Hydraa : హైదరాబాద్ నగరంలోని గాజుల రామారంలో హైడ్రా (Hydraa) కూల్చివేతలు చేపట్టింది. గాజుల రామారంలో సుమారు 100 ఎకరాలకుపైగా ప్రభుత్వ స్థలాన్ని కబ్జాదారులు ఆక్రమించారు. ప్రభుత్వ స్థలంలో 60 నుంచి 70 గజాల్లో ఇళ్లను నిర్మించి రూ.10 లక్షల చొప్పున విక్రయిస్తున్నారు. దీనిపై ఫిర్యాదు అందడంతో హైడ్రా (Hydraa) రంగంలోకి దిగింది. ఆక్రమణదారుల చేతుల్లో రూ.4,500 కోట్ల విలువైన ప్రభుత్వ భూములు ఉన్నట్లు గుర్తించింది. సర్వే నంబర్ 397లో నిర్మించిన అక్రమ ఇళ్లను కూల్చివేసింది. మరోవైపు కూల్చివేతలపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. తామంతా డబ్బులకు ఇళ్లను కొనుక్కున్నామని… వాటిని అమ్మిన వాళ్లపై చర్యలు తీసుకోవాలంటూ చిన్న పిల్లలతో కలిసి జేసీబీ వాహనాలకు అడ్డుగా నిల్చొని నిరసన తెలిపారు. ఇక్కడ మొత్తం 300 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా.. 100 ఎకరాలు కబ్జాకు గురైంది. అక్రమ కట్టడాల కూల్చివేత అనంతరం రూ.15 వేల కోట్ల విలువైన 300 ఎకరాల భూమికి హైడ్రా కంచె వేయనుంది.
హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌కు 10 కి.మీ. దూరంలో ఉన్న గాజులరామారంలోని వందల ఎకరాల ప్రభుత్వ భూముల్లో పక్కా నిర్మాణాలు వెలిశాయి. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, టీజీఐఐసీ, హెచ్‌ఎండీఏ, హౌసింగ్‌బోర్డు విభాగాలకు దశాబ్దాల క్రితం అప్పటి ప్రభుత్వాలు భూములిచ్చాయి. ఆయా విభాగాలు తమ కార్యకలాపాలు ప్రారంభించకపోవడంతో కొందరు అక్రమార్కులు గత మూడు, నాలుగేళ్లుగా పథకం ప్రకారం భూములను కబ్జా చేస్తున్నారు.
గాజులరామారంలోని ప్రభుత్వ స్థలాలను అక్కడున్న కొందరు చోటామోటా నేతలు క్రమంగా సొంతం చేసుకుంటున్నారు. మూడున్నరేళ్లలో ఏకంగా 103 ఎకరాల భూములు ఆక్రమించేశారు. ఈ ప్రాంతాల్లో ఎకరా మార్కెట్ విలువ రూ.40-50 కోట్ల వరకు ఉంటుంది. ఆ లెక్కన రూ.4500 కోట్ల విలువైన భూములు అన్యాక్రాంతమయ్యాయి. కుత్బుల్లాపూర్, గాజులరామారం, చింతల్ పరిసర ప్రాంతాల్లో పనులు చేసుకుంటున్న వారికి సింగిల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మించి అమ్మేస్తున్నారు. ప్రభుత్వ స్థలాలు పర్యవేక్షించాల్సిన రెవెన్యూ, విద్యుత్ అధికారుల్లో కొందరు వీరికి సహకరిస్తుండడంతో కరెంటు మీటర్లొస్తున్నాయి. నల్లా కనెక్షన్లూ ఇస్తున్నారు. దీంతో కొందరు అప్పులు చేసి మరీ సొంత ఇళ్లు కొంటున్నారు. వీటిని అమ్మి సొమ్ము చేసుకుంటున్న కబ్జాదారులు బహుళ అంతస్తుల భవనాలను కట్టుకుని, ఖరీదైన కార్లలో తిరుగుతున్నారు.
Hydraa – గాజుల రామారం కబ్జా వెనుక నేతలు, ఉన్నతాధికారులు – హైడ్రా కమిషనర్
గాజుల రామారంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలు తొలగిస్తున్నామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేసినవారిలో రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు ఉన్నారని చెప్పారు. 40 ఎకరాల్లో పేదలు నివాసాలు ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు. అధికారులతో స్థానిక నేతలు కుమ్మక్కై పేదలకు స్థలాలు విక్రయించారని పేర్కొన్నారు. 6 నెలల్లో ఐదుసార్లు స్థానికులతో హైడ్రా, రెవెన్యూ అధికారులు మాట్లాడారన్నారు. కబ్జాలను తొలగించి ప్రభుత్వ భూములను వెనక్కి తీసుకుంటున్నట్లు వివరించారు.
‘‘పేదలు నివసిస్తున్న ప్రాంతాలను హైడ్రా (Hydraa) తొలగించట్లేదు. వాణిజ్య షెడ్లు, కాంపౌండ్ గోడలు, గదులు నిర్మించిన వాటిని తొలగిస్తాం. కబ్జాదారుల నుంచి ప్రభుత్వ భూమిని వెనక్కి తీసుకుని కంచె ఏర్పాటు చేస్తాం. రూ.13 వేల కోట్ల విలువైన 275 ఎకరాలకు పైగా భూమిని స్వాధీనం చేసుకుంటాం’’ అని రంగనాథ్ తెలిపారు.
Also Read : Minister Piyush Goyal: మన టాలెంట్ చూసి భయపడుతున్నట్లున్నారు – కేంద్ర మంత్రి
