Red Fort: ఎర్రకోటలో కోట్లు విలువైన బంగారు కలశాలు చోరీ
ఎర్రకోటలో కోట్లు విలువైన బంగారు కలశాలు చోరీ
Red Fort : దిల్లీలోని ఎర్రకోటలో మరో సారి భద్రతా వైఫల్యం బయటపడింది. ఓ దొంగ కోట్లు విలువ చేసే బంగారు వస్తువులను ఎత్తుకెళ్లిపోయాడు. ఎర్రకోటలో జైన మతానికి చెందిన కార్యక్రమం ఒకటి జరుగుతోంది. మొత్తం పదిరోజుల కార్యక్రమం అది. రెండు బంగారు కలశాలతో పాటు వజ్రాలు పొదిగిన మరికొన్ని బంగారు వస్తువులను పూజల్లో ఉంచారు. అయితే ఈ కార్యక్రమం అనంతరం పూజ కోసం తాను తీసుకువచ్చిన 760 గ్రాములు బంగారు కలశం, వజ్రాలు, మాణిక్యాలు, పచ్చలతో పొదిగిన 115 గ్రాముల మరో చిన్న బంగారు కలశం కనిపించలేదని వ్యాపారవేత్త సుధీర్ కుమార్ జైన్ ఎర్రకోట (Red Fort) నిర్వాహకులకు ఫిర్యాదు చేశారు. పూజా కార్యక్రమానికి ప్రముఖులు హాజరవ్వడంతో తాము పక్కకు వెళ్లామని.. అంతలోనే ఈ దొంగతనం జరిగిందని పేర్కొన్నారు.
Red Fort Robbery
నిర్వాహకులందరూ కార్యక్రమానికి వచ్చే అతిధుల కోసం ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇదే అదునుగా భావించిన దొంగ తన పని మొదలుపెట్టాడు. పవిత్రమైన బంగారు వస్తువులు పెట్టిన స్టేజి దగ్గరకు వెళ్లాడు. బంగారు వస్తువుల్ని సంచిలో వేసుకుని మెల్లగా అక్కడినుంచి జారుకున్నాడు. నిర్వాహకులు కొద్దిసేపటి తర్వాత పూజా కార్యక్రమాలు మొదలుపెట్టడానికి స్టేజి దగ్గరకు వచ్చారు. అక్కడ బంగారు వస్తువులు కనిపించలేదు. దీంతో వారు షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు ఘటనా స్థలంలోని సీసీ కెమెరాలను పరిశీలించగా.. ఎవరూ లేని సమయంలో ఓ వ్యక్తి పూజాసామగ్రి ఉన్న గదిలోకి వెళ్లి… రెండు కలశాలను సంచిలో వేసుకుంటున్న దృశ్యాలు కనిపించాయి. అనంతరం అతడు అక్కడి నుంచి బయటకు జారుకున్న దృశ్యాలు రికార్డయ్యాయి. దీంతో కేసు నమోదు చేసి.. గాలింపు చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిపై ఇప్పటికే పలు ఆలయాల్లో దొంగతనానికి యత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు. కలశాలను దొంగలిస్తున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Also Read : Ropeway: గుజరాత్ లో రోప్‌వే తెగిపడి ఆరుగురు మృతి
