Medaram Jatara : ఆసియా ఖండంలో అతి పెద్ద ఆదివాసీ జాతర (Medaram Jatara)నభూతో నభవిష్యత్ అన్న రీతిలో జరుగుతోంది. దేశం నలుమూలల నుంచి భక్తులు తరలి వచ్చారు. ఇంకా వస్తూనే ఉన్నారు. అర్ధరాత్రి మేడారం గద్దెపై సారలమ్మ కొలువు తీరింది.
అంతే కాకుండా పూనుగొండ నుంచి పగిడిగిద్ద రాఉ, కొండాయి నుంచి గోవిందరాజు గద్దెలపైకి చేరారు. ముగ్గురి రాకతో వన జాతర మహోత్సవం ప్రారంభమైంది. మేడారం అంతా వాయిద్యాలు, ఆట పాటలతో దద్దరిల్లింది.
అమ్మ వారి ప్రతిరూపంగా భావించే పసుపు, కుంకుమ తీసుకునేందుకు భక్తులు పోటీ పడ్డారు. జంపన్న వాగు జన సంద్రమైంది. భక్తులు స్నానాలు చేసేందుకు పోటీ పడ్డారు.
సంతాన భాగ్యం కోసం ఎదురు చూసిన భక్తులు వన దేవత రాగానే మోకరిల్లారు. పొర్లు దండాలు పెట్టారు. ఎక్కడ చూసినా భక్తులే. జనం జాతరై తరలి వచ్చిన సన్నివేశం.
ఎంత చెప్పినా తక్కువే. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్ గఢ్, మధ్య ప్రదేశ్, ఒడిస్సా తో పాటు దేశం నలుమూలల నుంచి తరలివచ్చారు. ఆదివాసీ పూజారులకు భక్తులు నమస్కరించారు.
ప్రత్యేక డోలు, వాయిద్యాలు, శివ సత్తుల పూనకాలు, హిజ్రాల శివాలతో కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయం పరవశించి పోయింది. ఎమ్మెల్యే సీతక్క ఆదివాసీ బిడ్డలతో కలిసి ఆడారు.
లక్షలాదిగా తరలి వస్తున్న భక్తులతో మేడారం (Medaram Jatara)చుట్టూ వాహనాలు నిలిచి పోయాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నార్లాపూర్ , కొత్తూరు, జంపన్న వాగు, రెడ్డి గూడెం, కన్నె పల్లి పరిసర ప్రాంతాలన్నీ జన జాతరను తలపింప చేస్తున్నాయి.
Also Read : ఆదివాసీ ఉత్సవం మేడారం జనసంద్రం