Indian Government : భారత్‌ ను వీడే పాక్‌ పౌరులకు మరింత గడువు ఇచ్చిన కేంద్రం

భారత్‌ ను వీడే పాక్‌ పౌరులకు మరింత గడువు ఇచ్చిన కేంద్రం

Indian Government : పహాల్గాం ఉగ్రదాడి తరువాత భారత్ లో నివసించే పాకిస్తాన్ పౌరులు తక్షణమే దేశం విడిచి వెళ్లిపోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. భారత్ ను వీడటానికి పాక్ పౌరులకు ఏప్రిల్ 30 వరకు గడువు విధించింది. ఇప్పటికే కొంతమంది దేశాన్ని విడిచి వెళ్లిపోగా… వివిధ కారణాలతో ఇంకొంత మంది భారత్ లోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో భారత్‌(Indian Government) లో ఉంటున్న పాక్‌ పౌరులకు కొంచెం ఉపశమనం కలిగింది. దేశం వీడేందుకు ఇచ్చిన గడువును కేంద్రం గురువారం సడలించింది. ఏప్రిల్‌ 30న సరిహద్దును మూసివేస్తామని గతంలో ఇచ్చిన ఆదేశాలను సవరిస్తున్నట్లు హోం శాఖ తెలిపింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు వాఘా–అటారీ సరిహద్దు గుండా తిరిగి వెళ్లేందుకు అనుమతించింది.

‘ఈ ఉత్తర్వులను సమీక్షించాం. తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ పాక్‌ పౌరులు అటారీలోని ఇంటిగ్రేటెడ్‌ చెక్‌ పోస్ట్‌ నుంచి భారత్‌(Indian Government) విడిచి పాకిస్తాన్‌కు వెళ్లొచ్చు’అని తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. కేంద్రం ఆదేశించిన ఆరు రోజుల్లో 55 మంది దౌత్యవేత్తలు, వారి సహాయక సిబ్బంది సహా 911 మంది పాకిస్తానీయులు అటారీ–వాఘా సరిహద్దు పోస్ట్‌ ద్వారా భారత్‌ ను వీడారు. ఇక పాకిస్తాన్‌ నుంచి 1,617 మంది భారతీయులు స్వదేశానికి వచ్చారు. వీరిలో దీర్ఘకాలం వీసా కలిగిన 224 మంది ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. మరికొందరు విమానాశ్రయాల ద్వారా మూడో దేశం గుండా పాక్‌ వెళ్లిపోయారని అధికార వర్గాలు తెలిపాయి.

Indian Government – పాకిస్థాన్‌కు గట్టిగా బదులిస్తున్న భారత్

పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో పాకిస్థాన్‌(Pakistan) పై తీవ్ర ఆంక్షలు విధించినా… భారత్‌ పై తన కవ్వింపు చర్యలను మాత్రం ఆ దేశం ఆపడం లేదు. దీనిలో భాగంగా ఏనిమిదో రోజు గురువారం రాత్రి సైతం భారత్ భూభాగంపైకి కాల్పులు జరిపింది. ముఖ్యంగా కుప్వారా, బారాముల్లా, పూంచ్, నౌషారా, అక్నూరు సెక్టర్లలో పాక్ సైన్యం ఈ కాల్పులకు తెగబడింది. అయితే ఈ కాల్పులకు ధీటుగా భారత్ సమాధానమిచ్చింది. ఇలా కాల్పుల ద్వారా కవ్వింపు చర్యలపై భారత్ అధికారులు ఇప్పటికే పాక్‌ అధికారులతో హాట్ లైన్‌ లో మాట్లాడారు. అయినా పాక్ మాత్రం తన వైఖరిని ఏ మాత్రం వీడడం లేదు. తన ధోరణిలోనే పాక్ కవ్వింపు చర్యలకు దిగుతోంది.

ఏప్రిల్ 22వ తేదీ జమ్మూ కశ్మీర్ అనంతనాగ్ జిల్లాలోని పహల్గాంలో పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 26 మంది పర్యాటకులు మరణించారు. ఈ ఘటన వెనుక పాకిస్థాన్ హస్తం ఉందనేందుకు స్పష్టమైన సాక్ష్యాలను భారత్ సంపాదించింది. దీంతో పాకిస్థాన్‌(Pakistan)పై భారత్ పలు ఆంక్షలు విధించింది. పాక్ సైతం అదే రీతిలో స్పందించి… భారత్‌పై ఆంక్షలు విధించింది. దాంతో ఇరుదేశాల మధ్య ఓ విధమైన ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఉగ్రదాడి జరిగిన కొద్దిరోజులకే నియంత్రణ రేఖ వద్ద భారత్‌ లోని సైనికుల పోస్టులే లక్ష్యంగా చేసుకొని పాకిస్థాన్ కాల్పులు జరుపుతోంది.

అయితే ఈ కాల్పుల్లో ఇప్పటి వరకు ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని భారత సైన్యం ఇప్పటికే స్పష్టం చేసిన విషయం విధితమే. మరోవైపు లష్కరే తోయిబా చీఫ్ హాఫీజ్ సయిద్‌కు పాకిస్థాన్ ప్రభుత్వం నాలుగు అంచెల భద్రతను ఏర్పాటు చేసింది. పహల్గాం ఉగ్రదాడి వెనుక లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెంన్స్ ఫ్రంట్ ఉన్నట్లు ఇప్పటికే ఆ సంస్థ ప్రకటించింది. దీంతో ఈ ఉగ్రదాడిలో హాఫీజ్ సయిద్ పాత్ర కీలకమని భారత్ గాఢంగా విశ్వసిస్తోందని పాక్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో అతడికి భద్రతను కట్టుదిట్టం చేసింది.

Also Read : Ex Minister Girija Vyas: హారతి ఇస్తుండగా మంటలు అంటుకుని మాజీ కేంద్ర మంత్రి గిరిజా వ్యాస్‌ మృతి

Leave A Reply

Your Email Id will not be published!