INDIA: ఉప రాష్ట్రపతి అభ్యర్ధిని రంగంలోనికి దించే యోచనలో ఇండియా కూటమి
ఉప రాష్ట్రపతి అభ్యర్ధిని రంగంలోనికి దించే యోచనలో ఇండియా కూటమి
INDIA : జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా చేసిన నేపథ్యంలో త్వరలోనే ఉప రాష్ట్రపతి పదవికి ఎన్నిక నిర్వహించేందుకు ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. అయితే, పార్లమెంటులో ఎన్డీయేకు స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ… ఈ ఎన్నికలో పోటీ చేసే యోచనలో విపక్షాల కూటమి (INDIA) ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఉమ్మడి అభర్థిపై సమష్టి నిర్ణయం తీసుకోనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఫలితంతో సంబంధం లేకుండా బలమైన సందేశాన్ని పంపే ఉద్దేశంతోనే పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.
INDIA Alliance Focus
ఉభయ సభల్లో వివిధ ఖాళీలతో కలిపి సభ్యుల సంఖ్య ప్రస్తుతం 786గా ఉంది. ఇందులో మెజారిటీకి 394 మంది మద్దతు అవసరం. లోక్‌సభలో ఎన్డీయేకు 293 మంది సభ్యుల బలముంది. రాజ్యసభలో 129 మంది మద్దతుంది. మరోవైపు విపక్ష కూటమికి లోక్‌సభలో 234 మంది సభ్యులు, రాజ్యసభలో 79 మంది సభ్యుల బలముంది. మొత్తంగా ఎన్డీయేకు 422 మంది, విపక్ష కూటమికి 313 మంది అనుకూలంగా ఉన్నారు. ఇలా ఉభయ సభల్లో మెజారిటీ లేనప్పటికీ ఉప రాష్ట్రపతి ఎన్నికలో పోటీ చేసేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా చేయడంతో ఖాళీ అయిన ఉప రాష్ట్రపతి పదవికి సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు జరగనున్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 68లో రెండో నిబంధన ప్రకారం.. ఉప రాష్ట్రపతి మరణించినా, రాజీనామా చేసినా, తొలగించినా, ఇతర కారణాల వల్ల ఖాళీ అయినా.. వెంటనే ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. ఉప రాష్ట్రపతిగా ఎన్నికైనవారు మిగిలిన కాలానికి కాకుండా ఐదేళ్లపాటు పదవిలో ఉంటారు. పార్లమెంటు ఉభయ సభల్లోని సభ్యులు ఉప రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. ఇదిలాఉంటే, ఆగస్టు 2022లో ఉప రాష్ట్రపతిగా జగదీప్ ధన్‌ఖడ్ భాధ్యతలు స్వీకరించగా.. ఆగస్టు 2027 వరకు పదవీకాలం ఉంది. కానీ, రెండేళ్ల ముందుగానే తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
Also Read : Pav Bhaji: రూ.2.15 కోట్ల నగలు కొట్టేసిన దొంగను ‘పావ్ భాజీ’ పట్టించింది
