Indian Army Chief: పాక్ కు భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది స్ట్రాంగ్ వార్నింగ్
పాక్ కు భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది స్ట్రాంగ్ వార్నింగ్
Indian Army Chief : పాకిస్థాన్ కు భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది (Indian Army Chief) తీవ్ర హెచ్చరిక చేశారు. ఉగ్రవాద ముఠాలను ఎగదోయడం మానుకోకుంటే ప్రపంచపటంలో పాక్ అస్థిత్వమే ప్రమాదంలో పడుతుందని స్పష్టంచేశారు. శుక్రవారం ఆయన రాజస్థాన్‌లోని అనూప్‌గఢ్‌లో ఒక సైనిక శిబిరాన్ని సందర్శించి… అక్కడ జవాన్లను ఉద్దేశించి మాట్లాడారు. జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకుల ఊచకోతకు ప్రతిగా పాకిస్థాన్‌పై చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌ను ఆయన ప్రస్తావించారు. పొరుగు దేశం తన తీరును మార్చుకోకుంటే ఆ ఆపరేషన్‌కు సంబంధించిన రెండో వెర్షన్ తీవ్రస్థాయిలో ఉంటుందని సంకేతాలిచ్చారు.
Indian Army Chief Key Comments
‘‘భారత్ ఇప్పుడు పూర్తి సంసిద్ధంగా ఉంది. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) 1.0 సమయంలో చూపిన సంయమనాన్ని ఈసారి మేం చూపలేకపోవచ్చు. ఈ దఫా ఒక అడుగు ముందుకేస్తాం. ప్రపంచ పటంలో కొనసాగాలా.. లేదా అని పాక్ ఆలోచించుకోవాల్సిన స్థాయిలో మా చర్యలు ఉంటాయి. ప్రపంచ పటంలో తన స్థానాన్ని కాపాడుకోవాలంటే… ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదాన్ని పొరుగు దేశం ఆపాలి’’ అని పేర్కొన్నారు. ఈ మేరకు పోరుకు సన్నద్ధంగా ఉండాలని భారత సైనికులకు ఆయన పిలుపునిచ్చారు.
‘‘పూర్తి సన్నద్ధంగా ఉండండి. దేవుడు వాంఛిస్తే ఆ అవకాశం త్వరలోనే మనకు వస్తుంది’’ అని భారత జవాన్లకు ఆయన పిలుపునిచ్చారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్‌లో ఉగ్రవాద స్థావరాల ఉనికి గురించి ప్రపంచానికి ఆధారాలు అందించామని జనరల్ ద్వివేది పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత బలగాలు 9 లక్ష్యాలపై దాడి చేయగా.. అందులో ఏడింటిపై సైన్యమే దాడి చేసిందన్నారు. మిగతా రెండింటిపై వాయుసేన విరుచుకుపడిందని తెలిపారు. ఉగ్రవాదాన్ని పాక్ ఎగదోయనంతకాలం ఆ దేశానికి చెందిన సాధారణ పౌరులపై మాకు ఎలాంటి కోపంలేదన్నారు. సరిహద్దుల్లో ఉంటున్న సాధారణ పౌరులను తాము సైనికులుగానే పరిగణిస్తామని చెప్పారు. వారు కూడా పోరాటంలో తమతో చేతులు కలపాలన్నారు. 1965, 1971 నాటి యుద్ధాల్లో అదే జరిగిందని పేర్కొన్నారు. ‘‘ఇది కేవలం సైన్యం సాగించాల్సిన యుద్ధం కాదు. ఇది దేశ పోరాటం’’ అని పేర్కొన్నారు.
Indian Army Chief – పాక్ ఆక్రమిత కశ్మీర్ లో అణచివేతపై భారత్ ఆగ్రహం
నిరుద్యోగం, అధిక ధరలు తదితర సమస్యల పరిష్కారంతో పాటు ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమిస్తున్న పాక్ ఆక్రమిత కశ్మీర్ (Pok)లోని ప్రజలపై అణచివేతను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. అమాయకులైన ప్రజలపై భద్రతా బలగాల దమనకాండ, అమానుష చర్యలు, హక్కుల ఉల్లంఘనకు పాకిస్థాన్‌ను జవాబుదారి చేయాలని భారత విదేశీ వ్యవహారాల శాఖ డిమాండ్ చేసింది. ఆక్రమిత కశ్మీర్‌లోని సహజవనరులను దోచుకుంటూ స్థానికులపై ఉక్కుపాదం మోపుతున్న పాకిస్థాన్ పాలకుల విధానాలే అశాంతికి కారణమని విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. వివిధ డిమాండ్ల సాధన కోసం ఉద్యమిస్తున్న ప్రజలపై పాక్ భద్రతాబలగాలు జరిపిన కాల్పుల్లో పీవోకేలో 12 మంది చనిపోవటంపై భారత్ తీవ్రంగా స్పందించింది.
పీవోకేలో అశాంతి ఎందుకంటే ?
గత కొన్నేళ్లుగా పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ప్రజలు తీవ్ర అశాంతితో రగిలిపోతున్నారు. స్థానికంగా జలవిద్యుత్ భారీ స్థాయిలో ఉత్పత్తి అవుతున్నప్పటికీ అధిక స్థాయిలో విద్యుత్ రుసుములు చెల్లించాల్సి రావడంపై ప్రజలు మండిపడుతున్నారు. పరిశ్రమలు నెలకొల్పకపోవడం, ఉపాధి కల్పనపై నిర్లక్ష్యం వహించడం, వివిధ రంగాల్లో ప్రభుత్వ పెట్టుబడులను పాకిస్థాన్ పాలకులు పెంచకపోవడంపైనా స్థానిక ప్రజల్లో అసంతృప్తి నెలకొంది. ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వసతులు కల్పించడంతో పాటు వారి సంక్షేమానికే ప్రాధాన్యమివ్వడంపైనా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఉద్యోగులకు వాహనాలివ్వడమే కాకుండా ఇంధన ధరల్లోనూ రాయితీనివ్వడం, వారికి వ్యక్తిగత భద్రతను కల్పించడంపైనా స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
భారత్‌లోని జమ్మూకశ్మీర్ నుంచి వలస వచ్చి ఇక్కడ స్థిరపడిన వారికి పీవోకే అసెంబ్లీలో కేటాయించిన 12 సీట్లను రద్దు చేయాలని కోరుతున్నారు. ఈ సీట్లలో తమకు నచ్చిన వారిని నియమించి ఇక్కడి అసెంబ్లీని అస్థిరపరిచే యత్నాలను పాకిస్థాన్ ప్రభుత్వం చేస్తోందని ఆరోపిస్తున్నారు. ఇలా మొత్తం 38 డిమాండ్లతో పీవోకే ప్రజలు ఉద్యమిస్తున్నారు. వీటి పరిష్కారానికి ఎప్పటికప్పుడు ఇస్తున్న హామీలను ప్రభుత్వం నెరవేర్చకపోవడంతో ప్రజలు రగిలిపోతున్నారు. ఉద్యమం తీవ్రరూపం దాల్చడంతో పాకిస్థాన్‌లోని వివిధ ప్రాంతాల నుంచి సాయుధ బలగాలను, సైన్యాన్ని భారీ మొత్తంలో తరలించి బలప్రయోగంతో తాత్కాలికంగా అణచివేసినా కొద్ది కాలం తర్వాత ఆందోళనలు తిరిగి తలెత్తుతున్నాయి.
Also Read : Shakti Cyclone: ముంబైకు’శక్తి’ తుపాను – IMD హెచ్చరిక
