Indian Navy: ఇండియన్ నేవీ రెస్క్యూ ఆపరేషన్‌ సక్సెస్‌ !

ఇండియన్ నేవీ రెస్క్యూ ఆపరేషన్‌ సక్సెస్‌ !

Indian Navy: భారత నావికాదళం (ఇండియన్ నేవీ) మరోసారి సత్తా చాటింది. అరేబియా సముద్రంలో హైజాక్‌ కు గురైన నౌకలో ఉన్న 17 మందిని ఎంతో సాహసోపేతంగా కాపాడింది. సుమారు 40 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్‌ జరిపి నౌకలో ఉన్న 35 మంది సముద్రపు దొంగలను పట్టుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే… గతేడాది డిసెంబర్ 14న అరేబియా సముద్రంలో ఎంవీ రుయెన్ నౌకను సముద్రపు దొంగలు హైజాక్ చేశారు. సముద్రంలో దోపిడీకి ఈ నౌకను ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నౌకను రక్షించేందుకు ఇండియన్ నేవీ(Indian Navy) రంగంలోకి దిగింది. సుమారు 40 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి హైజాకర్స్ నుండి నౌకను స్వాధీనం చేసుకున్నారు.

Indian Navy Operation…

ఈ రెస్క్యూ ఆపరేషన్‌ లో మొత్తం 35 మంది సముద్రపు దొంగలు లొంగిపోగా… నౌకలోని 17 మంది సిబ్బంది సురక్షింతంగా ఉన్నట్టు నేవీ అధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో ఐఎన్ఎస్ కోల్‌కత్తా, యుద్ధనౌక ఐఎన్ఎస్ సుభద్ర, ఆధునిక డ్రోన్లు, P8I పెట్రోలింగ్ విమానాలు ఉపయోగించినట్టు ఇండియన్ నేవీ తెలిపింది. హైజాక్‌కు గురైన ఎంవీ రుయెన్‌ పూర్తిగా భారత నావికాదళం ఆధీనంలో ఉన్నట్టు పేర్కొంది.

ఇదిలా ఉండగా.. ఈ నెల 15వ తేదీన భారత నేవీ ఆపరేషన్ చేపట్టే ముందు సముద్రపు దొంగలను లొంగిపోవాలని సూచించింది. లేకపోతే వారిపై దాడులు ప్రారంభించాలని మెరైన్ కమాండోలకు నేవీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో సోమాలియా సముద్రపు దొంగలు నేవీ అధికారులపై కాల్పులు జరిపారు. అనంతరం ఏ మాత్రం బెదరకుండా రెస్క్యూ కొనసాగించిన నేవీ సముద్రపు దొంగలు లొంగి పోయేలా చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలను కూడా ఇండియన్ నేవీ రిలీజ్ చేసింది.

ఇక,అంతకుముందు బంగ్లాదేశ్‌కు చెందిన ఓ నౌకను సైతం ఇండియన్ నేవీ రక్షించింది. భారత నావికాదళం అరేబియా సముద్రంలో జరిగిన సంఘటనలను తక్షణమే పరిష్కరించడం, వాణిజ్య నౌకలను రక్షించడానికి అంతర్జాతీయ భాగస్వాములతో కలిసి పనిచేస్తోంది. దీనితో ఇండియన్ నేవీపై ప్రపంచదేశాలు ప్రశంసలు కురిపిస్తున్నాయి.

Also Read : RS Praveen Kumar: బీఆర్ఎస్ లోకి ఆర్‌.ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌

Leave A Reply

Your Email Id will not be published!