Indian Student: రష్యా సైన్యంలో బందీగా మారిన భారతీయ విద్యార్ధి
రష్యా సైన్యంలో బందీగా మారిన భారతీయ విద్యార్ధి
Indian Student : ఇటీవల ఉన్నత చదువుల కోసం రష్యా వెళ్లిన తమ కుమారుడిని అక్కడి అధికారులు ఉక్రెయిన్ యుద్ధ ప్రాంతానికి పంపారని భారత్‌కు చెందిన ఓ కుటుంబం ఆరోపించింది. ప్రస్తుతం రష్యా సైన్యం ఆధీనంలో ఉన్న తమ కుమారుడిని స్వదేశానికి రప్పించాలని భారత విదేశాంగ అధికారులను ఆశ్రయించింది.
Indian Student Block
బాధిత కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం… ఉత్తరాఖండ్‌లోని (Uttrakhand) ఉధమ్ సింగ్ నగర్‌కు చెందిన రాకేశ్ కుమార్ (30) అనే యువకుడు స్టడీ వీసాపై రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ విశ్వవిద్యాలయంలో అడ్మిషన్ పొందాడు. ఉన్నత చదువుల కోసం ఆగస్టు 7న మాస్కోకు వెళ్లాడు. అయితే అక్కడికి వెళ్లిన కొద్ది రోజులకు ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో పాల్గొనాలని తనను కొందరు అధికారులు బలవంతపెడుతున్నట్లు రాకేశ్ అతడి కుటుంబసభ్యులకు తెలియజేశాడు.
ఆగస్టు 30న రాకేశ్ తమతో మాట్లాడాడని… రష్యా సైన్యం తనను బలవంతంగా తమ సైన్యంలో చేర్చుకున్నారని తెలిపాడని అతడి కుటుంబసభ్యులు పేర్కొన్నారు. త్వరలో తనను ఉక్రెయిన్‌తో యుద్ధం జరుగుతున్న ప్రాంతానికి తరలించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పాడన్నారు. ఆ తర్వాత రష్యన్ సైనిక యూనిఫాంలో రాకేశ్ ఉన్న ఫోటోను తమకు పంపినట్లు తెలిపారు. చివరిసారిగా కొత్త ఫోన్ నెంబర్ నుంచి తమకు కాల్ చేసి.. అక్కడి అధికారులు తన పాస్‌పోర్ట్, ఇతర పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపాడన్నారు. యుద్ధానికి వెళ్లే ముందు తనకు డాన్బాస్ అనే ప్రాంతంలో సైనిక శిక్షణను సైతం ఇచ్చినట్లు చెప్పాడన్నారు. సెప్టెంబర్ ప్రారంభం నుంచి తమ కుమారుడు అందుబాటులోకి రావట్లేదని రాకేశ్ తల్లిదండ్రులు విదేశాంగ శాఖ (MEA)కు తెలియజేశారు. తమ కుమారుడి ఆచూకీ కనుగొనడంలో సహాయం చేయాలని, తిరిగి భారత్‌కు రప్పించాలని మాస్కోలోని భారత రాయబార కార్యాలయానికి విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై విదేశాంగ శాఖ నుంచి అధికారిక సమాచారం రావాల్సి ఉంది.
Also Read : Flight: విమానం ల్యాండింగ్ గేర్ లో దాక్కుని భారత్ వచ్చిన అప్ఘాన్ బాలుడు
