Indian Tourist: నేపాల్‌ లో నిరసనలపై భారత టూరిస్ట్ ఆవేదన

నేపాల్‌ లో నిరసనలపై భారత టూరిస్ట్ ఆవేదన

Indian Tourist : నేపాల్‌లో జెన్‌-జడ్‌ నిరసనలు హింసాత్మక పరిస్థితులను సృష్టించాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు ఆందోళనకారులు నిప్పటించారు. పొఖారా ప్రాంతంలో ఉన్న హోటల్‌ పైనా వారు దాడికి దిగారు. దాంతో అందులో బస చేస్తోన్న భారత పర్యాటకురాలు (Indian Tourist) ఉపాసన గిల్ తనకు సహాయం చేయాలంటూ భారత ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. దానికి సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది.

Indian Tourist in Nepal

‘‘నా పేరు ఉపాసన గిల్. వాలీబాల్‌ లీగ్‌ కోసం నేపాల్ వచ్చాను. నిరసనలతో పొఖారా ప్రాంతంలో ఉన్న హోటల్‌ లో చిక్కుకుపోయాను. తొలుత నేను బస చేసిన హోటల్‌కు నిప్పంటించారు. నా వస్తువులన్నీ అందులోనే ఉండిపోయాయి. దాడి సమయంలో నేను స్పాలో ఉన్నాను. కొందరు నిరసనకారులు పెద్దపెద్ద కర్రలతో నా వెనకే దూసుకొచ్చారు’’ అని గిల్ వాపోయారు. వారినుంచి ఎలాగోలా ప్రాణాలు కాపాడుకున్న ఆమె.. సహాయం కోసం భారత ప్రభుత్వాన్ని అర్థించారు. ప్రస్తుతం పరిస్థితులు ఏమాత్రం బాగా లేవని, రోడ్డుపై ఎక్కడ చూసినా మంటలే కనిపిస్తున్నాయని వెల్లడించారు. ‘‘వారు పర్యాటకులను కూడా వదలడం లేదు. ఎలాంటి ఆలోచన లేకుండా ప్రతిదీ తగలబెడుతున్నారు. పరిస్థితి ఎలా ఉంటుందో తెలియడం లేదు. నాతోపాటు చాలామంది సహాయం కోసం ఎదురుచూస్తున్నారు’’ అని పేర్కొన్నారు.

మరోవైపు నేపాల్‌ (Nepal) లో ఉన్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు భారత ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అక్కడి రాయబార కార్యాలయం హెల్ప్‌లైన్ నంబర్లను వెల్లడించింది. అలాగే పరిస్థితులు చక్కబడేవరకు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించింది. ప్రస్తుతం ఉన్నచోటే ఉండాలని, వీధుల్లోకి రావొద్దని హెచ్చరించింది. ఎప్పటికప్పుడు స్థానిక యంత్రాంగం ఇచ్చే సూచనలు పరిగణనలోకి తీసుకోవాలని కోరింది.

నేపాల్‌ సరిహద్దుల్లో ఉన్న ఉత్తర్‌ప్రదేశ్‌ (UP) లోని సొనౌలీ ప్రాంతం మీదుగా భారతీయ పర్యాటకులు తిరిగి స్వదేశానికి వస్తున్నారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో వారంతా తమ పర్యటనను అర్ధంతరంగా ముగించుకొన్నారు. ఇదిలాఉంటే.. చర్చల ద్వారా శాంతియుత పరిష్కారానికి కృషి చేయాలని అధ్యక్షుడు, ఆర్మీ నిరసనకారులను కోరింది. ప్రస్తుతం అక్కడ ఆర్మీ కర్ఫ్యూ ప్రకటించింది. నేపాల్ వెంబడి ఉన్న సరిహద్దు ప్రాంతాల్లో భారత్ భద్రతను కట్టుదిట్టం చేసింది. సాయంత్రం ఐదు గంటల వరకు దేశవ్యాప్తంగా కర్ఫ్యూ కొనసాగనుంది.

Also Read : Actor Darshan: నటుడు దర్శన్ విజ్ఞప్తిపై బెంగళూరు కోర్టు కీలక ఆదేశాలు !

Leave A Reply

Your Email Id will not be published!