక్కారు (Auto Rally). “స్త్రీ శక్తి” పథకం కారణంగా పూర్తిగా నష్టపోయిన ప్రతి ఒక్క ఆటో,క్యాబ్ డ్రైవర్లకు సంవత్సరానికి 25 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని, వేలాది రూపాయలు జరిమాణాలు విధించే జీవో నెంబర్ 21 రద్దు చేయాలని, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ఐదు శాతం వడ్డీతో ఆటోలు కొనుగోలుకు ప్రభుత్వ బ్యాంకుల ద్వారా 4, లక్షల రుణాలు ఇవ్వాలని, ఇన్సూరెన్స్ రేట్లు తగ్గించాలని, సి.ఎన్.జి గ్యాస్ సబ్సిడీతో ఇవ్వాలని కోరుతూ ఈరోజు సీతన్నపేట సిగ్నల్ డివైడర్ల వద్ద వందలాది ఆటోలతో వేల సంఖ్యల ఆటో డ్రైవర్లు కిలోమీటర్ పొడవున ర్యాలీ నిర్వహించారు.
Auto Rally in Vijayawada
ఆటో,క్యాబ్ డ్రైవర్లు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా సి.పి.ఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు పాల్గొని మాట్లాడుతూ… ఓలా, ఊబర్,ర్యాపిడో వంటి బడా కంపెనీల యాప్ ల వలన ఆటో మోటార్ కార్మికులకు కిరాయిలు తగ్గిపోయి ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో మరలా ఉచిత బస్సు వల్ల తీవ్రంగా నష్టపోయారని దీనితోపాటు పెట్రోలు,డీజిల్, సి.ఎన్.జి గ్యాస్, కరెంటు చార్జీలు నిత్యావసర వస్తువుల ధరలు పెరగటంతో చాలీచాలని ఆదాయంతో ఇంటి అద్దెలు ఆటో ఫైనాన్స్ లు కట్టలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.మేము ఉచిత బస్సు కు వ్యతిరేకం కాదని తెలిపారు. ఇప్పటికైనా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆటో,క్యాబ్ డ్రైవర్లకు సంవత్సరానికి 25,000 ఆర్థిక సహాయం ప్రకటించాలని కోరారు.
విజయవాడ (Vijayawada) సిటీ ఆటో వర్కర్స్ యూనియన్ సి.ఐ.టి.యు ప్రధాన కార్యదర్శి కె.దుర్గారావు మాట్లాడుతూ…. ఉచిత బస్సు కారణంగా ఆటో,క్యాబ్ డ్రైవర్లు తీవ్రంగా నష్టపోయారని రోజుకి 100 నుండి 200 రూపాయలు కూడా కిరాయిలు రావటం లేదని ఈ వచ్చే ఆదాయంతో వారి కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో ఆటో క్యాబ్ డ్రైవర్ల కుటుంబాలతో సహా ఆందోళనకు దిగుతామని ఈ సందర్భంగా తెలిపారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే ఆటో మోటార్ కార్మికులను ఆదుకుంటామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో,క్యాబ్ మోటర్ డ్రైవర్ల పై అనేక రూపాలలో వేధించుకు తింటూ వారి కుటుంబాలను రోడ్లు పాలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఇప్పటికైనా ప్రభుత్వం కాలయాపన చేయకుండా ఈ నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాలలో ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఆర్థిక సహాయం ప్రకటించాలని లేనిపక్షంలో ఈనెల 18,వ తేదీన అన్ని మోటార్ కార్మిక సంఘాలతో ఛలో విజయవాడ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఆటో,మోటార్ కార్మికులు పాల్గొని ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ సిటీ ఆటో వర్కర్స్ యూనియన్ సి.ఐ.టి.యు నాయకులు ఎం. హనుమంతరావు, బి.రూబెన్ కుమార్,ఎస్.డి కరిముల్లా, ఎస్.కె దుర్గావళి, డి.కోటయ్య, ఎన్. నాగేశ్వరరావు, పి.చిన్న, రాఘవ,పి.తిరుపతయ్య, ఎ.వి రెడ్డి, మహిళ ఆటో డ్రైవర్ ఉప్పు ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.
Also Read : CM Chandrababu: దసరా ఉత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం
