India: పాక్ ఆర్థిక వ్యవస్థపై దెబ్బకొట్టేందుకు భారత్ ప్రయత్నాలు
పాక్ ఆర్థిక వ్యవస్థపై దెబ్బకొట్టేందుకు భారత్ ప్రయత్నాలు
India : పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఆవేదనతో రగిలిపోయిన భారత్… ఉగ్ర వాదులకు ఆశ్రయం కల్పిస్తున్న పాక్ పైనా చర్యలకు ఉపక్రమించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ‘ఆపరేషన్ సిందూర్(Operation Sindoor)’ పేరుతో పాక్ లోని ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసింది. అంతేకాదు సింధు నది జలాల ఒప్పందం అమలును తాత్కాలికంగా నిలిపివేసింది. అఖిలపక్ష సభ్యులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, దాయాది చర్యలను తూర్పారబడుతూ… దౌత్య మార్గాల్లోనూ ఒత్తిడి తీసుకొస్తోంది. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తే ఎలాంటి చర్యలకైనా వెనకాడబోమని పాకిస్థాన్ కు పరోక్షంగా హెచ్చరికలు పంపుతోంది. ఈ క్రమంలోనే పాక్ ఆర్థిక మార్గాలను మూసివేసి, ఆ దేశ ఆర్థిక వ్యవస్థపైనా దెబ్బ కొట్టేందుకు భారత్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
ఈ క్రమంలోనే దాయాదికి ఆర్థిక సాయం అందించే ప్రపంచ బ్యాంక్, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎన్‌ఏటీఎఫ్)లను కలవాలని భారత్ యోచిస్తోంది. ప్రపంచ బ్యాంక్ 2 బిలియన్ డాలర్ల ఆర్థికసాయం చేస్తుందని పాక్(Pakistan) ఎన్నో ఆశలు పెట్టుకుంది. జూన్ నెలలో వరల్డ్ బ్యాంక్ దీనిపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈనేపథ్యంలో పహల్గాం దాడిని ఉటంకిస్తూ… ప్యాకేజీపై పునరాలోచించాలని ప్రపంచ బ్యాంక్‌కు విజ్ఞప్తి చేసేందుకు భారత్(India) సిద్ధమవుతోంది.
ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందన్న కారణంతో 2018 జూన్‌లో పాకిస్థాన్‌ను ‘గ్రే జాబితా’లో చేర్చారు. దీనితో ప్రపంచ ఆర్థికసంస్థల నుంచి నిధులు మంజూరయ్యేవి కాదు. అయితే, ఉగ్రవాదం అణచివేతకు కృషి చేస్తామని హామీ ఇవ్వడమే కాకుండా… ఉగ్రవాద సంస్థతో సంబంధం ఉన్న కొందరిని జైళ్లలో పెట్టడంతో… 2022 అక్టోబర్‌లో పాక్‌ను ఆ జాబితా నుంచి తొలగించారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో పాక్‌ను మళ్లీ గ్రే జాబితాలో చేర్చాలని ఎఫ్‌ఏటీఎఫ్‌పై భారత్ తీవ్రంగా ఒత్తిడి తీసుకొస్తోంది.
ఒకవేళ పాక్‌ను మళ్లీ ఆ జాబితాలో చేరిస్తే… ప్రపంచ బ్యాంకు నుంచి రావాల్సిన 2 బిలియన్ డాలర్ల ప్యాకేజీ ఆగిపోయే అవకాశం ఉంది. మరోవైపు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎమ్‌ఎఫ్) సంస్థ పాకిస్థాన్‌కు మే 9న 1 బిలియన్ డాలర్లు (సుమారు రూ.8,500 కోట్లు) ఆర్థికసాయం మంజూరు చేసింది. దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది.
India – మైసూర్ పాక్ లో ‘పాక్’ను తీసేసి కొత్త పేరు పెట్టిన వ్యాపారి
పహల్గాం ఉగ్ర దాడి, ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) నేపథ్యంలో పాకిస్థాన్‌పై యావత్ భారతీయులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోన్న ఆ దేశాన్ని అంతర్జాతీయ సమాజంలో ఏకాకిని చేయాలన్న డిమాండ్లు వినిపించాయి. ఇదే సమయంలో నెట్టింట మరో చర్చ మొదలైంది. మైసూర్‌పాక్ పేరును మార్చాలని కొందరు సోషల్‌మీడియాలో ప్రతిపాదనలు చేశారు. కొందరైతే మరో అడుగు ముందుకేసి దీనిపై మీమ్స్ కూడా చేశారు. ఈ డిమాండ్ ఓ వ్యాపారికి బాగా నచ్చేసింది. అందుకే తమ దుకాణంలో విక్రయించే స్వీట్లలో ‘పాక్’ పదాన్ని తీసేసి కొత్త పేర్లు పెట్టారు. మైసూర్ పాక్ ను ‘మైసూర్ శ్రీ’గా మార్చేశారు.
రాజస్థాన్ లోని జైపుర్ లో గల ప్రముఖ ‘త్యోహార్ స్వీట్స్’ యజమాని ఈమేరకు తమ దుకాణంలో మార్పులు చేశారు. మైసూర్ పాక్‌తో పాటు… మోతీ పాక్, ఆమ్ పాక్, గోండ్ పాక్ పేర్లను మార్చి… మైసూర్ శ్రీ, మోతీ శ్రీ, ఆమ్ శ్రీ, గోండ్ శ్రీ అని కొత్త పేర్లు పెట్టారు. స్వర్ణ భాషం పాక్, చాందీ భాషమ్ పాక్‌ను కూడా స్వర్ణ శ్రీ, చాందీ శ్రీగా మార్చేశారు. దీనిపై ఆ దుకాణం యజమాని అంజలీ జైన్ మాట్లాడుతూ.. ‘‘దేశభక్తి అనేది కేవలం సరిహద్దుల్లో ఉంటే సరిపోదు. ప్రతి పౌరుడికి దేశంపై ప్రేమ ఉండాలి. అందుకే మేం ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అని తెలిపారు.
వాస్తవానికి ‘పాక్’ అనే పదం సంస్కృతం నుంచి వచ్చింది. దానర్థం ‘వండటం’ అని. ఇక, కొన్ని భాషల్లో చక్కర లేదా బెల్లంతో చేసే పదార్థాన్ని కూడా పాకం అని పిలుస్తాం. ఇక్కడ ఈ పదానికి పాకిస్థాన్‌తో సంబంధం లేకపోయినప్పటికీ.. దాన్ని పలికే శబ్దం ఆ దేశాన్ని గుర్తుచేసేలా ఉండటంతోనే పేరు మార్చినట్లు అంజలీ జైన్ తెలిపారు. ‘శ్రీ’ అనే పదం శుభానికి సూచికగా పెట్టినట్లు పేర్కొన్నారు.
Also Read : Pakistan Spy: పాకిస్థాన్ కు గూఢచర్యం చేస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్