INDIA Alliance: కేంద్ర ఎన్నికల సంఘంపై ఇండియా కూటమి విమర్శలు

కేంద్ర ఎన్నికల సంఘంపై ఇండియా కూటమి విమర్శలు

INDIA Alliance : బీహార్‌ లో 65 లక్షల ఓటర్ల తొలగింపుపై కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ)పై ఇండియా కూటమి విమర్శలు గుప్పించింది. బీహార్‌ రాష్ట్రానికి సంబంధించి తొలగించిన 65 లక్షల ఓటర్లపై సీఈసీ స్పష్టత ఇవ్వలేదని మండిపడింది. సుప్రీంకోర్టు ఆదేశాలపై కూడా సీఈసీ వివరణ ఇవ్వలేకపోయిందని ఇండియా కూటమి (India Alliance) ధ్వజమెత్తింది.

INDIA Alliance Allegations

మహాదేవపుర ఓటరు మోసంపై సీఈసీ సమాధానం ఇవ్వలేదని పేర్కొంది. ఏఐసీసీ నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) చేసిన ఆరోపణలపై సైతం సీఈసీ తప్పించుకుందని ఇండియా కూటమి (India Alliance) విమర్శించింది. ఓటరు మోసాలపై దర్యాప్తు చేయలేదని, నిష్పక్షపాతంగా ఎన్నికలను నిర్వహించడంలో ఈసీ విఫలమైందని, అధికార పార్టీని ప్రశ్నించే వాళ్లను ఈసీ బెదిరిస్తోందని ఇండియా కూటమి ఆరోపించింది.

కాగా, దేశవ్యాప్తంగా పలు లోక్‌సభ నియోజకవర్గాల్లో లక్షలాది ఓట్లను తొలగించి పరోక్షంగా ఓటుహక్కును అపహరించారన్న కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) ఆరోపణలను సీఈసీ ఖండించింది. ఈ మేరకు ఆదివారం(ఆగస్టు 17వ తేదీ) ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌కుమార్‌ మాట్లాడుతూ… రాహుల్‌ చేసిన ఆరోపణల మేరకు ఓటు చోరీపై ఏడు రోజుల్లో సమగ్ర అఫిడవిట్‌ సమర్పించాలన్నారు.

లేని పక్షంలో దేశప్రజలకు తక్షణం క్షమాపణ చెప్పాలి’’ అని ప్రెస్‌ మీట్‌లో డిమాండ్‌ చేశారు. ‘‘ఓటు చోరీ ఆరోపణలు చేస్తున్న వారికి ఏడు రోజుల గడువిస్తున్నా. వారి ఆరోపణలపై ఆలోపు ప్రమాణపత్రం సమర్పించాలి. లేదంటే బహిరంగ క్షమాపణ చెప్పడం మినహా మరో దారి లేదు. ఎలాంటి రుజువులూ లేకుండా మీరు చేస్తున్న ఈ ఆరోపణలన్నీ పచ్చి అబద్ధాలు. అబద్ధాలతో కొన్ని పార్టీలు ఈసీ భుజాల మీదుగా ఓటర్లకు తుపాకీ గురి పెడుతున్నాయి. ’’ అన్నారు.

అదే సమయంలో కేంద్రం ఎన్నికల సంఘం బాగోతం దేశ ప్రజలందరికీ తెలిసిపోయిందని కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్‌ గాంధీ అన్నారు. అధికార బీజేపీతో చేతులు కలిపి ఎన్నికల్లో ఈసీ అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు. బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికల వేళ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) పేరిట గోల్‌మాల్‌కు తెరతీశారన్నారు.

అనుకూలురైన వ్యక్తులను ఓటర్ల జాబితాలో చేర్చి, వ్యతిరేకుల పేర్లు తొలగించి ఎన్నికల్లో నెగ్గేలా పెద్ద కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. ‘‘ఈసీ–బీజేపీ కుట్రలను ఎట్టి పరిస్థితుల్లోనూ సాగనివ్వబోం. ఎన్నికల చోరీని బిహార్‌ ప్రజలు సహించబోరు. పేదల ఓటు హక్కును కాపాడి తీరతాం’’ అన్నారు. బిహార్‌లోని సాసారాంలో ఆదివారం కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ‘ఓటర్‌ అధికార్‌ యాత్ర’ను రాహుల్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు.

ఈసీపై విపక్షాలు మండిపాటు

రాజకీయ పార్టీలు లేవనెత్తిన కీలక ప్రశ్నలకు సీఈసీ జ్ఞానేష్ కుమార్ సమాధానం ఇవ్వడంలో విఫలమయ్యారని, ఆయన తన బాధ్యతల నుంచి పారిపోతున్నారని కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్ విమర్శించారు. ఓటు హక్కు అనేది పౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన ప్రధానమైన హక్కు అని, దానికి పరిరక్షించేందుకు ఉద్దేశించినదే ఈసీ అని చెప్పారు. తామడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పడానికి బదులు ఎదురుదాడికి దిగుతోందని విమర్శించింది. బీజేపీ ప్రతినిధిగా సీఈసీ మాట్లాడుతున్నారని, ఎస్ఐఆర్‌ జాబితా, అవకతవకలపై తమ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంలో ఈసీ విఫలమైందని నేతలు ఆరోపించారు. కాంగ్రెస్, ఆర్జేడీ, సీపీఐ, సమాజ్‌వాదీ పార్టీ, డీఎంకే, టీఎంసీ, ఇతర పార్టీల నేతలు మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

ప్రజాస్వామ్య సిద్ధాంతాలను పరిరక్షించడమే ఈసీ (EC) ఉద్దేశం కావాలని, తమ చర్చలను కప్పిపుచ్చుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తిని నీరుగార్చడమే అవుతుందని ఆర్జేడీ నేత మనోజ్ ఝా అన్నారు. టీఎంసీ ఎంపీ మహువా మెయిత్రా మాట్లాడుతూ, డూప్లికేట్ ఓటర్ కార్డుల అంశాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గతంలో లేవనెత్తారని, దాన్ని ఇంతవరకూ పరిష్కరించనే లేదని అన్నారు. మోసపూరిత ఓటర్ల జాబితాల విషయంలో గత ఎన్నికల అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మోసపూరిత ఓటర్ల జాబితాతోనే లోక్‌సభ ఎన్నికలు నిర్వహించడమే నిజమైతే ఎలక్షన్ కమిషన్‌ను ప్రాసిక్యూట్ చేయాలని, లోక్‌సభను రద్దు చేయాలని అన్నారు.

సమాజ్‌వాదీ పార్టీ నేత రామ్‌గోపాల్ యాదవ్ మాట్లాడుతూ, రాహుల్ గాంధీ ఫిర్యాదు చేసినందుకు అఫిడవిట్ సమర్పించాలని ఈసీ అడుగుతోందని, 2022లో ఓటర్ల జాబితా నుంచి 18,000 మంది ఓటర్లను తొలగించారనే ఫిర్యాదుతో తమ పార్టీ అఫిడవిట్లు సమర్పించిందని, దానిపై ఇంతవరకూ ఎలాంటి చర్య తీసుకోలేదని అన్నారు. బిహార్‌లో హడావిడిగా చేపట్టిన ఓటర్ల జాబితా సవరణపై పార్లమెంటులో చర్చకు అధికార పార్టీ ఎందుకు అనుమతించడం లేదని డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ ప్రశ్నించారు. సమస్య పరిష్కారానికి అన్ని చట్టపరమైన మార్గాలను ఆశ్రయిస్తామని చెప్పారు.

Also Read : Richest Ganpati: ముంబైలో వినాయక మండపానికి రూ.474 కోట్లకు ఇన్సూరెన్స్‌

Leave A Reply

Your Email Id will not be published!