IAF C-295: భారత్ కు చేరిన చివరి సీ-295 ! అప్పగింతలు పూర్తి చేసిన స్పెయిన్ !
భారత్ కు చేరిన చివరి సీ-295 ! అప్పగింతలు పూర్తి చేసిన స్పెయిన్ !
IAF C-295 : స్పెయిన్‌కు చెందిన ఎయిర్ బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ సంస్థ రూపొందించిన సీ-295 (IAF C-295) వ్యూహాత్మక సైనిక రవాణా విమానం ఎట్టకేలకు భారత్‌కు చేరింది. భారత్, స్పెయిన్ దేశాల ఒప్పందంలో భాగంగా ఎయిర్ బస్ 2025 నాటికి 16 విమానాలను భారత్ కు డెలివరీ చేయాల్సి ఉండగా… చివరిదైన 16వ విమానం భారత్ అందుకుంది. భారత రక్షణ సామార్థ్యాన్ని పటిష్టం చేసే కీలక మైలురాయిగా దీనిని స్పెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. ఒప్పందంలో భాగంగా తక్కిన 40 విమానాల అమరిక, తయారీ భారత్‌లోని టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ (TASL)లో జరుగుతుంది.
IAF C-295 Updates
స్పెయిన్‌లోని భారత రాయబారి దినేష్ కె.పట్నాయక్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సీనియర్ అధికారులు 16వ ఎయిర్ బస్ సి-295ను (IAF C-295) సెవిల్లెలోని ఎయిర్‌బస్ డిఫెన్స్ అండ్ స్పేష్ అసెంబ్లీ లైన్‌లో అందుకున్నారు. స్పెయిన్‌లో భారత రాయబార కార్యాలయం ఈ విషయాన్ని సోషల్ మీడియా ‘ఎక్స్’లో తెలియజేసింది. షెడ్యూల్ కంటే రెండు నెలలు ముందుగానే ఈ డెలివరీ జరిగిందని, భారత రక్షణ సామర్థ్యాల పటిష్టతలో ఇదొక మైలురాయి అని తెలిపింది.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం ఎయిర్ బస్ డిఫెన్స్ అండ్ స్పేస్, స్పెయిన్‌తో భారత్ 56 సీ-295 ఎండబ్ల్యూ ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్టుల కొనుగోలుకు 2021 సెప్టెంబర్‌లో సంతకాలు చేసింది. 56 విమానాల్లో 16 విమానాలను స్పెయిన్ నుంచి ఎయిర్ బస్ నేరుగా భారత్‌కు డెలివరీ చేస్తుంది. తక్కిన 40 విమానాలు ఇండియాలో తయారవుతాయి. ఆ క్రమంలోనే చివరిదైన 16వ విమానం శనివారంనాడు భారత్ అందుకుంది.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, స్పానిస్ ప్రధాని పెడ్రో సాంఛెంజ్‌లు గత ఏడాది అక్టోబర్‌లో గుజరాత్‌లోని వడోదరలో ‘295 విమానాల’ తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. భారత వైమానిక దళంలో ఆరు దశాబ్దాల కిందటి ఆవ్రో-748 విమానాల స్థానంలో సీ-295 విమానాలను ప్రవేశపెట్టనున్నారు. 5 నుంచి 10 టన్నుల బరువును మోసుకెళ్ల సామర్థ్యం కలిగిన ఈ విమానాలు.. 71 మంది సైనికులను కానీ 50 మంది పారాట్రూపర్లను కానీ వ్యూహాత్మక ప్రాంతాలకు తరలించగలదు. విపత్తు ప్రతిస్పందన, సముద్ర గస్తీ విధులను కూడా నిర్వహించగలదు.
Also Read : Minister Vangalapudi Anitha: వరి నాట్లు వేసిన హోం మంత్రి వంగలపూడి అనిత
