Indian Nurse Nimisha : జూలై 16న కేరళ నర్సు ‘నిమిష ప్రియ’ యెమెన్ లో ఉరిశిక్ష

యెమెన్‌ చట్టాల ప్రకారం, విదేశీయులు వ్యాపారం నిర్వహించాలంటే స్థానికులను భాగస్వాములుగా చేర్చుకోవాల్సి ఉంటుంది...

Nimisha : యెమెన్‌లో ఓ హత్యకేసులో దోషిగా తేలిన కేరళకు చెందిన నర్సు నిమిషా ప్రియకు ఉరి శిక్ష అమలు తేదీ ఖరారైంది. వచ్చే జూలై 16న ఆమెకు ఉరి శిక్ష అమలు చేయనున్నట్లు సమాచారం. ఈ విషయమై ఆమె కుటుంబసభ్యులు తీవ్ర ఉద్వేగానికి లోనై, కేంద్ర ప్రభుత్వానికి సహాయం కోసం విజ్ఞప్తి చేస్తున్నారు.

Nimisha Priya – నర్సుగా యెమెన్‌కి వెళ్లిన నిమిషా ప్రియ కథ ఇదే…

నిమిషా ప్రియ (Nimisha), కేరళకు చెందిన నర్సు. 2008లో ఉద్యోగావకాశాల కోసం యెమెన్‌కి వెళ్లింది. అక్కడ పలు ఆసుపత్రుల్లో సేవలందించిన అనంతరం, స్వంతంగా ఓ క్లినిక్ ప్రారంభించింది. 2014లో తలాల్ అబ్దో మహది అనే స్థానికుడిని తన వ్యాపారంలో భాగస్వామిగా చేర్చుకుంది. యెమెన్‌ చట్టాల ప్రకారం, విదేశీయులు వ్యాపారం నిర్వహించాలంటే స్థానికులను భాగస్వాములుగా చేర్చుకోవాల్సి ఉంటుంది.

వ్యాపార భాగస్వామ్యమే.. విషాదాంతానికి దారి

క్లినిక్‌ ప్రారంభించిన కొద్ది కాలంలోనే నిమిషా, తలాల్ మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. తలాల్ వేధింపుల కారణంగా ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా, అతడిని అరెస్ట్ చేశారు. 2016లో జైలులో నుంచి బయటకు వచ్చిన తలాల్, మళ్లీ నిమిషాను వేధించడం ప్రారంభించాడు. ఆమె పాస్‌పోర్ట్‌ను తీసుకొని తీవ్ర ఒత్తిడి తేవడంతో, నిమిషా అతన్ని చంపడానికి సిద్ధపడింది.

హత్య అనంతరం అరెస్టు

2017లో తలాల్‌కి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి చంపిన నిమిషా (Nimisha), పాస్‌పోర్టు తీసుకొని భారత్‌కి తిరిగి రావాలని ప్రయత్నించగా, యెమెన్ పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఆమె అక్కడే జైలులో ఉంది. 2018లో కోర్టు ఆమెను దోషిగా తేల్చి, ప్రారంభంలో జీవిత ఖైదు విధించినా, తర్వాత ఆ శిక్షను ఉరిశిక్షగా మార్చింది.

బ్లడ్ మనీ ప్రయత్నాలు విఫలం

తలాల్ కుటుంబం 70 లక్షల రూపాయల బ్లడ్ మనీకి అంగీకరించగా, నిమిషా కుటుంబం విరాళాల ద్వారా ఆ మొత్తాన్ని సమీకరించింది. కానీ, నిమిషా తరఫు న్యాయవాది తన ఫీజుగా 40 వేల డాలర్లు డిమాండ్ చేయడంతో చర్చలు నిలిచిపోయాయి. రెండు విడతలుగా చెల్లించే అవకాశమిచ్చినా, రెండో విడత డబ్బుల చెల్లింపులో సమస్యలు తలెత్తడంతో బ్లడ్ మనీ ప్రక్రియ పూర్తి కాలేదు.

కేంద్ర ప్రభుత్వం స్పందన

నిమిషా ప్రియ కేసు పరిణామాలపై భారత విదేశీ వ్యవహారాల శాఖ యెమెన్ ప్రభుత్వంతో సంప్రదింపులు కొనసాగిస్తోంది. అక్కడి పరిస్థితులపై నిరంతరం సమీక్ష జరుగుతున్నట్లు సమాచారం.

ఈ పరిణామాల నేపథ్యంలో, నిమిషాకు జీవితాన్ని ఇచ్చే అవకాశం ఇంకా ఉందా? అనే ప్రశ్న తల్లిదండ్రుల్ని, మానవ హక్కుల కార్యకర్తల్ని వేధిస్తోంది. ఉరి తేదీ సమీపిస్తున్న వేళ, మానవతా దృక్పథంతో యెమెన్ ప్రభుత్వం నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరుతున్నారు.

Also Read : Chittoor SP: జగన్‌ బంగారుపాళ్యం పర్యటనకు 500 మందికే అనుమతి – చిత్తూరు ఎస్పీ

Leave A Reply

Your Email Id will not be published!