Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోరైల్ కు అరుదైన గౌరవం
హైదరాబాద్ మెట్రోరైల్ కు అరుదైన గౌరవం
హైదరాబాద్ మెట్రోరైల్ కు మరో అరుదైన గౌరవం లభించింది. ప్రతిష్టాత్మకమైన హార్వర్డ్ విశ్వవిద్యాలయం హైదరాబాద్ మెట్రోపై పరిశోధన పత్రాన్ని సమర్పించింది. ప్రపంచంలోనే ఎంతో పేరొందిన అతిపెద్ద పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) ప్రాజెక్టు అంటూ అందులో ప్రముఖంగా ప్రస్తావించింది. హైదరాబాద్ మెట్రో రైల్ కు ఐఎస్‌బీ, స్టాన్‌ఫర్డ్ వంటి అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల నుంచి ఇప్పటికే సముచితమైన గుర్తింపు లభించింది. హైదరాబాద్ మెట్రో విజయగాథను పరిశోధనా పత్రాలుగా ప్రచురించాయి.
తాజాగా హెచ్‌ఎంఆర్‌ఎల్ ఎండీ ఎన్విఎస్ రెడ్డి సారథ్యంలో మెట్రో రైల్ వ్యవస్థ ఒక ప్రముఖ రవాణా వ్యవస్థగానే కాకుండా మౌలిక వసతుల కల్పనలో నూతన ఒరవడిని ప్రదర్శించిందని, పీపీపీ విధానంలో ప్రపంచంలోనే విశేషమైన ప్రాజెక్టుగా అవతరించిందని హార్వర్డ్ వర్సిటీ తన పరిశోధనా పత్రంలో స్పష్టం చేసింది. ప్రాజెక్టు నిర్మాణంలో ఎదురైన అనేక సవాళ్లను వ్యూహాత్మకంగా అధిగమిస్తూ, నిర్మాణంలోనూ, నిర్వహణలోనూ ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ పరుగులు తీస్తోందని పేర్కొంది. మెట్రో మ్యాన్‌గా పేరొందిన ఎన్విఎస్ నైపుణ్య శైలిని, నాయకత్వ లక్షణాలను ప్రధానంగా ప్రస్తావించింది.
హైదరాబాద్‌లో ఉన్న ప్రతిష్టాత్మకమైన ఇండియన్ స్కూల్ అఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) ప్రొఫెసర్లు, పరిశోధకులు… హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు స్థాపనకు బీజం పడినప్పటి నుంచి ప్రాజెక్టు నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించడం, ప్రభుత్వ ప్రతిపాదనలను, ఆలోచనలను నిర్మాణాత్మకంగా అమలు చేసిన తీరుపై ‘హైదరాబాద్ మెట్రో – ఆలోచన నుంచి అమలు వరకు’అనే ప్రధాన శీర్షికన తమ ప్రతిష్టాత్మక హార్వర్డ్ బిజినెస్ జర్నల్‌లో ప్రచురించింది ‘పీపీపీ పద్ధతిలో ప్రపంచంలోనే అతిపెద్ద మెట్రో రైల్ ప్రాజెక్ట్’అనే ఇతివృత్తంతో చేసిన పరిశోధనను హార్వర్డ్ విశ్వవిద్యాలయం ఒక కేస్ స్టడీగా తీసుకుంది.
హైదరాబాద్ మెట్రోరైల్ లో ఎన్వీఎస్ కృషి అపూర్వం
నగర రవాణా సమస్యలను పరిష్కరించేందుకు 2006లో ఎన్వీఎస్ రెడ్డి మెట్రో ప్రాజెక్టుకు ఆలోచన చేశారని పరిశోధన పత్రం తెలిపింది. మేటాస్ పతనం, భూసేకరణ సమస్యలు, అనేక రకాల ఆందోళనలు, రాజకీయ ఒడిదుడుకులు వంటి అడ్డంకులను అధిగమించి, అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులతో కూడిన మెగా ప్రాజెక్టుగా అవతరించిందని పేర్కొంది. హైదరాబాద్ నగరానికి మెట్రో రైల్ ఆవశ్యకతను, ఆ ఆవశ్యకతకు కార్యరూపం ఇచ్చి ఏ విధంగా అమలు చేశారో వివరించింది. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రజా రవాణా వ్యవస్థలో ఒక విప్లవాత్మక మార్పు వచి్చనట్లు పేర్కొంది. ఈ ప్రాజెక్టును విజయవంతంగా అమలు చేయడానికి ఎన్విఎస్ రెడ్డి అనుసరించిన విధానం, చేసిన కృషి అపూర్వమైనదని అభివరి్ణంచింది. విలక్షణమైన ప్రణాళికా తీరు, సాంకేతిక పరిజ్ఞానం, ఆర్థిక విషయాలపై లోతైన అవగాహన, సమస్యలను అధిగమించే నాయకత్వ సామర్థ్యం ఈ ప్రాజెక్టును చరిత్రలో నిలిచిపోయేలా చేశాయని స్పష్టం చేసింది.