Indian Railways: పండుగ సీజన్‌ లో భారతీయ రైల్వే బంపర్‌ ఆఫర్‌

పండుగ సీజన్‌ లో భారతీయ రైల్వే బంపర్‌ ఆఫర్‌

Indian Railways : పండుగ సందర్భంగా భారతీయ రైల్వే శాఖ (Indian Railways) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. ‘రౌండ్‌ ట్రిప్‌ ప్యాకేజ్‌ ఫర్‌ ఫెస్టివల్‌ రష్‌’ పేరుతో శనివారం ఓ ప్రత్యేక పథకాన్ని ప్రకటించింది. రాను పోను ప్రయాణానికి రైలు టికెట్లు బుక్‌ చేసుకున్న వారికి తిరుగు ప్రయాణం బేస్‌ ఫేర్‌ లో 20 శాతం రిబేట్‌ను ఇవ్వనున్నట్లు తెలిపింది. ఇబ్బందులు లేని ప్రయాణానికి, ముందస్తు రిజర్వేషన్‌ చేసుకోవడాన్ని, రైళ్లలో ప్రయాణించడాన్ని ప్రోత్సహించడానికి, రద్దీని క్రమబద్దీకరించడానికి ఇది ఉపయుక్తంగా ఉంటుందని రైల్వే శాఖ (Indian Railways) తెలిపింది.

Indian Railways Offer

ఈ పథకంలో భాగంగా చేసే బుకింగ్‌ లు ఆగస్టు 14 నుంచి ప్రారంభం కానున్నాయి. కేంద్ర రైల్వేశాఖ (Indian Railways) ప్రకటించిన రౌండ్‌ ట్రిప్‌ ప్యాకేజ్‌లో భాగంగా వెళ్లే ప్రయాణం అక్టోబర్‌ 13 నుంచి 26 మధ్య, వచ్చే ప్రయాణం నవంబర్‌ 17 నుంచి డిసెంబర్‌ 1 మధ్య ఉండాలి. ప్రత్యేక రైళ్లు సహా అన్ని రైళ్లలో, అన్ని తరగతులకూ ఈ పథకం వర్తిస్తుంది. రిటర్న్‌ టికెట్‌ బుకింగ్‌కు 60 రోజుల అడ్వాన్స్‌ రిజర్వేషన్‌ పీరియడ్‌ వర్తించదు. రెండు ప్రయాణాలూ ఒకే ప్రయాణికుల పేర్లతో, ఒకే తరగతి, ఒకే గమ్యస్థానం ఉన్న జంటకు మాత్రమే అనుమతిస్తారు. అయితే రెండు ప్రయాణాల్లోనూ కన్‌ఫర్మ్‌డ్‌ టికెట్లు తప్పనిసరి. ఫ్లెక్సీ ఫేర్‌ రైళ్లు మినహా అన్ని సాధారణ, ప్రత్యేక రైళ్లకు రౌండ్‌ ట్రిప్‌ ప్యాకేజ్‌ ఆఫర్‌ వర్తిస్తుంది. ఈ పథకం కింద బుక్‌ చేసిన టికెట్లకు రీఫండ్‌ లేదా మార్పులు అనుమతించరు. ఆన్‌లైన్‌ లేదా కౌంటర్‌… రెండు టికెట్లు ఒకే విధానంలోనే బుక్‌ చేయాలి. ఈ స్కీమ్‌ పండుగ సీజన్‌లో రద్దీని విభజించడంతో పాటు, ప్రత్యేక రైళ్ల వినియోగాన్ని పెంచుతుందని కేంద్ర రైల్వేశాఖ ఆశిస్తోంది.

అయితే పథకాన్ని ఉపయోగించుకోవడానికి కొన్ని షరతులు వర్తిస్థాయని పేర్కొంది. ‘రెండు వైపుల కన్ఫర్మ్‌ టికెట్లు ఉండాలి. రెండు వైపుల గమ్యస్థానాలు ఒకటే అయు ఉండాలి. ‘ప్లెక్సీ ఫేర్‌’ ఉన్న రైళ్లు… రాజధాని, శతాబ్ది, దురంతో రైళ్లలో ఈ పథకం వర్తించదు. తిరుగు ప్రయాణానికి ఏఆర్‌పీ (అడ్వాన్స్‌డ్‌ రిజర్వేషన్‌ పీరియడ్‌) వర్తించదు. అలాగే కూపన్లు, ఓచర్లు, పాసులు పనిచేయవు. ఈ పథకం కింద బుక్‌ చేసుకున్న టికెట్లకు డబ్బులు వాపసు చేయరు’ అని రైల్వే (Indian Railways) తెలిపింది.

ఆఫర్‌ వివరాలు

→ బుకింగ్‌ ప్రారంభం: ఆగస్టు 14, 2025
→ ప్రారంభ ప్రయాణం: అక్టోబర్‌ 13 నుంచి 26 వరకు
→ తిరుగు ప్రయాణం: నవంబర్‌ 17 నుంచి డిసెంబర్‌ 1 వరకు
→ రిటర్న్‌ టికెట్‌ బుకింగ్‌కు 60 రోజుల అడ్వాన్స్‌ రిజర్వేషన్‌ పీరియడ్‌ వర్తించదు.
→ రానుపోను టికెట్లు ఒకే ప్రయాణికుల పేర్లతో, ఒకే తరగతి, ఒకే గమ్యస్థాన జంటకు మాత్రమే.
→ రెండు ప్రయాణాలకూ కన్‌ఫర్మ్‌డ్‌ టికెట్లు తప్పనిసరి.
→ ఫ్లెక్సీ ఫేర్‌ రైళ్లు మినహా అన్ని రైళ్లకు ఆఫర్‌ వర్తింపు.
→ టికెట్‌ బుక్‌ చేసిన తర్వాత మార్పులు, రీఫండ్‌లు ఉండవు.

దేశంలో అత్యంత పొడవైన గూడ్స్‌ రైలు ‘రుద్రాస్త్ర’ ప్రారంభం

భారతీయ రైల్వే (Indian Railways) అరుదైన రికార్డు సృష్టించింది. ఏకంగా 7 ఇంజన్లు… 354 వ్యాగన్లతో దేశ చరిత్రలోనే అత్యంత పొడవైన గూడ్స్‌ రైలు విజయవంతంగా పట్టాలెక్కించింది. ‘రుద్రాస్త్ర’గా నామకరణం చేసిన ఈ రైలును తూర్పు మధ్య రైల్వే (ఈసీఆర్‌) పరిధిలోని గ్రాండ్‌ కోర్డ్‌ రైల్‌ సెక్షన్‌లో ప్రారంభించారు. దీని పొడవు 4.5 కిలోమీటర్ల మేర ఉంటుంది. ఆరు బాక్సన్‌ ర్యాక్‌ (వ్యాగన్ల శ్రేణి)లను అనుసంధానించడం ద్వారా దీన్ని రూపొందించారు. ముందు ఒక లోకోమోటివ్‌… తర్వాత మధ్యమధ్యలో మరో ఆరు ఇంజన్లు ఏర్పాటు చేసి సమర్థంగా నడిపారు. ఇది ఉత్తరప్రదేశ్‌లోని గంజ్‌ కవాజా రైల్వే స్టేషన్‌ నుంచి ఝార్ఖండ్‌లోని గర్హ్వా రోడ్‌ స్టేషన్‌ మధ్య పరుగులు తీసి అందరి దృష్టిని ఆకర్షించింది. గంటకు సగటున 40కిలోమీటర్ల వేగంతో 200 కిలోమీటర్ల దూరాన్ని దాదాపు ఐదు గంటల్లో పూర్తిచేసింది. దీనికి సంబంధించిన వీడియోను రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ శుక్రవారం ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. ‘రుద్రాస్త్ర.. భారత అతి పొడవైన గూడ్స్‌ రైలు’ అని క్యాప్షన్‌ ఇచ్చారు.

‘రుద్రాస్త్ర’ ప్రత్యేకత ఏమిటంటే ?

రుద్రాస్త్ర గూడ్స్‌ రైలు సరుకు రవాణాలో వేగంతో పాటు సామర్థ్యాన్ని పెంచుతుందని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఇందులోని ఆరు ర్యాక్‌లను వేర్వేరుగా నడపడం వలన వాటన్నింటికీ వేర్వేరు మార్గాలు, సిబ్బందిని, షెడ్యూల్‌ ను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అదే రుద్రాస్త్రగా కలిపి నడపడం వలన సమయం ఆదా అవుతుందని, సిబ్బంది అవసరం, నిర్వహణ వ్యయం తగ్గుతుందని తెలిపారు. మొత్తం మీద భారత రవాణా రంగానికి ‘రుద్రాస్త్ర’ మంచి ఊపునిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

‘రుద్రాస్త్ర’ భారత రైల్వే (Indian Railways) చరిత్రలోనే అతి పొడవైన గూడ్స్‌ రైలుగా నిలిచింది. అయితే ఈ విషయంలో ప్రపంచ రికార్డు ఆస్ట్రేలియాకు చెందిన బీహెచ్‌పీ కంపెనీ చేతుల్లో ఉంది. ఆ సంస్థ రూపొందించిన రైలు 7.3 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. అందులో 682 వ్యాగన్లు ఉంటాయి. అయినప్పటికీ, భారత రైల్వే సాఽధించిన ఈ సరికొత్త విజయం.. ప్రపంచ స్థాయి సరుకు రవాణా కార్యకలాపాల్లో ఒక కీలక అడుగుగా చెప్పవచ్చు.

Also Read : Election Commission: సంతకం చేస్తారా ? క్షమాపణ చెప్తారా ? – రాహుల్ కు మరోసారి కోరిన ఈసీ

Leave A Reply

Your Email Id will not be published!