Hydraa : కొండాపూర్‌ లో హైడ్రా కూల్చివేతలు

కొండాపూర్‌ లో హైడ్రా కూల్చివేతలు

Hydraa : భాగ్యనగరంలో హైడ్రా అధికారుల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. వరుసగా అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా కొండాపూర్‌ లోగల బిక్షపతి నగర్‌లో శనివారం ఉదయం నుంచే హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ప్రభుత్వ స్థలంలోని అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నట్లు హైడ్రా (Hydraa) సిబ్బంది పేర్కొన్నారు. భారీ పోలీస్ బందోబస్తు నడుమ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. కాగా కూల్చివేతల వద్దకు మీడియాను కూడా పోలీసులు అనుమతించడం లేదు. రెండు కిలోమీటర్ల దూరంలోనే మీడియాను, స్థానికులను పోలీసులు అడ్డుకుంటున్నారని సమాచారం.

Hydraa Demolition

ఇటీవల హైడ్రా (Hydraa) కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ హైడ్రా విజన్‌ అండ్‌ ఎజెండా అనే అంశంపై ‘ఎక్స్‌’ వేదికగా ఫ్యాక్ట్‌ చెక్‌ తెలంగాణ ఏర్పాటు చేసిన ‘ప్రశ్నలు–జవాబులు’ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశ–విదేశాల నుంచి అనేక మంది అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. హైడ్రాకు 169 పోస్టులు శాంక్షన్‌ చేయగా ప్రస్తుతం 45 మంది సిబ్బందే ఉన్నారు. వీరికి అదనంగా రెండు వేల మంది ఔట్‌ సోర్సింగ్‌ వాళ్లు ఉన్నారు. ఇప్పటి వరకు వచ్చిన ఫిర్యాదులు 20 వేల దాటాయి. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం సిబ్బందిని పెంచడంపై దృష్టి పెట్టింది. రానున్న రోజుల్లో హైడ్రా ప్రభావం ప్రజల్లోకి బలంగా వెళుతుంది. ఇప్పటికే ప్రజలు మాపై నమ్మకం పెంచుకుంటున్నారన్నారు.

బాధితుల కోసం త్వరలోనే ప్రభుత్వం ట్రాన్స్‌ఫరబుల్‌ డెవలప్‌మెంట్‌ రైట్స్‌ (టీడీఆర్‌) విధానాన్ని అమలులోకి తీసుకురానుంది. నిజాంపేటలో దాదాపు కిలోమీటరు పరిధిలో రోడ్డు పక్కన ఇళ్లు వేసుకున్న కొందరు ఇంటి ముందు దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు. దీని వల్ల 30 అడుగుల రోడ్డు 10 నుంచి 15 అడుగులకు తగ్గిపోయింది. ఫలితంగా దాదాపు పది కాలనీలకు చెందిన వాళ్లు రాకపోకల కోసం తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. చాలా కాలంగా ఆ కాలనీ వాసులు ఫిర్యాదు చేశారు. కోర్టు ఉత్తర్వులు కూడా ఉన్నాయి. ఇవన్నీ పరిగణలోకి తీసుకుని వాటిని తొలగించామని ఏవీ రంగనాథ్‌ తెలిపారు.

హైడ్రా (Hydraa) ఏర్పాటైన తర్వాత ఏడాదిలో ప్రజలు మోసపోకుండా అవగాహన కల్పించగలిగాం. ఎఫ్‌టీఎల్, బఫర్‌ జోన్లు, చెరువుల్లో భూములు ఉన్నట్లు అనుమానిస్తే వాళ్లు సరిచూసుకుంటున్నారు. కొనేవాళ్లు లేకపోతే అమ్మే వాళ్లు, ఆక్రమించే వాళ్లు తగ్గిపోతారు. కొన్నిసార్లు కిందిస్థాయి వాళ్లు చేసిన చిన్నచిన్న పొరపాట్లను భూతద్దంలో చూపిస్తూ వ్యవస్థ పైన బురదజల్లే ప్రయత్నాలు జరిగాయి. మూసీలో జరిగే కూలి్చవేతల్నీ హైడ్రాకు ఆపాదించారు. నగరంలో నీళ్లు నిలిచే ప్రాంతాల్లో చెరువుల చుట్టూ ఉన్నవి ఎక్కువగా ఉంటున్నాయి. ఇన్‌లెట్‌ నాలాలు పూడ్చివేయడమే దీనికి కారణం. ఫలితంగా తీవ్రమైన ట్రాఫిక్‌ జామ్స్‌ ఏర్పడుతున్నాయి. సాంకేతికంగా నగరంలో ఉన్న అన్ని చెరువుల పరిస్థితుల్ని అధ్యయనం చేస్తున్నాం. ప్రతి దానికీ పరిష్కార మార్గాలు అన్వేషిస్తున్నామని ఏవీ రంగనాథ్‌ వివరించారు.

కాగా, హైదరాబాద్‌లో గత కొన్నేళ్లుగా అక్రమ నిర్మాణాలు భారీ స్థాయిలో వెలిశాయి. కొంతమంది అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. యథేచ్ఛగా అక్రమార్కులు నిబంధనలని ఉల్లంఘిస్తున్నారు. అక్రమ నిర్మాణాలతో పలు ప్రాంతాలు వర్షాకాలంలో వరదలకు గురవుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ సమస్యపై హైడ్రా అధికారులకు ఫిర్యాదులు వస్తోండటంతో చర్యలు చేపట్టారు.

Also Read : MIM Party: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలకు ఎంఐఎం దూరం ?

Leave A Reply

Your Email Id will not be published!