Hydra Ranganath: ప్రణయ్‌ హత్య కేసు తీర్పుపై హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ షాకింగ్‌ కామెంట్స్‌

ప్రణయ్‌ హత్య కేసు తీర్పుపై హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Hydra Ranganath : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్‌ పరువు హత్య కేసులో నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ప్రణయ్‌ ను దారుణంగా చంపిన సుభాష్‌ శర్మకు మరణశిక్ష శిక్ష విధించింది. అలాగే మిగతా ఆరుగురు నిందితులందరికీ జీవిత ఖైదును ఖరారు చేసింది. అయితే ప్రణయ్‌ హత్య కేసులో విచారణ అధికారిగా ఉన్న అప్పటి నల్గొండ ఎస్పీ, ప్రస్తుత హైడ్రా కమిషనర్ రంగనాథ్(Hydra Ranganath) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రణయ్‌- అమృతల ప్రేమ అంశం టీనేజీ యువతకు గుణ పాఠంలాంటిందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. టీనేజీ వయస్సులో పిల్లలు జాగ్రత్తగా ఉండాలని, లేదంటే తీవ్ర పరిణామాల్ని ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. అదే సమయంలో ఈ కేసు దర్యాప్తులో ఎదురైన సవాళ్లు, మారుతీరావు ప్రవర్తన, కేసును ఛేదించిన విధానం గురించి ఆయన వివరించారు.

Hydra Ranganath Shocking Comments

ఈ సందర్భంగా హైడ్రా కమీషనర్ రంగనాథ్(Hydra Ranganath) మాట్లాడుతూ… ప్రణయ్‌ హత్య(Pranay Murder) సమయంలో నేను నల్లగొండ జిల్లా ఎస్పీగా ఉన్నాను. ఆ సమయంలో ప్రణయ్‌ హత్యకేసులో మొదటి నుంచి సాక్షులు బలంగా ఉన్నారు. సుదీర్ఘ విచారణ తర్వాత న్యాయం గెలిచింది. ఈ కేసులో అన్ని కోణాలు ఉన్నాయని, కాంట్రాక్ట్ కిల్లర్లతో హత్య చేయించడంతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నేరస్థులు చాలా తెలివిగా వ్యవహరించారు. కేసు మొదట్లో చాలా గందరగోళంగా ఉంది. మారుతీరావు కూడా తనకు ఏమీ తెలియదనే అన్నారు. డీఎస్పీగా శ్రీనివాస్‌, ఎస్సై వెంకటేశ్వర్‌రెడ్డి, ధనుంజయ్‌, టాస్క్‌ ఫోర్స్‌, కానిస్టేబుల్స్‌, ఎస్సైలు, రైటర్స్‌తో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ నరసింహ, సీనియర్‌ అధికారురు ఐజీ స్టీఫెన్‌ రవీంద్ర,అప్పటి డీజీ మహేందర్‌రెడ్డిల సూచనలు,సలహాలతో ఈ కేసును చాకచక్యంగా ఛేదించాం. ప్రణయ్‌ హత్య తర్వాత నిందితులు దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో తలదాచుకున్నారు. అయినప్పటికీ టెక్నాలజీ, విచారణ సాయంతో నిందితుల్ని కేవలం వారం రోజుల వ్యవధిలో అదుపులోకి తీసుకున్నాం.

ప్రణయ్‌ -అమృత కేసు నేటి తరం బాల్యం నుంచి యవవ్వనంలోకి అడుగు పెట్టే పిల్లలకు, వారి తల్లిదండ్రులకు ఒక గుణపాఠం లాంటింది. టీనేజీ నుంచి యవ్వనంలోకి అడుగుపెట్టే సమయంలో పిల్లలు, వారి తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. టీనేజీలోకి అడుగు పెట్టాం కదా అని ఇష్టం వచ్చినట్లు నిర్ణయాలు తీసుకోవద్దని, జీవితంలో కొంత పరిణితి సాధించిన తర్వాత నిర్ణయాలు తీసుకోవాలి. ముందు పిల్లలు లైఫ్‌ లో స్థిరపడిన తర్వాత నిర్ణయాలు తీసుకోవడం మంచిది. లేదంటే ప్రణయ్‌ హత్య కేసుతో ఏం జరిగిందో మనం అందరం చూశాం. బాలస్వామి తన కుమారుణ్ని(ప్రణయ్‌), అమృత తన తండ్రిని కోల్పోయింది. వాళ్లు తీసుకున్న నిర్ణయం వల్ల ఎవరూ సంతృప్తిగా లేరు. ఈ కేసు ద్వారా సమాజం నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి.

కుమార్తెపై అమితమైన ప్రేమే తండ్రిని హంతకుడ్ని చేసింది

ప్రణయ్‌ హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఏ1 గా ఉన్న మారుతిరావు చనిపోవడం బాధాకరం. మారుతి రావుకి కుమార్తె అమృత అంటే అమితమైన ప్రేమ. లేక లేక పుట్టిన సంతానం. అమృత ఫొటోల్ని 15 నుంచి 20 అడుగల మేర ఫ్లెక్సీ కట్టించుకునేంత ప్రేముంది. ఆ ప్రేమే ఇన్ని అనార్ధాలకు దారి తీసింది. మారుతిరావు రియల్‌ ఎస్టేట్‌ బిజినెస్‌ చేస్తున్నారు. ఎవరైతే ప్రణయ్‌ హత్యకేసులో ఉన్న ఏ4 బారీ సాయంతో రియల్‌ ఎస్టేట్‌ లో సమస్యల నుంచి బయటపడేవారు. అలాగే అమృత విషయంలో అలాగే ఆలోచించారు. డబ్బు, పరపతి ఉండొచ్చేమో… కానీ పిల్లల టీనేజీ పెంపకం ఎలా ఉండాలనే అంశంలో అవగాహన లేకుండా పోయింది. మన పెంపకంలో ఏదైనా తప్పుంటే దానికి వేరే వాళ్లని బాధ్యుల్ని చేయడం ఎంతవరకు కరెక్ట్‌ అనే అంశంపై మారుతి రావుతో మాట్లాడాను’ అని అన్నారు.

పైకోర్టుకు వెళ్లినా లాభం ఉండదు

ఇదే కేసులో పైకోర్టులకు వెళ్లినా న్యాయం పరంగా ఎలాంటి మార్పులు ఉండదు. అంత పకడ్బందీగా ఈ కేసులో 1600 పేజీల ఛార్జ్‌ షీట్‌ వేశామని, కేసు విచారణ సమయంలో పోలీసులు మేనేజ్ చేశారంటూ కొందరు నిరాధార ఆరోపణలు చేశారని, వాటిని పట్టించుకోకుండా నిజం నిలకడ మీద తెలుస్తుందనే నమ్మకంతో ముందుకు సాగామని రంగనాథ్‌ స్పష్టం చేసారు.

Also Read : Pranay Murder Case: ప్రణయ్‌ హత్య కేసులో నల్గొండ కోర్టు సంచలన తీర్పు

Leave A Reply

Your Email Id will not be published!