IAF Chief: ‘ఆపరేషన్ సిందూర్’లో ఆరు పాక్ విమానాలు కూల్చాం – IAF చీఫ్
‘ఆపరేషన్ సిందూర్’లో ఆరు పాక్ విమానాలు కూల్చాం - IAF చీఫ్
IAF Chief : పహాల్గాం ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’లో భారతీయ వాయుసేన… పాకిస్థాన్ కు చెందిన ఐదు యుద్ధ విమానాలను, మరో పెద్ద విమానాన్ని నేలకూల్చిందని ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ (IAF Chief) ప్రకటించారు. ఇది గగనతల యుద్ధంలో భారత్ ఇప్పటివరకూ సాధించిన అతిపెద్ద విజయమని ఆయన పేర్కొన్నారు. మూడు నెలల క్రితం జరిగిన ఆపరేషన్ సిందూర్‌లో పాక్ విమానాలు కూలగొట్టిన విషయాన్ని బహిర్గతం చేయడం ఇదే మొదటిసారి. 16వ ఎయిర్ చీఫ్ మార్షల్ ఎల్.ఎం.కత్రే స్మారకోపన్యాస కార్యక్రమంలో ప్రసంగిస్తూ అమర్ ప్రీత్ సింగ్- పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్‌లో సాధించిన విజయాలు వివరించారు. పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలను ఏవిధంగా ధ్వంసం చేసిందీ వివరించారు.
IAF Chief Key Comments
ఈ సందర్భంగా ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ… జాతీయ భద్రతలో వైమానిక శక్తి ప్రాముఖ్యత మరింత పెరిగిందని పేర్కొన్నారు. భారత వాయుసేన, హెచ్‌ఏఎల్, డీఆర్‌డీఓలకు గత ఎయిర్ చీఫ్ మార్షల్ కత్రె చూపించిన మార్గదర్శనం నేడు చక్కని ఫలితాలను అందిస్తోందని తెలిపారు. దేశీయంగా రక్షణ పరికరాల తయారీ, పరిశోధన, అభివృద్ధిలో ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం సాధికారతకు బాటలు వేస్తోందని అన్నారు. విశ్రాంత అధికారులు ఏకే పాత్ర, హెచ్‌బీ రాజారామ్, హెచ్‌ఏఎల్, డీఆర్‌డీఓ అధికారులు ఈ సదస్సులో పాల్గొన్నారు.
IAF చీఫ్ వ్యాఖ్యలపై స్పందించిన పాక్
ఆపరేషన్ సిందూర్ సమయంలో యుద్ధ విమానాల కూల్చివేతపై భారత వైమానిక దళం చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ వ్యాఖ్యలపై పాకిస్థాన్ స్పందించింది. భారత్ దాడిలో ఒక్క సైనిక విమానం కూడా ధ్వంసం కాలేదంటూ పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చెప్పుకొచ్చారు. భారత వైమానిక దళ చీఫ్ వాదనల్లో వాస్తవం లేదంటూ పాక్ మంత్రి కొట్టిపారేశారు. మూడు నెలలుగా విమానాల కూల్చివేత విషయాన్ని వెల్లడించలేదని ఎత్తిచూపుతూ.. సమయం మీరిన తర్వాత భారత ఎయిర్ చీఫ్ మార్షల్ చేసిన ప్రకటన నమ్మశక్యంగా లేదని ఆయన అన్నారు.
Also Read : Minister Nirmala Sitharaman: ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ‘భారత లక్ష్మి’ అవార్డు
