IMF: పాకిస్తాన్ కు ఐఎంఎఫ్‌ రుణం ! షాక్‌కు గురిచేసిందన్న కాంగ్రెస్‌ !

పాకిస్తాన్ కు ఐఎంఎఫ్‌ రుణం ! షాక్‌కు గురిచేసిందన్న కాంగ్రెస్‌ !

IMF : పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ తో పాకిస్తాన్ విలవిలలాడుతోంది. ఒక వైపు భారత్ క్షిపణి దాడులు… మరోవైపు పాకిస్తాన్ ఆర్మీపై బలూచిస్తాన్ ఏర్పాటు వాదుల తిరుగుబాటుతో… మంచినీరు, నిత్యావసర వస్తువులకు కూడా పాకిస్తాన్ పౌరులు కటకటలాడుతున్నారు. అసలే అంతంత మాత్రంగా ఉన్న పాకిస్తాన్ ఆర్ధిక వ్యవస్థ ‘ఆపరేషన్ సిందూర్(Operation Sindoor)’ తో కుప్పకూలింది. దేశం దివాలా తీసే పరిస్థితికి వచ్చింది. ప్రపంచ దేశాలు కూడా భారత్ ను కాదని పాకిస్తాన్ కు ఆర్ధిక సహాయం చేసే పరిస్థితుల్లో లేకపోవడంతో… అంతా పాకిస్తాన్ పని అయిపోయినట్లే అని భావించారు. మరొవైపు భారత్ తనకు ఉన్న దౌత్య సంబంధాలతో ప్రపంచ ఆర్ధిక సంస్థల నుండి కూడా రుణ సదుపాయం అందకుండా చేయడానికి సంబంధిత సంస్థలను సంప్రదిస్తోంది.

IMF Gave Loan to Pakistan

అయితే పాకిస్తాన్‌ కు రుణం ఇవ్వకూడదని భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ… అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) నుంచి 1 బిలియన్‌ డాలర్ల నిధులు (దాదాపు రూ.8,540 కోట్లు) మంజూరు చేసింది. ఎక్స్‌టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ (EFF) కింద ఈ మొత్తాన్ని ఇవ్వడానికి ఐఎంఎఫ్‌(IMF) ఆమోదం తెలిపింది. దీనితో తక్షణంగా కొంత మొత్తాన్ని వాడుకోవడానికి పాకిస్తాన్ కు అనుమతి ఇచ్చింది. దీనితో ఐఎంఎఫ్ తీసుకున్న నిర్ణయం… భారత్ ను షాక్ గురిచేసింది.

ఐఎంఎఫ్ తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగొయ్ స్పందించారు. పాక్‌ కు ఐఎంఎఫ్‌ రుణం ఇవ్వడం షాక్‌ కు గురి చేసిందన్నారు. ‘పహల్గాం దాడి తర్వాత USD 1 బిలియన్ డాలర్ల రుణం ఆమోదించడం షాకింగ్‌ గా అనిపించడంతో పాటు నిరాశకు గురిచేసింది. ఈ రుణం పాకిస్థాన్‌ లో శాశ్వత సైనిక పాలనకు దారితీసేందుకే దోహదం చేస్తుంది’ అని గౌరవ్‌ గొగొయ్‌ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్‌ కూడా ఈ విషయంపై స్పందించారు. పాకిస్థాన్‌ కు ఐఎంఎఫ్‌ రుణానికి వ్యతిరేకంగా భారత్ ఓటు వేయాలని ఏప్రిల్ 29న కాంగ్రెస్ డిమాండ్ చేసిందన్నారు. కానీ, భారత్‌ ఓటింగ్‌ కు దూరంగా ఉందన్నారు. మోదీ ప్రభుత్వం వెనక్కి తగ్గిందని, ఓటింగ్‌ లో పాల్గొని వ్యతిరేకంగా ఓటు వేస్తే బలమైన సందేశం వెళ్లేదన్నారు.

ఈ నేపథ్యంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ఎక్స్‌ వేదికగా కాంగ్రెస్ నాయకులు జైరాం రమేశ్‌, పవన్ ఖేరాలకు కౌంటర్‌ ఇచ్చారు. వీరు పాకిస్థాన్‌కు అంతర్జాతీయ ద్రవ్య నిధి బెయిలౌట్‌పై ప్రచారంలో మునిగి తేలుతున్నారని ఆరోపించారు. తప్పుడు సమాచారంతో దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు.

Also Read : Pawan Kalyan: భారత సైన్యానికి రక్షణగా పవన్ కళ్యాణ్ సర్వమత పూజలు

Leave A Reply

Your Email Id will not be published!